ఉల్లాసంగా….ఉత్సాహంగా……

0
322
హ్యాపి సండేలో కేరింతలు కొట్టిన విద్యార్ధులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 : పుష్కరాల రేవు వద్ద ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న హ్యాపి సండే కార్యక్రమం ఈ వారం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. రొటీన్‌కు భిన్నంగా ఆదివారాన్ని ఆనందభరితంగా గడపాలనే ఆలోచనతో నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు గత నాలుగు వారాల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ పాఠశాలల విద్యార్ధినీవిద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు  రాజమండ్రి రైజింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రోకెన్‌ హార్ట్‌ బిల్డర్స్‌ రాక్‌ బ్యాండ్‌, డీఎన్‌ఏ వారి ప్లాష్‌ మోబ్‌ అందరినీ ఆకట్టుకుంది. హ్యాపి సండేలో రొటీన్‌కు భిన్నంగా కార్యక్రమాలు ఉండాలనే ఉద్ధేశ్యంతో రాజమండ్రి రైజింగ్‌ అడ్మిన్‌ మాటూరి సిద్ధార్ధ నగరానికి చెందిన యువతలో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీస్తూ వాటిని హ్యాపి సండే వేదిక ద్వారా పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగా ప్లాష్‌ మోబ్‌తో పాటు ఈరోజు బ్రోకెన్‌ హార్ట్‌ బిల్డర్స్‌ వారి రాక్‌ బ్యాండ్‌ విద్యార్ధుల్లో ఉత్సాహాన్ని నింపింది. సుమారు   అరగంట పాటు ర్యాక్‌ బ్యాండ్‌ ప్రదర్శనకు చిన్నవారి నుంచి పెద్దవారు వరకు మంత్రముగ్ధులయ్యారు. నెహ్రూనగర్‌ మున్సిపల్‌ పాఠశాలకు చెందిన విద్యార్ధిని లావణ్య వయోలిన్‌ కచేరీ వీనులవిందు చేసింది. స్ధానిక 43 వ డివిజన్‌ వీవర్స్‌ కాలనీలో ఉన్న స్కేటింగ్‌ పార్కుకు చెందిన విద్యార్ధులు హ్యాపిసండేలో స్కేటింగ్‌ విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నారు. తల్‌వాకర్స్‌ సంస్ధకు చెందిన ప్రతినిధులు జంబో నృత్యాలు చేసి విద్యార్ధులను ఉత్సాహపరిచారు.  ఈ హ్యాపి సండే కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు, సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ దంపతులు, కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, గొందేశి మాధవిలత, గొర్రెల సురేష్‌ తదితరులు కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఇటీవలే జాతీయ స్థాయి ఒలింపిక్స్‌ నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్షిప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన శ్రీనివాస రామానుజమ్‌ నగర పాలక సంస్ధ ఉన్నత పాఠశాల విద్యార్ధిని షేక్‌ నజరిన్‌ను వారు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి నగరానికి, తల్లిదండ్రులకు  మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. హ్యాపి సండేలో నగర పాలక సంస్ధ మెడికల్‌ ఆఫీసర్‌ డా. ఎం.వి.ఆర్‌. మూర్తి విదేశీ కరెన్సీ, నాణెల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ ఫణిరామ్‌, పాఠశాలల సూపర్వైజర్‌ దుర్గాప్రసాద్‌, రాజమండ్రి రైజింగ్‌ ప్రతినిధులు మండవిల్లి హరనాథ్‌, మాటూరి సౌమ్య తదితరులు పాల్గొన్నారు.