ఇసుక పాలసీని త్వరితగతిన తీసుకురావాలి

0
206
భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకోవాలి
ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదు : మాజీ ఎమ్మెల్యే ఆకుల
రాజమహేంద్రవరం, జూన్‌ 21 : లోపాలను సరిచేసి కొత్త పాలసీని త్వరితగతిన తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకుడు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ కోరారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా పాలన సాగిస్తానని ప్రజల ఆమోదంతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుడుగు వేయాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక రవాణాను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని, దీంతో ఇసుక ర్యాంపులపై ఆధారపడ్డా వందలాది కుటుంబాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇసుకలో చేసిన దోపిడికి విసుగుచెందిన ప్రజలు గత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇసుక విషయంలో తెలంగాణా పాలసీని అమల్లోకి తీసుకొస్తామనే సంకేతాలు అందుతున్నాయని, అయితే అక్కడి పరిస్థితులు వేరని, ఇక్కడ పరిస్థితులు వేరని గ్రహించాలని అన్నారు. గోదావరి అడుగు భాగం నుంచి ఇక్కడ ఇసుకను తీసి నావల్లో బయటకు తీసుకొస్తారని, అక్కడ మాత్రం కాలువల్లో ఇసుకను తీస్తారని గుర్తుంచుకోవాలన్నారు. ఇసుకను తీసుకొచ్చే నావల్లో పనిచేసే వందలాది కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన నూతన ఇసుక పాలసీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం ఇసుకకు కొరత ఏర్పడటంతో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కూలీలు, తాపీ పనివారలు, ఇతరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదు
తాను పార్టీ మారే ఆలోచన ఇప్పట్లో లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా సత్యనారాయణ చెప్పారు. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుచుకుంటానని చెప్పారు. ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా వారికి అందుబాటులో ఉంటానని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తను అనుకున్న లక్ష్యాలను, సిద్ధాంతాన్ని ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లలేకపోవడమే ఓటమికి కారణమని భావిస్తున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజల్లో ఉంటే రాష్ట్రంలో ప్రత్యమ్నాయ శక్తిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని, అయితే ఆయన ప్రజల్లో ఉంటారా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితమే నేడు ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వానికి ప్రత్యమ్నాయంగా బిజెపి కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు. కులపరమైన రాజకీయాలకు తావు లేదని గత ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారని, భవిష్యత్‌లోనూ కుల రాజకీయాలు చేద్దామని అనుకునే వారికి భంగపాటు తప్పదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కల్గివుండటంతోపాటు, ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో మైత్రీని కొనసాగించడం ద్వారా ఏపిలో ప్రభుత్వం ముందడుగు వేయాలని, ముఖ్యంగా వైద్య, విద్యా రంగాలపై ఈ ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అయ్యల గోపి, సిహెచ్‌. లాల్‌బహుదూర్‌ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here