ఓటమికి నైతిక బాధ్యత నాదే..

0
401
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి
వైసిపి సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు
రాజమహేంద్రవరం, మే 27 : సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోవడానికి నైతిక బాధ్యత తనదేనని మాజీ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. స్థానిక జాంపేట పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో రౌతు మాట్లాడుతూ రెండు దఫాలు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి రాజమహేంద్రవరం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసానని అయినా మొదటిసారి ఓటమి పాలయ్యానన్నారు. ఈ ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని.. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఓటమిపై పార్టీ నాయకులతో విశ్లేషణ చేసిన తరువాత పార్టీ అధిష్టానానికి నివేదిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరం ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, తనకు 52 వేల మంది ఓటు వేసారని వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఇసుక, మట్టి మాఫియాలను ప్రోత్సహించి ప్రజా ప్రతినిధులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నా చూస్తు ఊరుకుందని, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వాటన్నింటికి పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టడం జరుగుతుందన్నారు. జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు అందరికి తెలిసినవేనన్నారు. నగర సమస్యలను సిఎం జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేసారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, కురుమెల్లి అనూరాధ, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, ఇసుకపల్లి శ్రీనివాస్‌, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, బురిడి త్రిమూర్తులు, పెంకే సురేష్‌, గాడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here