ఇంట్లో అక్కకి ఇదపనోడు పక్కింటి చెల్లికి పట్టుచీర పెట్టాడుట !

0
484
మనస్సాక్షి  – 1104
ఆదివారం ఉదయం.. మామూలుగా అయితే యిలా ఆదివారం వస్తే తన సొంతూరు పోయి హల్‌చల్‌ చేస్తుండాలి. అయితే ఈరోజు  ఓ పెళ్ళి రిసెప్షన్‌ ఉండడంతో రాజ మండ్రిలోనే ఉండిపోయాడు. ఎలాగూ ఊళ్ళోనే ఉన్నా కదా అని గిరీశం గారింటికి బయలుదేరాడు. వెళ్ళేసరికి గిరీశంగారి  యింటి తలుపులు తెరిచే ఉన్నాయి. అయినా గిరీశం గారు యింట్లోలేరని అర్థమయి పోతోంది. దాని క్కారణం లోపల్నుంచి గిరీశం మేనల్లుడి అరుపులూ, ఆ వెనుకే మేనకోడలి ఏడుపూ పెద్దగా వినపడుతూండడమే. గిరీశం గారు యింట్లో ఉంటే వాళ్ళెవరూ నోరెత్తరు. అదీ సంగతి. దాంతో వెంకటేశం గబగబా లోపలికి నడిచాడు. ఆపాటికి  అయిదేళ్ళ టింకూ యిల్లదిరిపోయేలా ఏడుస్తోంది. వెంకటేశాన్ని చూడగానే గబగబా దగ్గరికి పరిగెత్తుకొచ్చేసింది. వెంకటేశం టింకూని ఎత్తుకుని ”ఏరా.. ఏవయిందీ?” అనడిగాడు. టింకూ ఏడుస్తూనే ”చూడు బాబాయ్‌.. ఈ వెధవ నన్ను కొట్టేడు” అంది. ఈలోగా పక్కనున్న బాబీగాడు కోపంగా ”మరి నా డ్రాయింగ్‌ పుస్తకంమీద  పిచ్చిగీతల గీస్తే ఊరుకుంటానా?” అన్నాడు. దాంతో వెంకటేశం ”పోన్లేరా.. అది చిన్నది కదరా.. అన్నాడు. బాబీగాడు దానికి ఊరు కోకుండా ”ఆ.. నేనూ.. చిన్నోడినే కదా. యింట్లో సామానులేవ యినా పాడుచేస్తే ఊరుకుంటున్నారా?” అని అడిగాడు.  బాబీ గాడి మాటలకి వెంకటేశం దగ్గర సమాధానం లేదు. అంతలోనే ”సర్లే..సర్లే.. అయినా యివాళ రాఖీ కదరా.. మీ చెల్లెల్ని ఎంత బాగా చూసుకోవాలని.. రాఖీ తెచ్చి దానితో కట్టించుకుని, దానికిష్ట మయిన చాక్లెట్లవీ యివ్వు” అన్నాడు. బాబీగాడు తలూపి ”అలాగే బాబాయ్‌.. మరి అయ్యన్నీ కొనడానికి డబ్బులు కావాలి కదా” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఆ డబ్బులేవో నేనిస్తాగానీ నువ్వెళ్ళి తీసుకురా” అన్నాడు జేబులోంచి డబ్బులు తీస్తూ. అయితే అప్పుడో గమ్మత్తు జరిగింది. టింకూ హఠాత్తుగా ”వాడికి డబ్బు లివ్వొద్దు బాబాయ్‌.. వాడింతకు ముందే రాఖీ, చాక్లెట్లూ తెచ్చే శాడు” అంది. దాంతో వెంకటేశం నిజమా అన్నట్టుగా చూశాడు. బాబీ  గాడు మాత్రం ”అబ్బే.. లేదు బాబాయ్‌” అన్నాడు. అయితే టింకూ ఒప్పుకోకుండా ”లేదు బాబాయ్‌.. తెచ్చాడు” అంటూ వెంకటేశం చంక దిగి గబగబా పక్కగదిలోకి పరిగెత్తికెళ్ళి, అక్కడ సొరుగులో పెట్టిన రాఖీ, చాక్లెట్లూ పట్టుకొచ్చి చూపించింది. దాంతో బాబీగాడు యిబ్బందిపడి ”యివేవీ టింకూ కోసం కాదు” అన్నాడు.  