ఆవిష్కృతమైన కీలక ఘట్టం

0
143
పోలవరం స్పిల్‌వే కాంక్రీట్‌ పనులకు సీఎం శంకుస్థాపన
2018 చివరికి పూర్తి చేస్తామన్న చంద్రబాబు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 30 : కోట్లాది ప్రజల ప్రాణనాడి…లక్షలాది ఎకరాల జీవనాడి పోలవరం ప్రాజక్ట్‌ స్వప్నం సాకార దిశగా ఈరోజు తొలి అడుగు పడింది.   తెలుగు నేల నలుచెరల గోదావరి జలాలతో పునీతమయ్యే దిశగా  కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర బహుళార్ధసాధక ప్రాజక్ట్‌ పోలవరం నిర్మాణం కీలక దశలోకి అడుగుపెట్టే దిశలో భాగమైన స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులకు ఈ మధ్యాహ్నం 1.59 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. 2018 సంవత్సరాంతానికి ఈ ప్రాజక్ట్‌ను పూర్తి చేయాలనే లక్ష్య సాధనలో కీలకమైన స్పిల్‌ వే పనులకు వేలాది ప్రజల హర్షధ్వనాల మధ్య సీఎం చంద్రబాబు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. పనుల ప్రారంభానికి ముందు జరిగిన యాగంలో సీఎం పాల్గొన్నారు. 101 మంది వేద పండితులు ఈ యాగంలో పాల్గొన్నారు. ప్రాజక్ట్‌ ప్రాంతంలో ముఖ్యమంత్రి భూదేవి మాత విగ్రహాన్ని ప్రతిష్టించి నవగ్రహ మండపారాధన చేశారు. అలాగే స్పిల్‌ వే పనుల ప్రారంభానికి ముందు మత్స్య యంత్రం, నవధాన్యాలు వేసి తాపీతో సిమెంట్‌ వేసి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. పోలవరం ప్రాజక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో 2018 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్న సీఎం అందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో సంద్రింపులు జరుపుతూ వచ్చారు. పోలవరాన్ని జాతీయ ప్రాజక్ట్‌గా ప్రకటించిన  కేంద్రం అందుకయ్యే వ్యయాన్ని పూర్తిగా భరించేందుకు ముందుకురాగా నాబార్డు రుణ సౌకర్యం కల్పించింది. ఇటీవల రూ. 1981 కోట్ల మేరకు నాబార్డ్‌ చెక్‌ను కూడా అందజేసింది. ఈ ప్రాజక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి సోమవారం పోలవరం వారంగా ప్రకటించి అందుకనుగుణంగా ప్రాజక్ట్‌ పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. అంతే గాక ప్రతి నెల ప్రాజక్ట్‌ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు జరిగిన స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల సహకారంతో ఈ ప్రాజక్ట్‌ సాకారమవుతోందని, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తామన్నారు.పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   కాగా రాతి, మట్టి కట్టగా నిర్మించే ప్రధాన డ్యాం పునాది పనిగా పేర్కొనే డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి.