ఆ తీరు పార్టీకి శ్రేయస్కరం కాదు సుమా !

0
291

గోరంట్ల, ఆదిరెడ్డి సంవాదంపై గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12 : ఆధిపత్య పోరు కోసం ఏ నాయకుడూ కూడా పార్టీని ప్రజల మధ్య చులకన చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. ఇటీవల కౌన్సిల్‌లో ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డిల మధ్య తలెత్తిన వివాదంపై ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు గన్ని సమాధానమిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే దానిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఇలాంటి విషయాలు పార్టీ సమావేశాల్లో చర్చించుకోవాలని, అంతే గాని ప్రజల్లో చులకనయ్యేలా రచ్చకెక్కడం సరికాదని ఆయన సూచించారు. ప్రజా సమస్యలకు వేదికగా నిలిచే కౌన్సిల్‌లో ఇలా ఆధిపత్య పోరుకు దిగడం మంచిది కాదని, గతంలో తాను ఆధిపత్య పోరు కోసం మాట్లాడినప్పటికీ అనుభవం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని ఆయన వ్యాఖ్యానించారు. కౌన్సిల్‌ సమావేశంలో ఇద్దరి నేతల మధ్య ఎలాంటి వివాదం జరగకుండా ఉండి ఉంటే బాగుండేదన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు సంయమనం

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబునాయుడు ఎంతో సంయమనంతో ఉన్నారని, కేంద్రంతో ఎప్పుడు సంఘర్షణ పడాలో, నిలదీయాలో తమ నాయకునికి తెలుసని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం ఏం చేసిందో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఒక లేఖ ద్వారా వివరించారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమ ఎంపీలు పార్లమెంట్‌లో చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా బిజెపి నేతలు చేసిన ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీల సాధనకై జేఏసీ ఏర్పాటు చేస్తామంటున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనధికార ప్రతినిధిగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ఆయన ప్రక్కన పెట్టుకోవడంపై ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను పక్కన పెట్టుకుని అడ్రస్‌ లేకుండా అయిపోవడంపై పవన్‌ ఆలోచించుకోవాలని కోరారు. ఉండవల్లికి నరనరాన చంద్రబాబు అంటే ద్వేషమని, అందుకే రాష్ట్రం కోసం చంద్రబాబు ఏ చేస్తున్నా ద్వేషించడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి ఇంతవరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రధాని మోడీని విమర్శించలేకపోయారని, ఆయనకన్నా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అనేకసార్లు మోడీని, బిజెపి నాయకులను నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తే జైలుకు వెళ్ళడం ఖాయమనే భయంతో జగన్‌ తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్రమోడీ భజన చేస్తున్నారని గన్ని కృష్ణ విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here