దాంతో వెంకటేశం ఆశ్చర్యంగా ”మరెవరి కోసంరా?” అన్నాడు.  బాబీగాడు యింక తప్పదన్నట్టుగా ”మన పక్కింట్లో ఉండే సుబ్బలక్ష్మీ ఆంటీ వాళ్ళమ్మాయి లల్లీ కోసం” అన్నాడు. దాంతో అటు టింకూ, యిటు వెంకటేశం షాక్‌తో నోరెళ్ళబెట్టారు. ఈలోగా బాబీగాడు వాటిని తీసుకుని తుర్రుమని పక్కింటికి వెళ్ళిపోయాడు. టింకూ అయితే చిన్నగా ఏడ్చుకుంటూ లోపలకెళ్ళిపోయింది. యింతలోనే చుట్ట గుప్పుగుప్పుమనిపించుకుంటూ గిరీశం బయట నుంచి వచ్చాడు. వస్తూనే ”ఏవివాయ్‌ వెంకటేశం.. ఎంత సేపయిందొచ్చి? విశేషాలేంటీ?” అన్నాడు. ఈలోగా వెంకటేశం అక్కడున్న కుర్చీలో సెటిలై ”ఆ.. ఆడెవడో కన్నతల్లికి కూడెట్టడంట…  పినతల్లికి కోక పెడతాడంట” అన్నాడు. గిరీశం తలూపి ”యిప్పుడా విషయం చెప్పే అవసరం ఏమొచ్చిందంట?” అన్నాడు. ఈసారి వెంకటేశం కొంచెం  అసహనంగా ”యిదిగో..ఈ బాబీగాడినిర్వాకం యిలాగే ఉంది లెండి” అంటూ జరిగిందంతా చెప్పాడు. గిరీశం తలూపి ”వీడనేవుందిలే..  అవతల అంతటి మహారాజుగారి తీరే అలా ఉందే” అన్నాడు. వెంకటేశం అర్థంకానట్టు చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”మరేంలేదోయ్‌.. మొన్న కేరళా వాళ్ళకి ఏర్పడ్డ కష్టం నుంచి ఆదుకోవడానికి యూఏఇ రాజుగారు ఓ 700 కోట్లు విరాళంగా యిస్తానని ప్రకటించారన్న వార్తలొచ్చాయి. ఈ సందర్భంలో యింకో విషయం ప్రస్తావించాల్సి ఉంది. అది సోమాలియా దేశం గురించి. జనాభాలో దాదాపు 95 శాతం ముస్లింలు ఉండే అత్యంత పేద దేశం అది. అంతేకాదు. ఈ యూఏఇకి  సన్నిహిత దేశం. యిక సోమాలియాలో ఎప్పుడూ దారుణమైన  క్షామ పరిస్థితులే. మరి తమకి దగ్గర దేశమయిన సోమాలియాకి గతంలో యూఏఇ ముష్టిలా విదిలించింది కేవలం అయిదుకోట్లు…! అలాంటి దిప్పుడు ఎక్కడో భారతదేశంలోని కేరళకి 700 కోట్లు యిస్తా నంటే  ఏవనుకోవాలి? యిదేదో ”యింట్లో సొంత చెల్లెల్ని పట్టించుకోకుండా ఊళ్ళో అరువు చెల్లెళ్ళందరి మీదా అభిమానం ఒలకబోసే వ్యవహారంలా లేదూ” అన్నాడు. వెంకటేశం తలూపి ”నిజమే గురూగారూ.. మొత్తానికి రాఖీ పూట ఈ అన్నయ్యలందరికీ  ఓ చిన్న చురక వేసేశారన్నమాట. సరే.. అదలా ఉంచండి. యింతకీ  యిందులో మనకి పనికొచ్చే రాజ కీయ వ్యవహారం ఏవయినా ఉందా?” అంటూ అడిగాడు. ఈసారి గిరీశం కొంచెం ఆలోచించి ”లేకేవోయ్‌.. బ్రహ్మాండంగా ఉంది. ఈ 700 కోట్ల విరాళం విషయంలో చిన్న వివాదం ఒకటి నడుస్తోంది. అలా యూఏఇ రాజుగారు ప్రకటించిన విరాళం స్వీకరించడానికి కొన్ని అడ్డంకులునన్నాయని ప్రధాని అనడం ఆ వివాదానికి కారణం. ‘అమ్మ పెట్టనూ పెట్టదు. