ఎన్నిక ఏదైనా విజయం మనదే కావాలి

0
88
శివరాముడి సారథ్యంలో అది కష్టమైన పని కాదు
శ్రిఘాకొళ్ళపు బాధ్యతల స్వీకరణలో డిప్యూటీ సీఎం, మంత్రులు
రౌతు నిరాశ..నిస్పృహ చెందనక్కర లేదు.. సమిష్టిగా పనిచేయండి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 11 : జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ సహ అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రెపరెపలాడేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా శ్రమించాలని పలువురు మంత్రులు, ఆ పార్టీ నాయకులు పిలుపు ఇచ్చారు.  ఇందుకు తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తామని వారు హామీనిచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాజమహేంద్రవరం నగర కో-ఆర్డినేటర్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా  గత సాయంత్రం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వైకాపాకు చెందిన పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా హాజరైన తూర్పుగోదావరి ఇన్‌ఛార్జి మంత్రి – ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను వందరోజుల పాలనలోనే ముఖ్యమంత్రి జగన్‌ నెరవేర్చారన్నారు. అయితే ఎన్నికల ముందునాటి బురద జల్లే నిస్సిగ్గు ప్రయత్నాలనే ఎన్నికల తరువాత కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల్లోకి వెళ్ళి ఈ వైఖరిని ప్రతిఘటించడంతోపాటు, చేసిన పనులను వివరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అధికారం అనుభవించి తీవ్ర ప్రజా ఛీత్కారానికి లోనై ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని వ్యాఖ్యానించారు. శివరామ సుబ్రహ్మణ్యం సారధ్యంలో పార్టీ జెండా రాజమహేంద్రవరంలో లో రెపరెపలాడాలని, మరింత ఉన్నత భవిష్యత్‌ ఆయనకు కలగాలని ఆకాంక్షించారు.
తటస్థులను ఆకట్టుకోవాలి..పార్టీని పటిష్టపర్చాలి
కాకలు తీరిన యోధులెందరో రాజకీయం నెరపిన రాజమహేంద్రవరంలో రాజకీయం నడపడం ఏమంత తేలిక కాదంటూ అందరినీ కలుపుకుని వెళ్ళడం ద్వారా విజయాలు సాధించాలని మరో ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి – రెవిన్యూ శాఖామాత్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సూచించారు. గత మున్సిపల్‌ ఎన్నికలు, ఇటీవల శాసనసభ ఎన్నికల్లో సంభవించిన ఓటమికి దారి తీసిన పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని సలహానిచ్చారు.రాజకీయ చతురత, విజ్ఞత  ఉన్నాయని నమ్మిన జగన్‌ అప్పగించిన బాధ్యతల నిర్వహణలో శివరామ సుబ్రహ్మణ్యం విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని గెలుచుకుని జగన్‌కు కానుకగా ఇస్తే శివరామ సుబ్రహ్మణ్యం శక్తియుక్తులు ఏపాటివన్నది మరింత గుర్తింపులోకి వస్తాయన్నారు. గిరిగీసుకుని కూర్చోకుండా పార్టీ పరిధిని విస్తృతపరుచుకోవాల్సి ఉందన్నారు. వార్డుల్లో తటస్థులను ఆకట్టుకోవాలన్నారు. ఇదే క్రమంలో ఆది నుంచి పార్టీలో ఉన్న వారికి ఏమాత్రం ప్రాధాన్యత తగ్గదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
రౌతు నిరాశ నిస్పృహ చెందనక్కరలేదు
ఇంతవరకు కో-ఆర్డినేటర్‌ బాధ్యతలు మోసిన రౌతు  సూర్యప్రకాశరావు ఏమాత్రం నిస్పృహ చెందాల్సిన పనిలేదని సుభాష్‌చంద్రబోస్‌ పేర్కొన్నారు. ఆయనను మచ్చలేని నాయకుడిగా అభివర్ణిస్తూ రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. ఓటమితో కృంగిపోకుండా ఎప్పటిలాగే చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచించారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాలన్నారు. గతంలో పి.వి.నరసింహారావు పెట్టే బేడా సర్ధుకుని స్వస్థలానికి చేరుకోవడానికి సిద్ధపడిన సమయంలోనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం లభించిందన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చన్నారు.
