” ఈ ”

0
376
మనస్సాక్షి
‘ ఈ జనాలు బొత్తిగా మారిపోయారు గురూ గారూ” అన్నాడు వెంకటేశం వస్తూనే. ఆ పాటికి పేపర్‌ చదువుకుంటున్న  గిరీశం ఆ పేపర్‌ పక్కనపెట్టి ” దేని గురించోయ్‌?” అన్నాడు.  వెంకటేశం కొంచెం నిరసనగా ” పండుగలొస్తున్నాయి కదా.. ఒకళ్ళంటే ఒకళ్ళయినా పిలిచారా అని” అన్నాడు. గిరీశం తలూపి ” నిజమే సుమీ..అవునూ.. మరి నువ్వెప్పుడయినా ఎవర్నయినా పండక్కి రమ్మని పిలిచావా ? ” అన్నాడు. దాంతో వెంకటేశం గతుక్కుమని” అబ్బే లేదు గురూ గారూ.. అయినా ఎవరో ఒకరు అలా పిలిస్తే బాగుంటుందని” అన్నాడు. ఆ మాట పూర్తయ్యేలోగానే ఆ పిలుపులేవో వచ్చేశాయి. అయితే ఆ పిలుపులేవో  ఏ స్నేహితుల నుంచో, బంధువుల నుంచో  కాదు. బాబీ గాడు చదివే స్కూలు హెడ్మాష్టర్‌ నుంచి…! దాంతో ఆ  కబురు తెచ్చిన కుర్రాడిని గిరీశం ” ఏరా.. మళ్ళీ  మా బాబీగాడేవయినా చేశాడా? అంటూ అడిగాడు. ఆ కుర్రాడేదో  అనేలోపు వెంకటేశం ” అందులో అనుమానం ఏవుంది గురూ గారూ.. ఏదో కొక్కిరాయి పని చేసే ఉంటాడు. పోయి చూసొద్దాం రండి” అన్నాడు బయటికి నడుస్తూ.. గిరీశం కూడా లేచి అనుసరించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళే సరికి హెడ్మాష్టర్‌ జీవరత్నంన అసహనంగా కన్పించాడు. గిరీశాన్ని చూడగానే  ‘ రండ్రండి. ఓ ముఖ్యమయిన విషయం చెప్పడానికి మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది” అన్నాడు. దాంతో గురు శిష్యులిద్దరూ ఆసక్తిగా అదేంటన్నట్టుగా చూశారు. అప్పుడు జీవరత్నం ‘ మీకు తెలుసు కదా.. మనది మున్సిపల్‌ స్కూలయినా ఎక్కువమంది తమ పిల్లల్ని యిక్కడే  చదివించడానికి ఆసక్తి చూపిస్తారు. దానిక్కారణం యిక్కడుండే  క్రమశిక్షణ, మంచి ఎడ్యుకేషన్‌. మన స్కూలు పద్ధతులవీ చూసి ముచ్చటపడి ఆ మధ్య ఓ ఎన్నారై యిచ్చిన ఫండ్స్‌తో  రోజూ ఉదయాన్నే పిల్లలకి బిస్కెట్లూ, పాలూ, యింకా మధ్యాహ్నం భోజనం, ఓ స్వీటూ పెట్టడం జరుగుతోంది” అన్నాడు. దాంతో గిరీశం ” యివన్నీ మాకు తెలుసు. అసలు మా బాబీ గాడు చదువుకంటే వీటి మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాడు” అన్నాడు నవ్వుతూ. యింతలో హెడ్మాష్టర్‌ జీవరత్నం ” నిన్న ఓ కంప్లయింట్‌ వచ్చింది గిరీశం గారూ.. దాంతో నేను గట్టిగా ఎంక్వయిరీ చేశా. అది నిజమేనని తేలింది” అన్నాడు. యిద్దరూ అర్ధం కానట్టుగా చూశారు. అప్పుడు జీవరత్నం ‘ మీ బాబీ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు కదా. వాడు దోపిడీలకి దిగుతున్నాడు” అన్నాడు. దాంతో గిరీశం, వెంకటేశం అదిరిపోయి నోరెళ్ళబెట్టారు. గిరీశం షాక్‌ నుంచి తేరుకుని ” యిదిగో మా వాడి మీద అలాంటి నిందలేయకండి. అయినా మా వాడు పొద్దున్న స్కూలుకొచ్చేసి సాయంత్రం దాకా యిక్కడే ఉంటున్నాడు కదా. మరి దోపిడీలు ఎలా చేస్తాడంట?” అన్నాడు. దానికి హెడ్మాస్టర్‌ ”మీరు చెప్పింది నిజమే. అయితే  ఆ దోపిడీ ఏదో చేసేది యిక్కడే. అదీ ఆరో తరగతి పిల్లల దగ్గర. ఉదయాన్నే  వాళ్ళకిచ్చే బిస్కెట్లేవో ఈ బాబీ, యింకా వాడి స్నేహితులు యిద్దరూ కలిసి తీసేసుకుంటున్నారు.అలాగే మధ్యాహ్నం స్వీట్లు కూడా” అన్నాడు. అది వినగానే  గిరీశం” ఈ వెధవకి బుద్ధి లేదు. లేకపోతే ఈ పనులేంటవి?.. సర్లెండి హెడ్మాస్టర్‌ గారూ.. ఈ విషయంలో  మీకెలా తోస్తే అలా చేసెయ్యండి” అన్నాడు. దాంతో హెడ్మాస్టర్‌ అప్పటికప్పుడే  ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. యిక ఆ మర్నాటి నుంచి  ఉదయం యిచ్చే బిస్కెట్లు గానీ, మధ్యాహ్నం యిచ్చే స్వీటుగానీ ఎనిమిదో తరగతి వాళ్ళకి మానేసి, వాటిని కూడా ఆరో తరగతి పిల్లలకి పెట్టాలని..! యిదేదో వెంటనే అమలులోకి వచ్చింది. అక్కడితో గిరీశం, వెంకటేశం బయటకొచ్చేశారు.
ఆ రోజు సాయంత్రం బాబీ గాడు యింటికొచ్చాక గిరీశం ” ఏరా.. నువ్వు ఆరో తరగతి పిల్లల దగ్గర బిస్కెట్లవీ లాక్కుంటున్నావట” అన్నాడు. దాంతో బాబీ గాడూ ఒక్క క్షణం గతుక్కుమన్నా, అంతలోనే నవ్వేసి ” అదా మావయ్యా… చిన్న పిల్లలు కదా తినలోరేమోనని తిని పెడుతున్నాం” అంటూ తుర్రుమన్నాడు.
——-
 యిది జరిగిన నెలకీ యింకో విశేషం జరిగింది. ఆ రోజు ఎనిమిదో తరగతి చదువుతున్న కుర్రాళ్ళు కొందరు వెళ్ళి హెడ్మాస్టర్‌ను కలిశారు. సార్‌…. మాకు చాలా అన్యాయం జరుగుతుంది” అన్నారు చేతులు కట్టుకుని. దాంతో హెడ్మాస్టర్‌ ఏం అన్యాయం జరుగుతుందన్నట్టుగా చూశాడు. అప్పుడో కుర్రాడు ” మాకు యివ్వాల్సిన బిస్కెట్లూ, స్వీటూ ఆరో తరగతి కుర్రాళ్ళకి యిచ్చేస్తున్నారు” అన్నాడు. దాంతో హెడ్మాస్టర్‌ కోప్పడి ” ఏం యింతకుముందు వాళ్ళ దగ్గర్నుంచి అవన్నీ లాక్కున్నప్పుడు యిదంతా తెలీదా” అన్నాడు. దాంతో వాళ్ళు ”అబ్బే.. మేమెప్పుడూ అలా చేయలేద్సార్‌” అలా చేసింది మా క్లాసులో ఉండే బాబీ, అబ్బులు, రఘూ…” అన్నారు. దాంతో హెడ్మాస్టర్‌కి విషయం అర్ధమయింది.  ‘ క్లాసులో ఎవరో ముగ్గురు చేసిన పనిని దృష్టిలో పెట్టుకుని అందరికీ శిక్ష వేయడమేంటా’ అనిపించింది. దాంతో అప్పటికప్పుడే యింకో నిర్ణయం ప్రకటించాడు. దాని ప్రకారం మర్నాటి నుంచి ఆ బిస్కెట్లూ, స్వీటూ బాబీ, అబ్బులు, రఘుకి తప్ప మిగతా ఎనిమిదో తరగతిలో అందరికీ యివ్వాలని. ఆ రోజు సాయంత్రం బాబీ గాడు యింటికొచ్చి జరిగిందంతా గిరీశానికి చెప్పి బావురుమన్నాడు. గిరీశం  అయితే  ఏం మాట్లాడకుండా బయటికి నడిచాడు. ఆ పాటికీ గిరీశం దగ్గరే ఉన్న వెంకటేశం కూడా బయటికి నడిచాడు. దారిలో వెంకటేశం ” గురూ గారూ..