ఎక్కవలసిన రైలు – నాలుగేళ్ళు లేటు

0
279
మనస్సాక్షి  – 1131
‘జీవితానా వెలుగింతేనా.. ఆశా నిరాశేనా..’ అంటూ బయట నుంచి పాటేదో వినిపిస్తోంది. ఆపా టికి చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ ఆనంద సాగరంలో ముదురుతున్న గిరీశం ఉలిక్కిపడి బయటికి తొంగిచూశాడు. యింతలోనే ఆ పాట బాపతు ఓనర్‌.. అదే.. ఆ పాట పాడు కుంటూ వస్తున్న వెంకటేశం లోపలకొచ్చాడు. ఆపాటికి తగ్గట్టే మొహం కూడా అరడజను లంఖణాలు చేసినట్టుంది. దాంతో గిరీశం ”ఏవివాయ్‌.. పెళ్ళయి ఆనక పెళ్ళాం అప్ప డాల కర్ర తిరగేసినట్టు ఆ పాటేంటంట?” అన్నాడు. ఈలోగా వెంకటేశం కుర్చీలో సెటిలై ”ఏం చెప్పమంటారు గురూగారూ.. యిటు రాజకీయాల్లోకి వెళ్ళలేక, అటు చదువుండీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళలేక నా పని రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది” అన్నాడు. దాంతో గిరీశం ”ఓస్‌ అంతేనా.. సరే.. నీకో మంచి దారి ఏర్పాటు చేస్తాం చూడు. నేరుగా రాజ కీయాల్లోకి  వెళ్ళకపోయినా వెనకుండి ఆ  రాజకీయాల్ని  నడిపించే పోస్టయితే  ఎలా ఉంటుంది?” అన్నాడు. దాంతో వెంకటేశం మొహంలో వెలుగొచ్చింది. ”అబ్బో.. బ్రహ్మాండంగా ఉంటుంది గురూగారూ..” అన్నాడు. దాంతో గిరీశం ”అయితే నిన్ను మన కృష్ణ మాధవ్‌కి  పరిచయం చేస్తా.  తెలుసు కదా… ఆయన మన అమలాపురంవాడే. నాకు బాగా పరిచయంలే. యిప్పుడాయన కమలం పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నాడు” అన్నాడు. వెంకటేశం అలాగా అన్నట్టుగా తలూపాడు. గిరీశం కూడా మాటిచ్చినట్టుగా ఆ మర్నాడే వెంకటేశాన్ని తీసుకుని కృష్ణమాధవ్‌ ఆఫీసుకి బయలుదేరాడు.
——
కృష్ణమాధవ్‌ కార్యాలయం.. గురుశిష్యులిద్దరూ వెళ్ళేసరికి కృష్ణమాధవ్‌ తీరిగ్గానే ఉన్నాడు. గిరీశాన్ని చూడగానే ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించాడు. ”ఏంటి గిరీశం.. యిదేనా రావడం? మన అమలా పురం ఎలా ఉంది?” అన్నాడు. గిరీశం నవ్వేసి ”మన ఊరికేం.. బ్రహ్మాండం. యిదిగో.. వీడు వెంకటేశమని మనూరివాడే. నీకు పరి చయం చేద్దామని తీసుకొచ్చా” అన్నాడు. ఈలోగా వెంకటేశం ముందు కొచ్చి కృష్ణమాధవ్‌కి నమస్కారం చేసి, తనని పరిచయం చేసు కున్నాడు. యింతలోనే గిరీశం ”ఏం లేదు. వీడు బాగా చదువు కున్నోడూ, తెలివయినోడూ. మన పార్టీ సిద్ధాంతాలంటే ప్రాణం. చిన్నప్పుడే నిక్కరేసుకుని కర్ర పట్టుకు తిరిగినోడు. కొంచెం నీ దగ్గరే పెట్టుకుని ఎలక్కావలిస్తే  అలాంటి సర్వీసులు చేయించుకో” అన్నాడు.  దానికి కృష్ణమాధవ్‌ తలూపి ”అలాగే.. ఎలాగా మన టీమ్‌ ఒకటుందిలే. దాంట్లో ఉంటాడు” అన్నాడు. ఆ రకంగా వెంకటేశం ఆరోజు నుంచే కొత్త జీవితం ప్రారంభించినట్టయింది.
