ఆశా వర్కర్ల కష్టాలను తీర్చాలి

0
244
సకాలంలో వేతనాలు వేయాలి – ఉద్యోగ భద్రత కల్పించాలి
అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
రాజమహేంద్రవరం, జులై 18 :  ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సిటీ శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. నెలల తరబడి వేతనాలు రాక… నూతన ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలుకు నోచుకోక నానా ఆగచాట్లు పడుతున్న ఆశా వర్కర్ల తరపున ఆమె మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలకు అండగా ఉంటూ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సమాజ సేవలో తరించే ఆశా వర్కర్లకు సమయానికి వేతనాలు ఇవ్వాలని,  అలాగే ప్రస్తుతం వారిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఆశ వర్కర్లు ఎన్నో వ్యయ ప్రయాసకోర్చి వారి వృత్తిని నిర్వహిస్తున్నారని,రాత్రి పగలు తేడా లేకుండా సమయానికి తిండి లేకుండా సమయపాలన లేకుండా ఎల్లప్పుడు ఆశా వర్కర్లు సమాజ సేవలోనే తరిస్తున్నారని, అలాగే గర్భిణీలు… బాలింతలను సకాలంలో ఆసుపత్రులకు తీసుకువెళ్లి వారికి సఫర్యలు చేయడంలో వారి పాత్ర మరువలేనిదన్నారు. ఆశా కార్మికులు పేదలకు పోషకాహార పంపిణీలో ప్రధాన పాత్ర పోషిస్తారని, అలాగే ఆశా వర్కర్లు అనేక ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో చాలా సహాయం చేస్తున్నారని అన్నారు. వీరి సేవలను గుర్తించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 3 వేలు గౌరవ వేతనం ఇవ్వడంతో ఇన్సెటివ్స్‌ కూడా అమలు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశ వర్కర్లకు నెలకు రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి… ఇప్పటికీ అమలు చేయడం లేదని, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశ వర్కర్ల జీవితాలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు చేస్తున్నారేమోనన్న సందేహం కలుగుతోందన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో వారి ఖాతాలకు వేతనాలు సకాలంలో జమయ్యేవని, అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలనలో ఆశ వర్కర్లు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సకాలంలో వేయకపోవడంతో పేదలైన ఆశ వర్కర్ల కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఆశ వర్కర్లు రోడ్డేక్కి ధర్నాలు… రాస్తారోకోలు వంటి ఆందోళనలు చేస్తున్నారన్నారు. అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆశ వర్కర్లను బెదిరించి ‘మిమ్మల్ని తొలగిస్తున్నాం… మీ స్థానాల్లో కొత్త వారికి వేస్తున్నామంటూ’ దాడులకు దిగుతున్నారని అన్నారు. దీంతో కొంతమంది ఆశా వర్కర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, తల్లీబిడ్డలను కాపాడే వారి మనో ధైర్యం దెబ్బతీసే విధంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు దిగడం మంచి పద్దతి కాదని, అలాగే ఆశ వర్కర్లకు పెంచిన వేతనాలతో కలిపి సరైన సమయానికి వారికి వేతనాలు ఇవ్వాలని, దీనిపై సమాధానాలు చెప్పాలని సంబంధిత శాఖ మంత్రిని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here