ఎపిడిపిఎంఎస్‌లో సవరణలు చేయాలి

0
328
గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డిలకు సర్వేయర్ల వినతి
రాజమహేంద్రవరం, జూన్‌ 22 : భవన నిర్మాణ అనుమతులు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ బిల్డింగ్‌ పర్మిషన్స్‌ (ఎపిడిపిఎంఎస్‌)లో సవరణలు చేయాలని ది రాజమహేంద్రరవం లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌ల అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గుడా చైర్మన్‌ గన్ని కృష్ణను, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందచేసారు. సాప్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాల కారణంగా లైసెన్సు సర్వేయర్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వివరించారు. పట్టణానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో డేటా ఎంట్రీ పొందుపరచకపోవడం వల్ల ప్రజల భవన నిర్మాణ అనుమతులు అప్‌లోడ్‌ చేయలేకపోతున్నామని దీనితో అనుమతులు పొందేందుకు ఆలస్యం అవుతుందని తెలిపారు. ఖాళీ స్థలం పన్నుకి దరఖాస్తు చేసినా నెలల తరబడి తిరగాల్సి వస్తోందని, కాబట్టి ఆన్‌లైన్‌లో ఖాళీ స్థలం పన్ను లింక్‌ పెడితే ప్రజలు తమ బిల్డింగ్‌ ప్లాన్లు త్వరగా అనుమతి పొందేందుకు వీలవుతుందన్నారు. 14 శాతం ఖాళీ స్థలానికి చెల్లించే చార్జీలను కూడా ఏ ఏరియాలో కట్టాలో ఆన్‌లైన్‌లో ఉంచాలని కోరారు. ప్రజలకు భవనాల నిర్మాణానికి ఆన్‌లైన్‌ అనుమతి వచ్చి ఆ తరువాత పోస్ట్‌ వెరిఫికేషన్‌ నెపంతో ఆలస్యం చేస్తున్నారని, కాలానుగుణంగా జరిగే సాఫ్ట్‌వేర్‌ ఆప్‌డేట్ల వల్ల అదనంగా ఫీజులు, లైసెన్సులు బ్లాక్‌లిస్టులతో సర్వేయర్లు, నిర్మాణ దారులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీ వెరిఫికేఫన్‌ ప్రవేశపెట్టాలని విన్నవించారు. జిఓ నెం.119లోని అనెజ్జర్‌-3 వల్ల భవన నిర్మాణదారులు చేసే మార్పులు, చేర్పులకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను బాధ్యులను చేయడంపై ఆలోచించి సర్వేయర్‌, ఇంజనీర్‌ బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్ల ఈనెల 16 నుంచి పెన్‌డౌన్‌ చేస్తున్నట్టు  అధ్యక్షుడు వి.కృష్ణంరాజు, ఉపాధ్యక్షుడు రాజేంద్రవర్మ, కార్యదర్శి సత్యనారాయణ మూర్తి తెలిపారు. సంయుక్త కార్యదర్శి వీర్ని ప్రకాశరావు, కోశాధికారి పిబి ప్రసాద్‌, సంయుక్త కోశాధికారి ఎంవివిఎస్‌ఎస్‌వి ప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here