ఇంకెందుకు….పచ్చ  చొక్కా వేసుకో 

0
309
కారెం శివాజీపై వైకాపా ఎస్సీ సెల్‌ నేతల ధ్వజం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 22 :  జగన్‌ అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేస్తానన్న ఎస్సీఎస్టీ కమిషన్‌ అధ్యక్షుడు కారెం శివాజీపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు ధ్వజమెత్తారు. దళితుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టిన శివాజీకి జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. జాంపేటలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాసా రాంజోగ్‌, మార్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు చంద్రబాబును పదే పదే ధూషించిన కారెం శివాజీకి ఎస్సీఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వగానే  ఆయన దేవుడు ఎలా అయ్యాడని వారు ప్రశ్నించారు. మాసా రాంజోగ్‌ మాట్లాడుతూ కేవలం తన ప్రాపకం పెంచుకోవడానికే నగరంలో ఇటీవల దళిత, గిరిజన మహాగర్జన నిర్వహించి సీఎంను ఆహ్వానించిన శివాజీకి జగన్‌ను విమర్శించే అర్హత,  స్థాయి లేవని అన్నారు. జగన్‌ను విమర్శిస్తున్న శివాజీ అసలు ఎస్సీఎస్టీ కమిషన్‌ పదవికి తాను అర్హుడినా కాదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. ఎస్సీఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి ఎందరో అర్హులు ఉండగా వారిని, నియామక పద్ధతిని విస్మరించి ప్రభుత్వం శివాజీని నియమించగా తన పదవి పోవడానికి జగన్‌ కారకుడని ఆయన రంకెలు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేవలం తన ప్రాపకం పెంచుకోవడానికి ఈ సభను అడ్డుపెట్టుకున్నారన్నారు. చంద్రబాబు భజన చేస్తున్న శివాజీ ముసుగు వేసుకుని మాట్లాడకుండా పచ్చచొక్కా వేసుకుంటే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ తన పదవి కోసం మాలల హక్కుల్ని బాబు పాదాల వద్ద శివాజీ తాకట్టు పెట్టారని అన్నారు. పదవి ఊడగానే శివాజీకి మాలలు, దళితులు గుర్తుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు భజన చేస్తున్న ఆయన తెదేపాలో చేరితే ఎవరికీ అభ్యంతరం లేదని ఆయన ఆన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్‌ పదవికి శివాజీ ఎంతమాత్రం అర్హుడు కాదని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో కాటం రజనీకాంత్‌, ఆముదాల పెదబాబు, కార్పొరేటర్‌ ఈతకోట బాపన సుధారాణి తదితరులు పాల్గొన్నారు.