ఒకరు పార్ట్‌ టైం నాయకుడు.. మరొకరు ఫెయిల్‌ 

0
174
పవన్‌, జగన్‌లపై తెదేపా నేత యినుకొండ సుబ్రహ్మణ్యం ధ్వజం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 22 : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్ట్‌ టైం రాజకీయ నాయకుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యినుకొండ సుబ్రహ్మణ్యం విమర్శించారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్నికలు వచ్చిన సమయంలో కనిపించి తరువాత కనిపించకపోయే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అని దుయ్యబట్టారు. తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేసిన మాదిరిగానే పవన్‌కల్యాణ్‌ కూడా తన పార్టీ జనసేను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేస్తారని ఆయన జోస్యం చెప్పారు. వైపస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ఇద్దరు బీజేపీకి తొత్తులేనని… అందుకే కేంద్రాన్ని వారిద్దరూ నిలదీయడం లేదన్నారు. ప్రతిపక్షం తన పాత్ర మరచిపోయిందని… ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయకపోతోందన్నారు. జగన్‌ అసెంబ్లీకి హాజరుకాకుండా యాత్రలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాడని దుయ్యబట్టారు. అసెంబ్లీకి వెళ్లకుండా, సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జీతాలు మాత్రం తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేసారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు ఆవేదన, ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీసీలపై ఎక్కడ లేని ప్రేమ జగన్‌ ఒలకబోస్తున్నారని,అయితే డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో కడపలో గానీ, చిత్తూరులో గానీ  రిజర్వేషన్‌ సీట్లలో మినహా వారి సామాజిక వర్గం వారికితప్ప, ఒక్క బిసికి అయినా ఎందుకు టికెట్స్‌ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకే బిసిల పునాది మీదేనని ఎన్టీఆర్‌ ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. బిసిలు విదేశాల్లో  చదువుకోడానికి పదిలక్షల రూపాయల సాయాన్ని ఈ ప్రభుత్వం అందిస్తోందని అందుకే  600మంది విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని వినుకొండ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇక  అగ్రవర్ణాలైన బ్రాహ్మణులలో  కూడా పేదలున్నారని గుర్తించి,బ్రాహ్మణ కార్పొరేషన్‌ కూడా చంద్రబాబు  ఏర్పాటుచేశారని ఆయన చెప్పారు.
వచ్చేది నిశ్శబ్ద విప్లవమే ..
ఆనాడు 1994లో ఎన్టీఆర్‌ నిశ్శబ్ద విప్లవం రాబోతోందని అన్నారని, అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ పునరావ తం అవుతుందని, చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని  అందరూ కోరుకుంటున్నారని వినుకొండ అన్నారు.శ్రీకాకుళం జిల్లాలో తుపాన్‌ కారణంగా అతలాకుతలం అయితే కనీసం పలకరించడానికి కూడా ప్రతిపక్ష నేత వెళ్ళకపోవడం శోచనీయమని, మరోపక్క జనసేన పవన్‌ కళ్యాణ్‌ వెళ్లినప్పటికీ ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బిజెపి చెప్పినట్లు జగన్‌,పవన్‌ ఆడుతున్నారని, అందుకే అందరికీ చంద్రబాబు టార్గెట్‌ అయిపోయారని  ఆయన అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కి ఎలా అమ్మేశారో, అలాగే జనసేనను కూడా పవన్‌ బిజెపికి అమ్మేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
వాస్తవానికి విరుద్ధంగా ఉంటె ప్రజలే అడ్డుకుంటారు
కాగా రామ్‌ గోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే సినిమా తీస్తున్న విషయాన్నీ ప్రస్తావించగా రామ్‌ గోపాల్‌ వర్మ గురించి చెప్పేదేముంటుందని, ఎన్నికలు వస్తున్నాయి కనుక ఏదో చేస్తున్నారని,ప్రజలు అన్నీ గమనిస్తారని వినుకొండ అన్నారు. అవాస్తవాలు చూపించి వక్రీకరిస్తే ప్రజలే సినిమాను అడ్డుకుంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here