ఎన్‌ఎంసి బిల్లును ఉపసంహరించుకోవాలి

0
328
ప్రైవేటు ఆసుపత్రులను బంద్‌ చేసిన వైద్యులు – స్పందించకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరిక
రాజమహేంద్రవరం, జులై 28 : వైద్యరంగాన్ని మరింతగా ఖరీదు చేసేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసి) బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని ఐఎంఎ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎన్‌ఎంసి బిల్లుపై కొన్ని అభ్యంతరాలను తెలుపుతూ కొన్ని సవరణలు చేయాలని ఐఎంఎ ఇచ్చిన సూచనలను పక్కన పెట్టి నియంతృత్వంగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంసి బిల్లును ఆమోదింపచేసే ప్రయత్నాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని , లేనిపక్షంలో ఐఎంఎ ఆదేశాలకు అనుగుణంగా మరిన్ని ఖఠిన నిర్ణయాలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎంఎ ప్రతినిధులు డాక్టర్‌ వై.శ్రీనివాసు, డాక్టర్‌ ఉదయ్‌భాస్కర్‌, డాక్టర్‌ వీరభద్రస్వామి, డాక్టర్‌ కె.విజయకుమార్‌, డాక్టర్‌ పెరుమాళ్లు మాట్లాడారు. దేశంలో సుమారు ఏడు లక్షల మంది వైద్యులచే ఎన్నిక కాబడిన 130 మంది సభ్యులతో పనిచేసే ఎంసిఐను భ్రష్టు పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఎంసిఐలో అవినీతి కూరుకుపోయిందనే కారణాన్ని చూపి ఆ స్థానంలో రాజకీయ పార్టీల చేత నియమించబడే 25 మంది నాన్‌ మెడికల్‌ వ్యక్తులతో పనిచేసే జాతీయ వైద్య కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా చట్టాన్ని ఆమోదింపచేసే ప్రయత్నాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటయ్యే పార్లమెంటును రద్దు చేసి రాష్ట్రపతి కేవలం ఓ వందమంది అధికారుల చేత పాలన చేసినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్‌ఎంసి బిల్లు సామాన్యునికి మరింత భారం కానుందని తెలిపారు. సహేతుకంగా చట్టాన్ని మార్పు చేయాలని సూచించినా కేంద్ర ప్రభుత్వం తమ అభ్యంతరాలను పెడచెవిన పెట్టి నియంత మాదిరిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎన్‌ఎంసి బిల్లు వల్ల వైద్య విద్యార్థులు, ప్రజలు, వైద్యులు కూడా పలు విధాలుగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి పేరుకుపోయిందని ఎంసిఐని రద్దు చేసి అవినీతిపరులతో కూడిన రాజకీయ వ్యవస్థ ద్వారా ఎంపికయ్యే వారిని అప్రజాస్వామికంగా ఎంపిక చేసి ఏం సాధించదలిచారని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ద్వారా అవినీతికి జెండాను ఎగురవేయడమే అవుతుందని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్‌ఎంసి బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేదంటే ఐఎంఎ ఇచ్చిన సూచనలు, ప్రతిపాదనలను ఆ చట్టంలో చేర్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు. ఐఎంఎ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలను బంద్‌ చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా తమ భవిష్యత్‌ కార్యచరణ ఉంటుందని వారు వెల్లడించారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజాభాగస్వామ్యంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సన్నద్ధం అవుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here