ఇలా అయితే ప్రజలే బుద్ధి చెబుతారు

0
380
మేయర్‌ తీరుపై వైసిపి నేత గుత్తుల మురళీధర్‌ ధ్వజం
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : నగరాన్ని అభివృద్ధిపరచడంలో ముందుండాల్సిన మేయర్‌ పంతం రజనీ శేషసాయి ఆటంకంగా నిలుస్తున్నారని, క్రమ పద్ధతిలో జరగాల్సిన కౌన్సిల్‌, స్టాండింగ్‌ కమిటీ సమావేశాలను వాయిదాలు వేస్తూ అభివృద్ధి పనులను పెండింగ్‌లో పెడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధరరావు ధ్వజమెత్తారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. నిన్న జరగాల్సిన స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని అర్థాంతరంగా ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. స్టాండింగ్‌ కమిటీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు నగరాభివృద్ధికి సంబంధించినవని, ఇలాంటి వాయిదాలు వేస్తే నగరాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్‌ కమిటీ సభ్యులు మేయర్‌ ఆకస్మిక నిర్ణయానికి అవాక్కయ్యారని, గత సభ్యులు కూడా ఇదే ధోరణి చవి చూశారన్నారు. సొంత సొమ్ము నగరానికి ఖర్చుపెడుతున్నట్లుగా ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడంలేదని, ఈ ఆవేదన సొంత పార్టీలో కూడా రగులుతోందని విమర్శించారు. గడచిన రెండున్నరేళ్ళలో ఏ డివిజన్‌లోనూ మేయర్‌ పూర్తిగా పర్యటించలేదని, నగరంపై ఆమెకు అవగాహన లేదని దుయ్యబట్టారు. నగరపాలక సంస్థలో తుగ్లక్‌ పాలన నడుస్తోందని మండిపడ్డారు. నగరపాలక సంస్థ పరిపాలనను గాడిలో పెడతానని తెదేపా నాయకులు పదే పదే  చెబుతున్నప్పటికీ అవి మాటలకే పరిమితమవుతున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే మూడుసార్లు నగరపాలక సంస్థ పీఠాన్ని కైవసం చేసిన ప్రజలు బుద్ధి చెబుతారని, తెదేపా నేతలు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఎజెండాలోని అంశాలను సాకుగా చూపి వాయిదా వేయడం సరికాదని, ప్రతిపక్ష పార్టీగా తాము గగ్గోలు పెట్టినప్పుడే కౌన్సిల్‌ నిర్వహించాలన్న విషయం మేయర్‌కు గుర్తొస్తుందని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఆందోళన చేస్తామని, గత పాలకవర్గాల మాదిరిగా రాజకీయాలను పక్కనపెట్టి నగరాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. జాంపేట బ్యాంక్‌లో విజయం సాధించిన బొమ్మన రాజ్‌కుమార్‌ ప్యానెల్‌కు, వైసిసి తరపున పోటీ చేసిన ముప్పన శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. ఈనెల 6న విశాఖలో జరిగిన వై.ఎస్‌.జగన్‌ సభకు ఊహించని విధంగా ప్రజా స్పందన లభించిందన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల, బొంతా శ్రీహరి, పార్టీ నాయకులు పెంకే సురేష్‌, గారా త్రినాధ్‌, ఉల్లం రవి, షేక్‌ మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.