ఆహార్యంతోనే హాస్యం పండించిన మహానటుడు 

0
536
(నేడు రేలంగి 41వ వర్ధంతి సందర్భంగా…)
నవ్వలేని వారంటూ వుండరు. ఒక వేళ ఎవరైనా అలా నవ్వకపోతే వారు హస్యప్రియులు కారని ఖచ్చితంగా చెప్పవచ్చు. తెరపై కనిపించగానే నవ్వుతెప్పించే నవ్వులరారాజు రేలంగి. ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి హాస్యాన్ని తెరపై కుమ్మరించిన రేలంగి తాను సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మనకున్న హాస్యనటుల్లో ఆనాటి నుంచి నేటి వరకు రేలంగికి ఒక ప్రత్యేకమైన స్ధానం వుంది. ముక్కు, నోరు కనుబొమ్మలు ఇలా శరీరమంతా మనల్ని నవ్విస్తుంది. ఆ కదలికలు, భావప్రకటనలు ప్రేక్షకులను తనవితీరా నవ్వించేవి. ఆయన నడక ఎంత గమ్మత్తుగా వుండేదో,  నడత కూడా అంతే హుందగా వుండేది. హస్యనటునిగా ఎంత పేరు సంపాదించుకున్నారో విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా కూడా అంత పేరు సంపాదించుకున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హస్యనటుడు కూడా రేలంగి కావడం విశేషం. రేలంగి పూర్తిపేరు రేలంగి వెంకట్రామయ్య.  ‘రేలంగోడు’గా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్ధిరస్ధానాన్ని సంపాదించుకున్న నవ్వులరేడు రేలంగి. పొద్దంతా బతుకుతెరువు కోసం వరినాట్లు వేయడానికి వెళ్లే స్త్రీలు, వరి ఆకు తీయడానికి పురుష కూలీలు, కాయకష్టం చేసుకుని జీవనం సాగించే జనం, సినిమా వాల్‌పోస్టర్‌పై రేలంగోడు ఫోటోను చూసి సినిమాకి వెళ్లేవారు అప్పట్లో. నిన్నటి తరం టూరింగ్‌టాకీస్‌లోకి సినిమాకి వెళ్లి అందులో రేలంగి కనిపిస్తే చూడానికి ఫెళ్లునో, భళ్లునో చిన్నచిన్నగా నవ్వుతూ రేలంగి మాటలకి చేసిన మేనరిజానికి పొట్టచెక్కలయ్యేలా పొట్టపట్టుకుని పడిపడి నవ్వేసేవారు. ఇక క్లాస్‌ తరగతుల వారైతే వస్తున్న నవ్వుని ఆపుకుంటూ మెల్లిగా నవ్వే ప్రయత్నం చేసేవారు. నవ్వితే కుటుంబసభ్యుల మధ్య తమ పెద్దరికం ఎక్కడ తగ్గిపోతుందో అని కొందరు వచ్చే నవ్వును ఆపుకుని ఆ తర్వాత తీరుబడిగా తలచుకుని నవ్వుకునేవారు. ఆడవాళ్లైతే చీర పమిట అడ్డంపెట్టుకుని లేదా చేయి అడ్డంపెట్టుకుని నవ్వుతూనే వుండేవారు. అటు క్లాస్‌ని ఇటు మాస్‌ని నవ్వుల్లో ముంచెత్తిన రేలంగి ఆగస్టు 8వ తేదీ 1909 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రేలంగి వెంకటస్వామి, అచ్చాయమ్మ దంపతులకు జన్మించారు. తన మూడవ ఏట తల్లి మరణించడంతో చిన్నమ్మ గౌరమ్మను తండ్రి పెళ్లి చేసుకున్నారు. ఆమె వద్దనే రేలంగి పెరిగారు. సంగీతంలోను, హరికధలు చెప్పడంలోనూ రేలంగి తండ్రి ప్రసిద్ది పొందారు. అలా తన తండ్రి ఇతర విద్యార్ధులకు సంగీతపాఠాలు చెబుతుంటే విని నేర్చుకున్నాడు రేలంగి. పాటలు, పద్యాలు పాడుతుండేవారు. చదువు కన్నా ఆటలమీదే ఆయన ఎక్కువ శ్రద్ద చూపేవారు. రేలంగి తన పదోయేటనే ‘బృహన్నల’ అనే నాటకంలో స్త్రీ పాత్రను ధరించి మొట్టమొదటిసారిగా నటనకు శ్రీకారం చుట్టారు. నాటకాల మోజులో అతికష్టం మీద కాకినాడలోని మెకర్లాన్‌ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి