ఈ తీర్పు మార్పుకు శ్రీకారం చుడుతుందా ?

0
538
(జి.కె. వార్తా వ్యాఖ్య )
 కుల,మతాల ప్రాతిపదికగా ఓట్లడగటం చట్ట విరుద్ధమంటూ భారత సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు నిన్న చారిత్రక తీర్పును వెలువరించింది. రాజ్యాంగ విరుద్ధంగా కుల, మతాలతో పాటు జాతి, వర్గం, భాష  ప్రాతిపదికన ఓట్లేయాలంటూ అడిగే ఏ విజ్ఞప్తి అయినా ఎన్నికల నిబంధనావళి ప్రకారం అవినీతి కిందకే వస్తుందని, ఆ విధంగా ఓట్లడిగి గెలిచిన వారు అనర్హులవుతారని హెచ్చరించడం శతధా అభినందనీయం. ఎన్నికల ప్రక్రియను ఇరకాటంలోకి నెట్టేసే ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్ధానం  తేల్చి చెప్పింది. వ్యక్తికి, దేవుడికి మధ్య సంబంధం వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో కూడుకున్నదే కానీ ప్రభుత్వం లేదా పాలకులతో దీనికి సంబంధం లేదని అత్యున్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించడం ముదావహం. రాజకీయ పార్టీల ఓటుబ్యాంక్‌ రాజకీయాలతో లౌకికవాద పునాది బలహీనపడుతున్న తరుణంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అటువంటి వాటికి పాల్పడితే  అనర్హతకు గురవుతారని హెచ్చరించడం ఆహ్వానించదగ్గ పరిణామం.   వర్తమాన రాజకీయాలన్నీ కులం, మతం అనే చట్రంలో కొనసాగుతున్నాయి. లౌకిక ప్రధాన ప్రాతిపదికన పునాదులు వేసుకున్న భారత రాజ్యాంగ వ్యవస్ధలో  ముఖ్యంగా ఎన్నికల విధానంలో కుల, మతాలు, ప్రాంతీయ ధోరణులు ఆందోళనకర స్థాయిలో ప్రబలాయి. కుల,మత శక్తులతో జతకట్టి రాజకీయాలు చేయడం ఎంత ప్రమాదకరమైనవో గత అనుభవాలే చాటుతున్నాయి. కుల,మత, వర్గ, ప్రాంత, భాష ప్రాతిపదికన  ప్రజల్ని విభజించి అధికారమే పరమావధిగా వ్యవహరించే రాజకీయ పార్టీలు ఇకనైనా తమ ధోరణి మార్చుకోవాలని అత్యున్నత న్యాయస్ధానం తీర్పు హెచ్చరిస్తోంది.  ప్రతి విషయాన్ని కుల సమీకరణ తూకం తూసే పార్టీలకు ఈ తీర్పు కనువిప్పు కావాలి. ‘మేము ఫలాన కులం కాబట్టి మా కులం కోటాలో మాకు రాజకీయ పదవులు కేటాయింపుల్లో ప్రాధాన్యత కావాలని డిమాండ్‌ చేయడాన్ని కూడా శిక్షార్హం చేయాలి. కులాల, మతాల సమీకరణలో, కేటాయింపుల్లో ప్రతిభావంతులు కనుమరుగవుతూ అనర్హులు అందలాలు ఎక్కుతున్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తీరు మార్పుకు ఈ తీర్పు శ్రీకారం చుడుతుందని ఆశిద్దాం.  దేశ వ్యాప్తంగా  కుల మత వర్గ ఓటు బ్యాంక్‌ల దన్నుతో రాజకీయ రంగాన్ని శాసిస్తున్న పార్టీలు కొత్త నిబంధనావళికి ఎలా కట్టుబడుతాయో వేచి చూడాల్సిందే. నిజాయితీ, ఉదారత, ప్రజా బాహుళ్యంలో సానుకూలత ఉన్నా కుల, మత, ధన ప్రభావంతో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ప్రయాస పడుతున్న వారికి సుప్రీం తీర్పు కాస్త ఊరటనిస్తుంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో సహ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ఏ మేరకు ప్రభావాన్ని, ఫలితాన్ని చూపుతుందో చూద్దాం మరి.