బాబీ గాడి స్కూలు వ్యవహారం కరక్టేనంటారా? ” అన్నాడు. ఈ లోగా గిరీశం ఓ చుట్ట అంటించి  ” హెడ్మాష్టర్‌ చేసింది చాలా కరెక్టోయ్‌.. అసలిదంతా ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన రిజర్వేషన్ల వ్యవహారానికి సింబాలిక్‌గా ఉందనుకో” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలు పెట్టాడు. ” ఎన్నో సంవత్సరాల క్రితం కొన్ని వర్గాలు ఆర్థికంగానూ, సామాజికంగానూ అణచి వేయబడడం జరిగింది. దాంతో వారికి న్యాయం జరగాలన్న ఉద్ధేశ్యంతో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది. అదీ ఓ పది సంవత్సరాల పాటు అమలు చేయాలని అంబేద్కర్‌ గారే చెప్పారు. అయితే ఈ నాటికీ ఆ రిజర్వేషన్లేవో  కొనసాగుతున్నాయి. అలా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు పెంచడం గురించి ఎవరూ తప్పుపట్టరు. అయితే అదే సమయంలో  మేథావులు చెప్పేదొకటుంది. ఆర్థికంగా ఎంతో దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు వెనుకబడిన వర్ణాలలోనే కాదు  అగ్రవర్ణాలలోనూ ఉన్నారనీ, వాళ్ళకీ న్యాయం జరగాలనీ, అందుకే అటువంటివాళ్ళకీ రిజర్వేషన్లు కల్పించాలనీ. ఈ  డిమాండ్‌ ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది. అయితే యిన్నాళ్ళకు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కావచ్చు. అగ్రవర్ణాల్లో పేదవారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించారు. యిది స్వాగతించదగిన పరిణామం. అయితే సుప్రీంకోర్టు చెప్పిన 50 శాతం రిజర్వేషన్లు దాటిపోవడంతో ఈ బిల్లు అమలు సాధ్యం కాదని తేల్చిన వాళ్ళూ ఉన్నారు. అయితే తమిళనాడు లాంటి చోట యిప్పటికే 65 శాతం రిజర్వేషన్లు నడుస్తుండడం చూడొచ్చు. అందుకే  ఏం జరగబోతోందనేది భవిష్యత్తే చెప్పాలి. అయితే అందరూ  గ్రహించాల్సి  ఒక్కటే. అగ్రవర్ణాల్లో పూర్వీకులు వెనుకబడ్డ వర్గాల్లో వారిని అణచివేసారు. అంత మాత్రం చేత  ఈ కాలపు అగ్రవర్ణాల వారందరినీ అలాగే అనుకోవడం  సరికాదు. అలాగే అగ్రవర్ణాల్లో కూడా పేదలయిన వారెందరో ఉన్నారు. ఈ రిజర్వేషన్ల వలన దేశంలో కుల, మత, వర్గాలకి అతీతంగా పేదలందరికీ అన్ని రకాలుగా న్యాయం జరగాలి. యింకా అవకాశాలు పెరగాలి. అదే ఈ వ్యవస్థలో వైషమ్యాలను హరించి ఆరోగ్యకర వాతావరణాన్ని నింపుతుంది” అన్నాడు.
డా. కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here