——
వెంకటేశం తెలివితేటలు కృష్ణమాధవ్‌కి బాగా నచ్చాయి. దాంతో అన్ని ముఖ్య విషయాల్లో వెంకటేశం అభిప్రాయాలు  తీసుకుంటున్నాడు. అక్కడికీ ఓరోజు ”యిదిగో వెంకటేశం.. నువ్వు సరయిన తెలివితేటలు చూపించి, నీ సత్తా నిరూపించుకుంటే నిన్ను తప్పకుండా హై కమాండ్‌కి రికమెండ్‌ చేస్తా” అన్నాడు.  దాంతో వెంకటేశం హుషా రుగా ”అలాగే.. యింతకీ యిప్పుడే ప్రాజెక్ట్‌ నడుస్తుంది?” అన్నాడు. దానికి కృష్ణమాధవ్‌ ”యిప్పుడే ప్రాజెక్ట్‌ నడుస్తుంది?” అన్నాడు. దానికి కృష్ణమాధవ్‌ ”యిప్పుడు వైజాగ్‌కి రైల్వేజోన్‌ యివ్వబోతున్నాం. అయితే వైజాగ్‌ జోనయితే యిస్తున్నాం గానీ వాల్తేరు డివిజన్‌ తీసేసి కొంత విజయవాడ డివిజన్‌లో కలపడం మిగతాదంతా రాయగఢ డివిజన్‌ ఏర్పాటు జరుగుతుంది. అయితే యిలా చేయడం వలన ఆంధ్రాకి ఆదాయం తగ్గిపోతందనీ వైజాగ్‌ డివిజన్‌ని చంపేశారనీ, గోల మొదలయింది. నువ్వయితే ఏం చేస్తావు?” అన్నాడు. దాంతో వెంకటేశం ఒక్క క్షణం ఆలోచించి ”చాలా సింపుల్‌.. యిప్పుడు విజయవాడ,  గుంటూరు, గుంతకల్‌, యింకా వైజాగ్‌ డివిజన్‌లో కొంతా కలిపి  సౌత్‌ కోస్ట్‌ జోన్‌ పేరిట కొత్త జోన్‌ ఏర్పాటు చేస్తున్నారు కదా. అయితే వైజాగ్‌ డివిజన్‌లో ఎక్కువభాగం పట్టుకెళ్ళి రాయగఢ్‌ జోన్‌లో కలిపేస్తున్నారు. దీంతో ఆదాయం వచ్చే ప్రాంతంలో ఒడిస్సాకి చెందిన రాయగఢ్‌ జోన్‌కి ఎక్కువ వెళ్ళిపోయి నట్టవుతుంది. అందుకే యిప్పుడేం చేయా లంటే.. అసలే వైజాగ్‌ డివిజన్‌ అనేది ఆంధ్రా వాళ్ళకి సెంటిమెంట్‌. యిప్పుడు దాన్ని తీసేసి కొంత విజయవాడ డివిజన్‌లోనూ, యింకొంత రాయగఢ్‌ డివిజన్‌లోనూ కలపడం అనేది సరయిన నిర్ణయం కాదు. వైజాగ్‌ డివిజన్‌ అనేది ఎప్పటిలాగే అదే పేరుతో ఉంచాలి. కాక పోతే అందులోని ఒడిస్సాకి చెందిన ప్రాంతాన్నంతే రాయగఢ్‌ డివి జన్‌కి కలిపేయాలి. దాంతో మన డివిజనేదో మనకుందన్న శాటిస్‌ ఫేక్షన్‌ మన ఆంధ్రావాళ్ళకి మిగులుతుంది” అన్నాడు. వెంకటేశం చెప్పిందాంతో కృష్ణమాధవ్‌ మొహం వెలిగిపోయింది. ‘శభాష్‌.. బాగా చెప్పావు. యిప్పుడే నీ గురించి హైకమాండ్‌తో మాట్లాడతా” అన్నాడు.
—–
”అది గురూగారూ.. తెల్లవారుజామున అలాంటి కలొచ్చింది. మొత్తా నికి కలలో అదరగొట్టేశాననుకోండి” అన్నాడు వెంకటేశం. గిరీశం నవ్వేసి ఊరుకున్నాడు. యింతలో వెంకటేశం ”యింతకీ ఈ కలెం దుకు వచ్చినట్టంటారు?” అన్నాడు. గిరీశం ఒక్క క్షణం ఆలోచించి అప్పుడు వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”ఈ జోన్‌ యివ్వడం విషయంలో విభిన్న పార్టీల వాదనలు భిన్నంగా ఉన్నాయి. అయితే యిక్కడ గమనించవలసిన విషయం ఒకటుందోయ్‌.. అదేదో కొంచెం వివరంగా చెబుతా. ఒక ఆఫీసులో కొందరు పనిచేస్తున్నాను కుందాం. వాళ్ళందరికీ జీతాలు ఎలాగూ యివ్వాలి. అయితే ఆ యిచ్చేదేదో ఒకటో తారీఖునో లేకపోతే ఓరోజు ముందో యిచ్చేస్తే ఎంత బాగుం టుంది. వాళ్ళకెంత ఆనందంగా ఉంటుందని. అలాక్కాకుండా పదిహేనో తారీఖో, యిరవయ్యో తారీఖో  పదిసార్లు అడిగించుకున్న తర్వాత యిస్తే ఎలాగుంటుందని? ‘ఆ.. ఏడ్పించి యిచ్చాడ్లే’ అని తిట్టుకుంటారు. ఎలాగూ యివ్వవలసినప్పుడు, అదేదో ముందుగానే  యిచ్చేస్తే ఎంత బాగుంటుందని. సరిగ్గా ఈ రైల్వేజోన్‌ విషయం లోనూ యిలాంటి పరిస్థితే చూడొచ్చు. వాస్తవానికి రైల్వే జోన్‌ యివ్వడానికి కేంద్రం ఎప్పుడో నిర్ణయం తీసేసుకుంది. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ లబ్ధి ఏదో తమకి కాకుండా యితర పార్టీలకి దక్కొచ్చనే అనుమానంతో యింతకాలం సాగదీశారు. అయితే యిప్పుడు ప్రజల నుంచి పెరిగిన నిరసనల దృష్ట్యా యివ్వక తప్పింది కాదు. అయితే జోన్‌ యిచ్చారు గానీ డివిజన్‌ని మాత్రం ఒరిస్సాకి కలిపేసి మన ఆదాయానికి గండికొట్టారనే  విమర్శల్ని మూటగట్టుకున్నారు. అదే మన వైజాగ్‌ డివిజన్‌ పేరు అలానే ఉంచేస్తే ఎంత బాగుండేదని.. మొత్తానికి ఆ జోనేదో యివ్వకా తప్ప లేదు. యిచ్చినా ఫలితం దక్కనూ లేదు అన్నట్టుంది పరిస్థితి. ఏతా వాతా చెప్పేదేంటంటే.. తప్పనిసరిగా చేయవలసిన పనేదో టైం ప్రకారం, కొంచెం వ్యూహాత్మకంగా చేస్తే ఆ ఫలితం ఎన్నో రెట్లు ఎక్కు వగా ఉంటుంది” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here