ఇళ్ళ పట్టాల వ్యవహారంపై  విచారణ జరపాలి 

0
198
సబ్‌ కలెక్టర్‌కు బిఎస్పీ నాయకుల వినతి
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 29 : మూడు దశాబ్ధాలుగా ప్రభుత్వ స్థలంలో గూడు వేసుకుని నివాసిస్తూ జీవనం సాగిస్తున్న ప్రజలను నమ్మించి పట్టాలు ఇచ్చామంటూ జబ్బలు సరుసుకుంటున్న అర్బన్‌ తహాశీల్దార్‌ కార్యాలయం అధికారుల తీరుపై బహుజన సమాజ్‌ పార్టీ(బిఎస్‌పి) జిల్లా అధ్యక్షులు, నగర పాలక సంస్థ స్థాయీ సంఘం మాజీ ఛైర్మన్‌ బర్రే కొండబాబు మండిపడ్డారు. ప్రతీ వారం జరిగే గ్రీవెన్స్‌లో భాగంగా ఈరోజు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇచ్చిన పేదల ఇళ్ల పట్టాల భాగోతంపై ఫిర్యాదు చేశారు. నగరంలోని 49వ డివిజన్‌లోని సుబ్బారావు నగర్‌లో సుమారు 30 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వారికి అర్బన్‌ తహాశీల్దార్‌ కార్యాలయం అధికారులు ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో పట్టాలు ఇచ్చారు. తమకు సొంత ఇంటి స్థలం వచ్చిందన్నా సంతోషంతో ఉన్న గూడును తీసేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పక్కా గృహాలను నిర్మించుకునేందుకు వారు సన్నద్ధం అయ్యారు. నిరక్షరాస్యులైన సదరు లబ్ధిదారులు తమకు ప్రభుత్వ పట్టా ఉందని, కొత్తగా ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని సంబంధిత లబ్ధిదారులు గృహా నిర్మాణ శాఖ అధికారులను కలుసుకున్నారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇచ్చిన పట్టాలను గృహా నిర్మాణ శాఖ అధికారులకు అందించారు. ఆ పట్టాలను తీసుకున్న గృహా నిర్మాణ శాఖ అధికారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. కొత్తగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాల్లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి 13 చదరపు గజాల స్థలం చొప్పున, మరో ఐదుగురికి 17 చదరపు గజాలు, మరో ఇద్దరికి 22 చదరపు గజాల చొప్పున ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఆయా స్థలాల్లో పక్కా గృహాన్ని నిర్మించడానికి అవకాశం లేదని గృహా నిర్మాణ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ వార్డు కార్పొరేటర్‌ బర్రే అనుహెలోనియా దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం అర్బన్‌ తహాశీల్దార్‌ కార్యాలయం అధికారులు చేసిన నిర్వాకాన్ని బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు ఈరోజు సంబంధిత బాధితులను తీసుకుని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిరక్షరాస్యులను మభ్యపెట్టి ఉన్న గూడులను కోల్పోయేలా వ్యవహరించిన రెవెన్యూ అధికారుల తీరుపై విచారించి బాధితులకు న్యాయం చేయాలని, వారం రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని గ్రీవెన్స్‌ నిర్వాహకులకు తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ బర్రే అనుహెలోనియా, బాధితులు సేనాపతి నాగరాజు, సేనాపతి వీరలక్ష్మి, సేనాపతి ప్రసాద్‌, సీత.రూపారాణి, నూలు గణేష్‌, చిట్టిమాని అప్పన్న, అప్పికొండ వెంకటలక్ష్మి, ఎస్‌కె అలీషా, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here