ఆసుపత్రి ఎదుట ‘చెత్త’గింపు 

0
509
అపరాధ రుసుము చెల్లించలేదని కార్పొరేషన్‌ వినూత్న చర్య
రాజమహేంద్రవరం, నవంబర్‌ 29 : ‘రాజు’ తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నది ప్రస్తుతం నానుడిలో ఉన్న సామెత….మన నగర ‘రాజు’ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అన్నది నేటి సామెత. నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు తీసుకున్న చర్య ఇపుడీ తాజా సామెతను తలపిస్తోంది…. ప్రస్తుతం నగరమంతా ఇదే చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే… దానవాయిపేటలో సూర్య హోటల్‌ ఎదురుగా ఉన్న పార్ధ డెంటల్‌ హాస్పటల్‌ యాజమాన్యం నగరంలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలకు తమ సంస్ధ వ్యాపార ప్రకటనలతో కూడిన 35 స్టిక్కర్లను అతికించారు. ముందస్తు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఈ స్టిక్కర్లను తొలగించడంతో పాటు  వాటికి రూ. 35 వేలు అపరాధ రుసుము చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం కొంత గడువు ఇవ్వాలని  కోరింది. నగర పాలక సంస్ధ ఇచ్చిన గడువు ముగిసినా వారు వాటిని తొలగించకపోవడంతో కార్పొరేషన్‌ సిబ్బంది ఈరోజు పార్ధ హాస్పటల్‌ ప్రాంగణం వద్దకు చెత్తను తీసుకెళ్ళి పోశారు. కంపుకొ డుతున్న చెత్తతో ఆసుపత్రికి వచ్చిన వారు, పరిసర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కార్పొరేషన్‌ అధికారుల చర్య పట్ల పలువురు ముక్కున వేలేసుకున్నారు.