ఇసుక గాయాలు ఎప్పటికి తగ్గేను? 

0
101
(నవీనమ్‌)
ఏ ప్రభుత్వమైనా ఒక కొత్త విధానాన్ని తీసుకురాదలిస్తే అప్పటికి వున్నదానికంటే మెరుగైన కొత్తది తేవాలి. నూతన విధానం సర్వ విధాలా అందుబాటులోకి వచ్చేంత వరకు కొన్ని షరతులతోనైనా పాత విధానాన్ని అమలు చేయాలి. కాని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నమైన ”ఇసుక విధానం”తో 4 నెలలుగా నరకం చూపిస్తోంది.గతంలో యూనిట్‌ 2 వేలరూపాయల వరకూ వున్న ఇసుక, ఇపుడు 5 వేలు ఇస్తామన్నా దొరకడం లేదు. రాష్ట్రంలో గడచిన నాలుగు మాసాలుగా ఇసుక కొరత కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భవన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోగా అనేకమంది కొత్తవాటి నిర్మాణం ప్రారంభించలేని పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులకు పని పోయింది. ఇసుక కొరత కేవలం తాపీ పనివారికి మాత్రమే కాక కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు… ఇలా భవన నిర్మాణానికి సంబంధించిన అనేక పనులుచేసే వారికి ఉపాధిని తీసేసింది. ఫలితంగా సిమెంట్‌, స్టీల్‌, కలప, గ్రానైట్‌ తదితర నిర్మాణ సామగ్రి అమ్మకాలు పడిపోయాయి. ఇసుక కొరత వల్ల గొలుసుకట్టు ప్రభావం పడి సమాజం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే నెలకొన్న ఆర్థిక మందగమనం ప్రభావంతో పాటు ఇది కూడా పడి సంబంధితులందరి పరిస్ధితి అటు దెబ్బ- ఇటు చెంప దెబ్బఅన్నట్టు వుంది. ప్రభుత్వం నూతన ఇసుక విధానం రూపొందించి, దానిని అమలులోకి తెచ్చినప్పటికీ ఇంకా లభ్యత అంతంత మాత్రంగానే వుండడం, ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేస్తుండగానే ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌ అంటూ కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనబడటం తాజా పరిణామం. నూతన ఇసుక విధానాన్ని అమలుచేసే బాధ్యతలను జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం జి.ఒ జారీ చేసింది. జెసి-1 ఈ బాధ్యతలు నిర్వహిస్తారని, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో ఎక్స్‌అఫిషియో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ ఉంటారని, జె.సిలకు ఎపిఎండిసి నెలకు ఎనిమిది వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తుందని పేర్కొంది. నదులతోపాటు పట్టా భూముల్లో ఇసుక తీయాల్సి ఉండటంతో అది మైనింగ్‌ అధికారులైతే సమస్యలువస్తాయని, రెవెన్యూ పరంగా జాయింట్‌ కలెక్టర్లయితే ఇబ్బంది ఉండదని ప్రభుత్వం ఆలోచన చేసిందని అధికారులు చెబుతున్నారు. ఇసుక తీయడం, స్టాక్‌ యార్డులకు తరలించడం, అమ్మకాలు నిర్వహించడం వంటి మొత్తం కార్యకలాపాలను ఇక నుండి జాయింట్‌ కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బాధ్యత కూడా వారిదే! జె.సిల రోజువారీ పనిలో ఇసుక ఒక భాగంగా ఉంటుందన్న మాట. కాదు..కాదు అదే పెద్ద పని అయిపోతుంది. సివిల్‌ సప్లై మొదలు ఇనాం భూముల కోర్టు వరకూ అనేక అంశాలు జాయింట్‌ కలెక్టర్ల పరిధిలో వుంటాయి. జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌గా పాలనా వ్యవహారాల్లో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించే ఆ ఉన్నతాధికారికి ఈ పనులను అప్పగించడంతో దృష్టి మళ్లడం సహజం. కొన్ని పనులకు, ఇంకొన్నిటి పర్యవేక్షణకూ నష్టం జరగడం ఖాయం. ఇసుక సంబంధిత కార్యకలాపాలు శాశ్వతమైనవి కనుక అందుకు శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. కొత్తగా నియామకాలు చేపట్టకపోయినా డెప్యుటేషన్‌ పైనయినా నియమించడం భావ్యంగా వుంటుంది. నిజానికి ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తరువాత దాన్ని పర్యవేక్షించేందుకు అదనపుసిబ్బంది కావాలని, ఎపిఎండిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలల క్రితమే విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటికీ అలాంటి యంత్రాంగాన్ని సర్కారు ఏర్పాటు చేయకపోవడం తగదు.అయితే రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇసుక వ్యవహారాలు చూడడానికే ఒక ఐఎఎస్‌ అధికారిని నియమించడం మంచిదే. ఆయన ఒక్కరో లేక ఆయన కార్యాలయ సిబ్బందితోనే సరిపెడితే చాలదు. ఇసుక రీచ్‌, స్టాక్‌పాయింట్‌ స్థాయి వరకూ బాధ్యత వహించేందుకు ఫుల్‌టైమ్‌ లేదా పార్ట్‌టైమ్‌ ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటుచేయడం చాలా అవసరం. అది కూడా మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ శాఖలో భాగంగా వుండాలి తప్ప రెవెన్యూశాఖకు మరో అంగంగా మారడం మంచిది కాదు. ప్రభుత్వం అన్ని విషయాలనూ సంబంధితులతో సాకల్యంగా చర్చించి ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టడం అవసరం. అంతకన్నా ముఖ్యంగా అవసరమైనవారందరికీ ఇసుక అందుబాటులో వుంచేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. తద్వారా భవన నిర్మాణసంబంధిత పనుల్లో వున్న వారికి ఉపాధి, ఆదాయం లభించేలా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here