ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తాం

0
462
గుడా కార్యాలయంలో బిల్డర్స్‌తో సమావేశం
రాజమహేంద్రవరం, జులై 1 :అనుమతి లేని లేఅవుట్లను క్రమబద్దీకరించేందుకుగాను ఎల్‌ఆర్‌ఎస్‌ (లాండ్‌ రెగ్యులరేషన్‌ స్కీమ్‌)ను ప్రవేశ పెట్టేందుకు కృషి చేస్తున్నామని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. గుడా జోనల్‌ కార్యాలయంలో భవన నిర్మాణ సంఘ ప్రతినిధులతో  వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ అనుమతి లేని లే అవుట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయని,వాటిని రెగ్యులరైజ్‌ చేసే విధానం గతంలో ఉండేదని, దానిని మరోసారి ప్రవేశపెట్టగలిగితే చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ అక్రమ లే అవుట్లుగాఉన్న స్ధలాలను కొనుగోలు చేయరాదని సూచిస్తూ స్ధలాలను కొనుగోలు చేసేటప్పుడు ఆయా పంచాయితీలను సంప్రదించాలన్నారు.గతంలో 30 అడుగుల రోడ్లు ఉండేవని, కొత్తగా చేసిన చట్టంలో 40 అడుగులకు తక్కువ కాకుండా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి త్వరలో ఒక కమిటీని నియమించే ఆలోచన ఉందని, ఆ కమిటీలో గుడా ప్లానింగ్‌ ఆఫీసర్‌, సిటీ ప్లానర్‌, ఆర్‌.జె.డి ఉంటారని తెలిపారు. ఈ కమీటీ సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్ధ కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు సంబంధించి అన్ని ధృవీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో దాఖలు చేస్తే పదిరోజుల్లో నగరపాలక సంస్థ ద్వారా అనుమతి లభిస్తుందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్లానింగ్‌ విభాగం నుండి అధికారులు బిల్డింగ్‌ నిర్మాణాలను పరిశీలిస్తారని, ఆన్‌లైన్‌లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం మాత్రమే భవనాలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్‌ వై.వి.ఎస్‌.ప్రసాద్‌, బిల్డర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here