ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం 

0
220
గన్ని ఆధ్వర్యంలో ఘనంగా నందమూరి జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, మే 28 : రాజకీయాలలో జవాబుదారీతనాన్ని తీసుకువచ్చి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్పూర్తితో అందరూ సైనికుల్లా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శ్రీరామనగర్‌లో వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందుతూ వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఎన్టీఆర్‌ కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పేద  ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే సిద్దాంతాన్ని అమలు చేసి రాజకీయాలలో నూతన శకాన్ని ఆరంభించారన్నారు. ముఖానికి రంగులు వేసుకొనే నాయకుడు ప్రజలను ఏ విధంగా పరిపాలిస్తాడన్న విమర్శలకు సమాధానమిస్తూ తెలుగుజాతి బ్రతికి ఉన్నంత వరకు ఆయనను మరచిపోని విధంగా తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తెదేపా అపజయం పట్ల నిరుత్సాహ పడకుండా ఎన్టీఆర్‌ స్పూర్తితో పార్టీ మళ్ళీ అధికారం వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం పేపర్‌మిల్లు కార్మిక సంఘం (టిఎన్‌టియు.సి)  ఆధ్వర్యంలో పేపర్‌మిల్లు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి గన్నికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి పేపర్‌మిల్లు కార్మికులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పేపర్‌మిల్లు నుండి సీతంపేట, లింగంపేట, ఆర్యాపురం, గోదావరి గట్టు మీదుగా కోటిపల్లి బస్టాండ్‌ చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మిఠాయిలు పంచి ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని కోరారు. అనంతరం 27 డివిజన్‌లో జరిగిన జయంతి వేడుకలకు గన్ని కృష్ణ హాజరయ్యారు. డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ కాశి నవీన్‌కుమార్‌, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, గొర్రెల రమణ, మళ్ళ వెంకట్రాజు, బూర దుర్గాంజనేయరావు, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి, మొల్లి చిన్నియాదవ్‌, రామినేని మస్తాన్‌ చౌదరి, పల్లి సాయి, శనివాడ అర్జున్‌, ఎం.ఎ.రషీద్‌, శీలం గోవింద్‌, కె.వి.శ్రీనివాస్‌, వానపల్లి శ్రీనివాస్‌, జి.కొండబాబు, కంచిపాటి గోవింద్‌, సత్యనారాయణ, భైరవ, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here