ఏమి కొనేది.. ఏమి తినేది..

0
123
కూరగాయల ధరలు ఆకాశానికి – ఉల్లిపాయలది అదే పరిస్థితి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. అధిక వర్షాలు, వరదల కారణంగా కూరగాయలు సాగు చేసే ప్రాంతాలు ముంపునకు గురి కావడంతో దిగుబడి తగ్గిపోయి ఈ పరిస్థితి ఏర్పడింది. అంతేగాక కార్తీకమాసంలో శాఖాహారానికి అత్యధికులు ప్రాధాన్యం ఇస్తుండటం కూడా కూరగాయల ధరలు పెరుగుదలకు కారణమయ్యింది. రైతుబజారులలోనే ధరలు అధికంగా ఉండగా ఇంక ప్రైవేటు మార్కెట్‌లో సంగతి చెప్పనక్కరలేదు. రైతుబజార్లలో వంకాయల ధర కిలో రూ.50 పలుకుతుండగా బీరకాయలు కిలో రూ.40, బెండకాయలు కిలో రూ.38, దొండకాయలు రూ.40, టమోటా రూ.32, కాకరకాయలు రూ.26 పలుకుతుండగా క్యాబేజీ ధర రూ.25 వరకు ఉంది. కాగా క్యారెట్‌, బీట్‌రూట్‌ ధరలు చెప్పనే అక్కర్లేదు. క్యారెట్‌ రైతుబజార్‌లో కిలో రూ.64, బీట్‌రూట్‌ రూ.48 వరకు పలుకుతోంది. అల్లం కిలో రూ.68 ఉండగా ప్రైవేటు బజార్‌లలో ఇంతకంటే రెట్టింపు పలుకుతున్నాయి. ఉల్లిపాయల ధర రైతుబజార్‌ల్లో ఒక మోస్తరు రకం ఉల్లిధర రూ.26 వరకు పలుకుతుండగా ప్రైవేటు బజార్‌లో నాణ్యతను బట్టి కిలో రూ.80 వరకు ఉండటంతో ఉల్లి ధరలు సామాన్యులు కొనేటట్లుగా లేవు. దీంతో ఉల్లి కష్టాలు ఇప్పట్లో తీరేటట్లుగా కనిపించడంలేదు. ధర ఘనంగా ఉన్నా నాణ్యత లేకపోవడంతో ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కొనేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు కారణంగా పంటలు దెబ్బతినడంతో గత మూడునెలలుగా ఉల్లిధర పరిస్థితి ఇలాగే ఉండటంతో మరికొద్దిరోజుల వరకు ఉల్లిధర దిగి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. కార్తీకమాసం కావడంతో ఉల్లి వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి తగ్గిపోవడంతో ధర పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here