దాకా చదివారు. ఆ తరువాత యంగ్‌మెన్‌ హ్యాపీక్లబ్‌లో చేరి వారి నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు. ఆ సమయంలోనే ఇంకా చిత్రరంగంలోకి ప్రవేశించని ఎస్వీ రంగారావు, అంజలిదేవి కూడా యంగ్‌మెన్‌ హ్యాపీ క్లబ్‌లో సభ్యులుగా వుండేవారు. అప్పట్లో గండికోట జోగినాధం తనను నటునిగా తీర్చిదిద్దినారని రేలంగి చెబుతుండేవారు. రేలంగి 1937లో విడుదలైన ‘భక్తప్రహ్లాద’ సినిమా చూసి విపరీతంగా ఆకర్షింపబడి తానిక సినిమాల్లోనే నటించేయాలని ఒట్టేసుకున్నారు. ఆ రోజుల్లో ఒట్టుతీసి గట్టున పెట్టడానికి సంశయించేవారు. ఆ విధముగా రేలంగి మద్రాస్‌ చేరుకున్నారు. రేలంగి వేషాల కోసం తిరుగుతూ 1935లో కలకత్తా వెళుతున్న శ్రీకృష్ణతులాభారం చిత్ర యూనిట్‌లో కలిసిపోయారు. ప్రయాణించే రైల్లో అందరితో మంచిగా వ్యవహరిస్తూ కలకత్తా చేరాక ముఖ్యులను పట్టుకుని యూనిట్‌కి అన్నిరకాలుగా సాయం చేస్తూ ఆ చిత్రంలో చిన్న వేషం వేశారు. విశేషం ఏమిటంటే రుష్యేంద్రమణి, లక్ష్మీరాజ్యం, కాంచనమాలలకు కూడా ఇదే తొలిచిత్రం. ఆ తర్వాత సి.పుల్లయ్య దర్వకత్వంలో ‘అనసూయ’ చిత్రంలో ఇంద్రునిగా నటించాడు రేలంగి. అప్పుడు రేలంగికి రూ.30 జీతం ఇచ్చేవారు. చిన్న చితకా వేషాలు వేస్తున్నా రేలంగికి తగిన గుర్తింపు రాలేదు. అప్పటికే 12 సంవత్సరాలు దాటిపోయింది ఫీల్డ్‌కి వచ్చి. వరవిక్రయం, గొల్లభామ వంటి చిత్రాల్లో నటించినా రేలంగి పరిస్థితిలో మార్పురాలేదు. అనారోగ్యంతో బాధపడే తండ్రి, కడుపుతో వున్న భార్య ఇలా కష్టాలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. ఆ సమయంలో డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. అయినా ఏమాత్రం భయపడక ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొన్కారు. వింధ్యారాణి, కీలుగుర్రం, మదాలస చిత్రాల్లో మంచి పాత్రలు లభించాయి. హెచ్‌.ఎమ్‌.రెడ్డి గుణసుందరికధ చిత్రంలో ప్రాముఖ్యమైన పాత్ర లభించింది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంగతిని ప్రస్తావించాలి. అప్పటిదాకా కామెడీ స్టార్‌గా కస్తూరి శివరావుకు విశేషమైన పేరు వుండేది. ఎప్పుడైతే గుణసుందరికధ చిత్రం విడుదలైందో అప్పటి నుంచి ప్రేక్షకుల దృష్టి, చిత్ర పరిశ్రమ దృష్టి రేలంగిపై పడింది. తన సహజసిద్దమైన హావభావాలతో ఒక కొత్తపంధాలో ప్రదర్శించిన రేలంగి పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత పాతాళభైరవి సినిమాలో రేలంగి స్వయంగా పాడిన వినవే బాల పాట ఆయనను మరింత పాపులర్‌ చేసింది. ఆ తర్వాత రేలంగి-రమణారెడ్డి, రేలంగి-సూర్యకాంతం, రేలంగి-గిరిజ కాంబినేషన్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. నర్తనశాల సినిమాలో ఉత్తరకుమారుడిగా, మాయాబజార్‌లో లక్ష్మణకుమారుడిగా, ప్రేమించిచూడులో బుచ్చబ్బాయిగా, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా, వెలుగునీడలులో వెంగళప్పగా, లవకుశ సినిమాలో చాకలి తిప్పడుగా, జయభేరి సినిమాలో బచ్చన్న బంగారయ్యగా, జగదేకవీరుడు కధలో రెండుచింతలుగా, అప్పుచేసి పప్పుకూడులో