ఇది మరొక దగా! (శనివారం నవీనమ్)

0
352

ఇది మరొక దగా!
(శనివారం నవీనమ్)

కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదని సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ వేసిన నరేంద్రమోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై కక్షను మరోసారి బయటపెట్టుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, విభజన హామీల అమలులొ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల జాబితా ఇలా పెరుగుతూనే వుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణ చట్టం 13వ షెడ్యూల్‌ నిర్దేశాన్ని ఇప్పటికే డస్ట్ బిన్ లో వేసింది. రాష్ట్ర పునర్నిర్మాణ చట్టాన్ని, దానిని పార్లమెంటు ఆమోదించిన సందర్భంలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను గత నాలుగేళ్లుగా అమలు చేయని మోడీ సర్కారు తాజా దాష్టీకం ఇది!

ఆంధ్రప్రదేశ్‌కు చేయవలసినదాంట్లో కేంద్రం 85శాతం పూర్తి చేసిందన్న అమిత్‌షా మొదలు గల్లీలోని బిజెపి నాయకులవరకూ చేస్తున్న ప్రకటనలు నిజాలుకాదని ప్రజలకు తెలిసిపోతున్నది. 
కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదంటూ సెయిల్‌ 2014 డిసెంబర్‌లో ఇచ్చిన నివేదికను 2018 జూన్‌ 13న సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేయడంలోనే కేంద్రప్రభుత్వ దగా స్పష్టమవుతోంది.

ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎంఎంటిసి, మెకాన్‌ సంస్థల ప్రతినిధులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను 2016 అక్టోబర్‌లో నియమించారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలున్నాయనీ, అనంతపురం గనుల ఖనిజం నాణ్యత ఎక్కువనీ మెకాన్‌ సంస్థ నిర్ధారించింది. కడప ఉక్కు కర్మాగారానికి ఆ ఖనిజ నిక్షేపాలను కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతనూ తెలిపింది. వీటన్నిటి ఆధారంగా కడప ఉక్కు కర్మాగార ఏర్పాటు సాధ్యమేనని మెకాన్‌ సంస్థ ఈ ఏడాది సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయినా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో 2017 డిసెంబర్‌నాటి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం గురించి మాత్రమే పేర్కొనడం వాస్తవాన్ని మభ్యపుచ్చడానికే. సర్వోన్నత న్యాయస్థానానికి కూడా కేంద్ర ప్రభుత్వం అర్ధ సత్యాలనే నివేదిస్తున్నదని విదితమవుతోంది. సామాన్య ప్రజలనేగాక న్యాయ వ్యవస్థనూ మోడీ సర్కారు వంచిస్తున్నదన్నమాట. 

కడప ఉక్కు విషయంలో మోసాన్ని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో నిరసించగానే కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటన విడుదల చేయడం మరో కొత్త నాటకానికి తెర లేపడమే. ఆ ప్రకటనలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తాజా సమావేశం జూన్‌12న జరిగిందని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని సుప్రీంకు జూన్‌13న సమర్పించిన అఫిడవిట్‌లో ఎందుకు వెల్లడించలేదు? ఏర్పాటుకు అనుకూలంగా మెకాన్‌ సంస్థ సమర్పించిన ప్రాథమిక నివేదికను గురించి తాజా ప్రకటనలో కూడా ప్రస్తావించలేదంటేనే కడప ఉక్కుపట్ల కేంద్రం ఎంత ప్రతికూలంగా వుందో స్పష్టమవుతోంది.

ప్రజల్లో గందరగోళం పెంచడానికే ఈ తాజా వివరణ ఇచ్చారన్నది సుస్పష్టం. ఇలా ప్రకటనలపై ప్రకటనలు చేయడం మోడీ సర్కారుకు కొత్త కాదు. గతంలో ప్రత్యేక హౌదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని 2017 మార్చి 15న ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించడం, దానిపై వ్యతిరేకత క్రమంగా పెరగడంతో దాదాపు అలాంటిదే మరో ప్రకటనను 2018 ఫిబ్రవరి 9న చేశారు. రాష్ట్రానికి హౌదా రాలేదు… ప్యాకేజి అంటూ ఊరించిన నిధులూ హుష్‌ కాకే! ఇలాంటి జిమ్మిక్కులతో నెట్టుకురావాలని ప్రయత్నిస్తున్న బిజెపిపట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. 

రైల్వే జోన్‌ ఏర్పాటుపైనా ఎన్‌డిఎ ప్రభుత్వం మోసగిస్తోంది. రైల్వేబోర్డు నిర్ణయం చేయాలంటూ దోబూచులాడుతూనేవుంది. గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు చేపట్టవలసిన చట్ట సవరణను ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోంది. రాష్ట్ర ఖజానాకు 2014-15 ఏడాది లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని నిర్మాణానికి, కేంద్ర ఉన్నత విద్యా, వైద్య సంస్థలకు నిధుల కేటాయింపు తదితర విషయాల్లో అమలు అరకొరగానే వుంది. ప్రత్యేక హౌదాకు మంగళం పాడింది.

వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు మూడేళ్లు మాత్రమే ఇచ్చి, తర్వాత నిలిపివేసింది. పోర్టు ఏర్పాటుకూ తిలోదకాలిచ్చింది. ఇలా అనేక అంశాల్లో తెలుగు ప్రజలపట్ల మోడీ సర్కారు ద్వేషపూరితంగా వ్యవహరిస్తోంది. దానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం వివిధ రూపాల్లో వెల్లడవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here