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా కేంద్రం తానిచ్చేది నామమాత్రంగానే ఉన్నప్పటికీ, ఎవరో ఉదా రంగా యిస్తానన్నదానికి అడ్డం సడిపోతుందన్నది ఆ వాదన. అయితే కేంద్రం అలా ప్రకటించడానికో, కారణముంది. మన దేశం ఆయా చితంగా వస్తోంది కదాని పరాయి దేశాలవాళ్ళు యిచ్చే విరాళాన్ని స్వీకరించేస్తే రేపు కొన్ని విషయాల్లో  ఆ దేశానికి తలొగ్గి ఉండ వలసి రావచ్చు. ఆ విషయలేవో దేశ ఆత్మగౌరవానికీ, సార్వ భౌమత్వానికీ భంగం కలిగించేవి  కావచ్చు. అందుకే 2004లోనే  అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం యిలా విదేశాల నుంచి సహాయం ఏదయినా స్వీకరించే విషయంలో నిర్ణయాలు కఠినతరం చేసే సింది. నిజానికి అది మంచి సాంప్రదాయం. అదలా ఉంచి యిప్పుడు యూఏఇ నుంచి ఆ విరాళమేదో తీసుకుంటే  కొన్ని యిబ్బందులు వచ్చే అవకాశముంది. కాశ్మీర్‌ కోసం నిరంతరం పోరాడేది మన దేశం. రేపు పాకిస్తాన్‌కి వత్తాసు పలుకుతూ యూఏఇ ముందుకొస్తే మనం పిల్లిలా అయిపోయే పరిస్థితి రావచ్చు. యిదనే కాదు. ఆ విరాళమే తీసుకుంటే యిలాంటివే మరికొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చు. అందుకే అలాంటి యితర దేశాల ఆయాచిత విరాళాలు స్వీకరించకపోవడమే మంచిది” అంటూ వివరించాడు. వెంకటేశం అవునన్నట్టుగా తలూ పాడు. యింతలో గిరీశం కొనసాగిస్తూ ”ఏతావాతా చెప్పేదేం టంటే.. ఈ రాఖీ కట్టడం అనేది మంచి సంప్రదాయమే. ఆప్యాయ తల్నీ, బంధాల్నీ చాటి చెప్పేదే. అలాగని రాఖీ కట్టకపోయినా అవన్నీ సోదర, సోదరీమణుల మధ్య అంత ఉన్నతంగానూ ఉంటాయి. అయితే నేను మాట్లాడేది రాఖీ కట్టినా తర్వాత్తర్వాత తప్పుడు సంబంధాలకి దారితీసే కొన్ని ఫేస్‌బుక్‌ అన్నాచెల్లెళ్ళ వ్యవహారాలు గురించి. అలాంటి సంఘటనలు బయట ఎన్నెన్నో. యిక ఈ యూఏఇ విషయమే తీసుకుంటే తమకి ఎంతో కావల సిన సొంత చెల్లెలిలాంటి సోమాలియాని కనీసం పట్టించుకోకుండా రాఖీ కట్టిన అరువు చెల్లెలిలాంటి మనదేశం మీద యింత దాతృత్వం చూపించెయ్యడం ఎంతవరకూ నమ్మొచ్చు?” అన్నాడు. టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌ ఫ్లాష్‌ అవుతోంది” యూఏఈ 700 కోట్లు కేరళకు ఇచ్చే విషయం ఏమి అనుకోలేదని !”
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here