తుని తరహా సంపూర్ణ ఫలితం సాధించాలి
దివంగత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజా, జక్కంపూడి శిష్యుడు శివరామ సుబ్రహ్మణ్యం బృందం రాజమహేంద్రవరంలో చురుకైన రాజకీయాలు నడపడానికి సిద్ధమవ్వడంతో మళ్ళీ జక్కంపూడి శకం ప్రారంభమైన అభిప్రాయం కలుగుతోందని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్‌ ఆనందం వ్యక్తం చేశారు. తుని మున్సిపల్‌ ఎన్నికల్లో గతంలో సంపూర్ణ విజయం సాధించిన తరహాలో రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని వార్డులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకునేలా చేయడం ద్వారా రికార్డు సృష్టించాలని అభిలషించారు. శివరామ సుబ్రహ్మణ్యంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తరహా వాక్చాతుర్యం, జక్కంపూడి రామ్మోహనరావు ధోరణి రాజకీయ లక్షణాలు కనిపిస్తాయన్నారు. 1996 ముమ్మిడివరం ఉప ఎన్నికలో వారేమిటో ప్రత్యక్షంగా తాను చూడటం జరిగిందన్నారు.
జగన్‌ పాలన చూసుకుంటే మనం పార్టీని చూసుకోవాలి : కన్నబాబు
ఊహించని లక్ష్యాలను చేరుకోవడానికి ముఖ్యమంత్రిగా జగన్‌ ఎంతో కష్టపడుతున్నారని వ్యవసాయశాఖామంత్రి  కురసాల కన్నబాబు పేర్కొన్నారు.  ప్రభుత్వాన్ని మీరు నడపండి, పార్టీని మేం చూసుకుంటామన్న రీతిలో నాయకులు – కార్యకర్తలు వ్యవహరిస్తూ జగన్‌కు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాన్ని పటిష్టపరుచుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు సంఘటితంగా ముందుకెళ్ళాల్సి ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చేశామన్న సంతోషంతో మిన్నకుండిపోకుండా ప్రజల భాగోగులు పట్టించుకోవడంపై దృష్టిసారించాలని శ్రేణులకు సూచించారు. కార్యకర్తలకు శివరామ సుబ్రహ్మణ్యం ఒక మోడల్‌గా నిలుస్తారంటూ, ఆయన బాధ్యతల నిర్వహణలో ఫలప్రదమవ్వాలని ఆకాంక్షించారు.
ప్రత్యేకత శివరాముడి సొంతం : మంత్రి వనిత
ఏది చేసినా తన ప్రత్యేకతను శివరామ సుబ్రహ్మణ్యం చాటుకుంటూ ఉంటారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిణి తానేటి వనిత ప్రశంసించారు.  అందరితోనూ కలిసి పనిచేస్తుంటారని, భవిష్యత్‌లోనూ అదే పంధా కొనసాగించాలని ఆకాంక్షించారు. పాదయాత్ర సమయంలోనూ, మేనిఫెస్టోలోనూ ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలన్న కోణంలో జగన్‌ పనిచేస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వ చేతలు ప్రజల్లోకి వెళ్ళడం లేదన్నారు.  ఆ విషయాలన్నింటినీ స్వయంగా చెప్పడంలో కార్యకర్తలు, నాయకులు కర్తవ్యంతో మెలగాలన్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీని పటిష్టపరుస్తాం : జక్కంపూడి రాజా
ఫోటోలు దిగి పత్రికల్లో పడే తరహా ఫ్యాన్సీ టైపు రాజకీయాలకు దూరంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసేందుకు సిద్ధపడాలని పార్టీ నాయకులు, బాధ్యులకు రాజానగరం ఎమ్మెల్యే – కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. తన తండ్రి దివంగత రామ్మోహన్‌కు ఆత్మీయుడిగా విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న శివరామ సుబ్రహ్మణ్యం సారధ్యంలో మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు తొలిగా తమ కుటుంబమే ఆయన వెంట నిలిచిందన్నారు. గత మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేవలం ఎనిమిది వార్డుల్లో మాత్రమే గెలుపొందామని, అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని కోల్పోయామని పేర్కొంటూ భవిష్యత్తులో వాటిల్లోనూ విజయం సాధించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.ఛాలెంజ్‌గా తీసుకుని కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 స్థానాలకు కనీసం 35 స్థానాలైనా గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకెళతామన్నారు.
