ఉరకలేస్తున్న గోదావరి

0
343
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ – లంక వాసులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికార యంత్రాంగం
రాజమహేంద్రవరం, ఆగస్టు 17 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉరకలు వేస్తోంది.ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఈరోజు ఉదయం నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో గోదావరి హెడ్‌వర్క్స్‌ ఇఇ మోహనరావు తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్‌ నుండి 9 లక్షల 75వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  దీంతో ఏజెన్సీతోపాటు ముంపు ప్రాంతాలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది.  వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో  ముందస్తు చర్యలుగా లంక వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అందులో భాగంగా సబ్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌వర్మ, నగరపాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌, ఇతర అధికారులు ఈరోజు ఉదయం లంక ప్రాంతాలకు వెళ్ళి వారిని ఆల్కాట్‌ గార్డెన్స్‌లోని మున్సిపల్‌ కల్యాణ మంటపానికి తరలించారు. వారికి కావలసిన ఏర్పాట్లను వారు సిద్ధం చేశారు. లంక నుంచి గోదావరి ఒడ్డుకు బోట్లలో వారిని తీసుకువచ్చి ఆర్టీసీ బస్సుల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో భోజన వసతితో పాటు వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. గోదావరిలోని మూడు లంకల్లో ఉన్న 180 మందిని అధికారులు సురక్షితంగా తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here