ఉల్లి సమస్య తీర్చండి

0
125
రైతు బజార్‌ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, నవంబరు 25:ఉల్లి పాయల పేరు చెబితేనే ప్రజల కంటి నుంచి నీళ్లు వస్తున్నాయని, ఉల్లి పాయల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యమ్నాయాలు చూపించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్థానిక విఎల్‌ పురంలోని రైతు బజార్‌లో జరుగుతున్న ఉల్లిపాయల విక్రయాలను మంగళవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉల్లిపాయల కోసం లైనులో నిలబడిన ప్రజలతో ఆమె మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉల్లిపాయల పంపిణీని సులభతరం చేయాలని  ప్రజలు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఏనాడూ ఇంత ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. ప్రజా అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి అందుకు తగ్గట్టు తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. ఉల్లిపాయల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉల్లిపాయల కోసం వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున రెండు లైన్లు ఏర్పాటు చేయాలని ఎస్టేట్‌ ఆఫీసర్‌కు సూచించారు.అనంతరం అదే రైతు బజార్‌ వద్ద ఆదిరెడ్డి యువ సేన ఆధ్వర్యంలో జరిగిన జూట్‌ బ్యాగ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. ప్లాస్టిక్‌ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలన్నారు. దాని కోసం అందరూ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను కాకుండా జూట్‌ బ్యాగ్‌లను వినియోగించాలన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా ప్లాస్టిక్‌నకు వ్యతిరేకంగా ఆదిరెడ్డి యువ సేన ఆరంభించిన ప్లాస్టిక్‌పై యుద్ధం ఇలా కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలన కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం రైతు బజార్‌కు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉల్లిపాయల కొనుగోలు కోసం వచ్చిన వినియోగదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంటిపూడి రాజేంద్ర, ఎలక్ట్రికల్‌ సత్యనారాయణ, గరికిన రామారావు, రైతు బజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here