సమిష్టిగా పనిచేసి విజయం సాధిస్తాం : ఎంపి భరత్‌
మూడుసార్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమిని చవిచూసినప్పటికీ నాలుగవసారి విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకెళతామని లోక్‌సభ సభ్యులు మార్గాని భరత్‌రామ్‌ పేర్కొన్నారు. శివరామ సుబ్రహ్మణ్యం, రౌతు, రాజా, తాను.. నలుగురం కలిసి మిగిలిన వారందరి సహకారంతో శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తామన్నారు. అందుకు ప్రతీకగా నలుగురూ చేతులు పట్టుకుని పైకెత్తి జేజే నినాదాలు చేశారు. రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. భవిష్యత్తులో జరిగే స్థానిక ఎన్నికలన్నింటిలోనూ సత్తా చాటడం ఖాయమన్నారు. పార్టీ పూర్వ కో-ఆర్డినేటర్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ శివరామ సుబ్రహ్మణ్యాన్ని వెన్నంటే ఉంటామన్నారు.  తమ కుటుంబం ఎన్నికల్లో నిలిచిన ప్రతిసారీ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన శివరామ సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం రాజకీయాల్లో నెగ్గుకు రావడానికి అండగా నిలుస్తామని కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రకటించారు. పోరాడే తత్త్వం కలిగిన శివరామ సుబ్రహ్మణ్యం తనను విశ్వసించిన వారిని వార్డుల్లో నిలిపి కార్పొరేటర్లుగా గెలిపించుకోవడంలో సఫలీకృతులయ్యారన్నారు. అదే తీరు కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందన్నారు. కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచిన దివంగత జక్కంపూడి రామ్మోహనరావు స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న శివరామ సుబ్రహ్మణ్యం సారధ్యంలో పార్టీకి తిరుగులేదన్న అభిప్రాయాన్ని కాకినాడ ఎం.పి.  వంగా గీతా, కర్రి పాపారెడ్డి, పెద్దాపురం ఇన్‌ఛార్జి  దవులూరి దొరబాబు వ్యక్తం చేశారు.
కర్తవ్య నిర్వహణలో సుబ్రహ్మణ్యం విజయం సాధించాలి : రౌతు
రాజమహేంద్రవరం నగర కో-ఆర్డినేటర్‌ బాధ్యతలు నిర్వహించడంలో శివరామ సుబ్రహ్మణ్యం విజయం సాధించాలని ఇంతవరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన పూర్వ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆకాంక్షించారు. యువజన కాంగ్రెస్‌ రాజకీయాల నుంచి తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో రెండు పర్యాయాలు నగర ఎమ్మెల్యేగా పనిచేసే అదృష్టం తనకు కలిగిందన్నారు. జగన్‌ సారధ్యంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశించారు. రూరల్‌ కో-ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ శివరాముడు నియామకంతో యువతలో ఉత్తేజం ఉట్టిపడుతోందన్నారు. ఇదొక విజయోత్సాహంగా కనిపిస్తోందన్నారు.  కార్పొరేషన్‌ వైకాపా పూర్వ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ కాలర్‌ ఎగరేసే తరహా పాలననుజగన్‌ అందిస్తున్నారన్నారు. గతం గత: అంటూ నగరంలో కొత్త రాజకీయాన్ని తమ పార్టీ ఆవిష్కరిస్తుందన్నారు.
నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోను : సుబ్రహ్మణ్యం
రాజకీయంగా ఐదేళ్ళపాటు తటస్థంగా ఉన్న తనకు ప్రస్తుతం లభించిన ఈ అవకాశం అదృష్టమో, భయమో, బాధ్యతో తెలియడం లేదని పార్టీ సిటీ  సమన్వయ కర్త శివరామ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రులిద్దరూ మాట్లాడానికి ముందు ప్రసంగించిన ఆయన జగన్‌ తనకు అప్పగించిన బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానన్నారు. సమిష్టి ప్రణాళికతోనే కార్పొరేషన్‌ ఎన్నికల్లో పారీ విజయం సాధించగలదన్నారు. లోపాలు సరిదిద్దుకుంటూ ముందుకు సాగడంలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో  నాలుగైదువేల మెజార్టీతోనైనా రౌతు సూర్యప్రకాశరావు గట్టెక్కుతారని తాను భావించానన్నారు. అందుకు విరుద్ధంగా భారీ మెజార్టీతో ఓటమి పాలయ్యామన్నారు.  స్వార్థంతో పార్టీలు మారే వారికి పట్టం కట్టే పరిస్థితి ఏర్పడినందుకు రాజమహేంద్రవరం సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించారు. కడియం, రాజానగరం నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ జక్కంపూడి రామ్మోహనరావు రాజమహేంద్రవరం కేంద్రంగానే రాజకీయాలు నడిపారని, ఆయన శిష్యుడిగా తాను క్రియాత్మకంగా వ్యవహరిస్తానన్నారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి  ప్రతి ఇంటికి వెళ్ళేలా కార్యక్రమాలు చేస్తానన్నారు. ఇందుకోసం త్వరలో కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. రాజకీయాలను కలుషితం చేసిన తెలుగుదేశం పార్టీకి నగరంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తనకు ఈ అవకాశం కలిగించడంలో కీలకంగా వ్యవహరించిన రాజానగరం ఎమ్మెల్యే – కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌  జక్కంపూడి రాజా కుటుంబానికి  ధన్యవాదాలు తెలిపారు. వైకాపా నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌,  సిసిసి ఛానల్‌ ఎం.పి. పంతం కొండలరావు, గౌతమి సూపర్‌ బజార్‌ పూర్వ చైర్మన్‌  ప్రసాదుల హరినాధ్‌,  జక్కంపూడి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here