భజగోవిందంగా, సువర్ణసుందరిలో కైలాసంగా, తోటికోడళ్లులో రమణయ్యగా, మిస్సమ్మలో దేవయ్యగా, పక్కింటి అమ్మాయిలో సుబ్బారాయుడిగా, జయసింహ, ఆత్మబంధు, రాము, కులగోత్రాలు, నమ్మినబంటు సినిమాలలో ఆయన చేసిన పాత్రలు చిరస్మరణీయం. నటునిగానే కాకుండా ఆయన నిర్మాతగా 1960లో సమాజం చిత్రాన్ని నిర్మించారు. భాగస్వామిగా మిస్సమ్మ సినిమా తీశారు. పెద్దమనుషులు, విప్రనారాయణ, బ్రతుకుతెరువు చిత్రాలలో పాటలు కూడా పాడారు. తినడానికి, ఉండటానికి కూడా లేక తొలిరోజుల్లో కష్టపడ్డ రేలంగి సంపాదన పరుడయ్యాక చదువకుంటామనుకునేవారికి, పెళ్లి చేసుకుంటామనే వారికి, ఇబ్బందుల్లో వున్నవారికి విరివిగా సాయం చేసేవారు. కొందరు అబద్దం ఆడుతున్నారని తెలిసినా వాళ్లకీ ఆర్ధిక సాయం చేసేవారు. సాయం తీసుకున్నవాడు వెళ్లిపోగానే పెళ్లి చేయాలని, ముహర్తం దగ్డరపడిందని చెబుతూ ఈ ఏడాది ఇప్పటికే ఐదోసారి ఇలా డబ్బు పట్టుకెళ్లడం అతడు పెళ్లి ఎవరికి చేస్తాడో, అసలు చేయడో కాని నా పెళ్లి మాత్రం చేస్తున్నాడు డబ్బు వంకతో అనే వారు నవ్వుతూ రేలంగి. రేలంగి విశ్వవిద్యాలయాలకు విరాళాలు ఇచ్చారు. అంతేకాదు ఆకలిబాధ తెలిసిన వ్యక్తిగా ప్రతి రోజూ తన ఇంట్లో పాతిక మందికి భోజనం పెట్టించేవారు. రేలంగిని ఒక పాత్రికేయుడు మీకు నచ్చిన జోకు చెప్పండని ఒక సందర్భంలో అడిగితే నేను సినిమాల్లోకి వేషాలు వేయడానికి ప్రయత్నించే రోజుల్లో డబ్బుకు చాలా ఇబ్బందిగా వుండేది. ఆఖరుకు వేరుశెనక్కాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు వుండేవి కావు. ఇప్పుడు నాకు అన్ని వున్నాయి, కానీ ఏమి తిన్నా అరిగించుకోలేని పరిస్థితి అంటూ జీవితానికి మించిన జోకు మరోకటి లేదంటూ తన మీద తనే జోకు వేసుకున్న హాస్యప్రియులు రేలంగి. కొన్ని చిత్రాలలో రేలంగి ఏడ్చినా ప్రేక్షకులకు నవ్వు వచ్చేది. నిజజీవితంలో తన దగ్గర బంధువు ఎవరో పోతే స్వగ్రామం వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొంటూ బాధను ఆపుకోలేక భోరున ఏడ్చారట రేలంగి. రేలంగి వచ్చాడన్న కారణంగా శ్మశానికి జనం విపరీతంగా వచ్చి రేలంగి  ఏడుపును చూసి భళ్లుభళ్లున నవ్వారట. నా బాధ వాళ్లకి నవ్వుతెప్పించినందుకు చాలా బాధ వేసింది. హాస్యనటుని ఎందుకయ్యానా అనిపించింది అని తర్వాత చెప్పి బాధపడ్డారు రేలంగి. ఇక్కడో ప్రత్యేకమైన సంగతిని ప్రస్తావించాలి. తొలి కామెడీ స్టార్‌గా వెలిగిని కస్తూరి శివరావు, రేలంగి, పేకేటి శివరామ్‌, నవ్వుల నేరేడు రాజబాబులు తూర్పుగోదావరి జిల్లా వాసులు కావడం. రేలంగి,రాజబాబులు అనేక గుప్తదానాలు, కాలేజీలు కట్టించడం తూర్పుగోదావరి జిల్లా వాసులు గర్వించతగిన విషయం. పూర్వం హస్యనటుల నిలయం తూర్పుగోదావరి అయితే ఇప్పుడు హస్యనటుల హవా పశ్చిమగోదావరి జిల్లాది. బ్రహ్మానందం, సునీల్‌ది పశ్చిమగోదావరి జిల్లాయే. ఎప్పుడూ నవ్విస్తూ, నవ్వుతూ వుండే రేలంగి నవంబరు 26న 1975 సంవత్సరంలో స్వర్గస్తులై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను ఏడిపించారు.
-అడబాల మరిడయ్యకాపు,
దొడ్డిగుంట, 7386652375