కంబాలచెరువు పార్కు.. కొత్త కళ చూడు..

0
272
ఆబాల గోపాలానికి అందాల హరివిల్లుగా రూపుదిద్దుకున్న ఉద్యానవనం
ఓపెన్‌ ఎయిర్‌ ధియేటర్‌- జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు – ఫోటో వ్యూ పాయింట్‌
బాలయోగి నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు : పార్కు నిర్వహణలో గుడా భాగస్వామ్యం
సందర్శకులకు అరకు కాఫీ రుచి – నెరవేరనున్న గన్ని స్వప్నం : రేపటి ప్రారంభోత్సవానికి  సర్వం సిద్ధం
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9 : భరించరాని దుర్గంధం… కళా విహీనంగా కనిపించే ప్రాంగణం…ఇది మొన్నటి మాట…ఆహ్లాదకరమైన వాతావరణం… పిల్లల కేరింతలతో, సందర్శకుల తాకిడితో కళకళలాడుతున్న మనోహర ఉద్యాన వనం… ఇది నేటి సజీవ సాక్షాత్కరం… రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున  సమస్యలతో కొట్టుమిట్టాడిన కంబాలచెరువు పార్కు ఇపుడు సరికొత్త సొబగులతో సందర్శనీయ కేంద్రంగా రూపుదిద్దుకుంది. గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ, నగర పాలక సంస్థల సమిష్టి కృషి ఫలితంగా కంబాలచెరువు సుమనోహర దృశ్య కావ్యంగా కనువిందు చేస్తోంది. ఒకప్పుడు కంబాలచెరువు దుర్గంధం వెదజల్లుతూ మురికికూపంగా పరిసర వాసులకే గాక ఆ రహదారి మీదుగా వెళ్ళే వారికి అసౌకర్యం కలిగించగా 1996లో కూడా సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఇచ్చిన శ్రమదానం పిలుపు మేరకు నాటి రాజమహేంద్రవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గన్ని కృష్ణ చొరవతో ఆయన సారధ్యంలో తెదేపా శ్రేణులతో పాటు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అనేక సేవా సంస్ధలు, విద్యార్ధులు శ్రమదానంలో భాగస్వామ్యమై  కంబాలచెరువు పరిసరాలను పరిశుభ్రపర్చారు. నాటి శ్రమదానంలో దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసి బాలయోగి, మాజీ మంత్రి దివంగత డా.మెట్ల సత్యనారాయణ తదితరులు కూడా భాగస్వామ్యులయ్యారు. ఆ తర్వాత ఆనాడు మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న వికాస్‌రాజ్‌ కంబాలచెరువు ప్రాంగణాన్ని మంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. ఫలితంగా కంబాలచెరువు నగర వాసులకు సాయంత్రమయ్యే సరికి ఓ సందర్శనీయమైన కేంద్రంగా మారిపోయింది.  అయితే కొంత కాలం తర్వాత ఆ ప్రాభవం కొడిగట్టింది. పార్కు కథ కమామిషు మళ్ళీ మొదటి కొచ్చింది.  2015 గోదావరి పుష్కరాల కాలంలో పార్కు అభివృద్ధికి నిధులు మంజూరు కాగా చేపట్టిన పనులతో ఉద్యానవనం కొద్ది రోజులు మళ్ళీ కళకళలాడినా ఆ తర్వాత యథాస్థితికి చేరుకుని సందర్శకులు అటు కన్నెత్తి చూడని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముందు నుంచి పార్కు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి చూపుతూ వచ్చిన గన్ని కృష్ణ కంబాలచెరువు పార్కుకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చొరవ చూపారు. గుడా చైర్మన్‌గా నియమితులైన గన్ని తాను మానస పుత్రికగా భావించే కంబాలచెరువు పార్కుపై ప్రత్యేక దృష్టి సారించి నగర పాలక మండలి, నగర పాలక సంస్ధ అధికారులతో సంప్రదింపులు జరిపి పార్కుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. గతంలో కమిషనర్‌గా ఉన్న విజయరామరాజు అభ్యర్ధన మేరకు పార్కు అభివృద్ధి పనులకు కార్యరూపం ఇచ్చేందుకు గుడా నుంచి రూ. 48 లక్షలను మంజూరు చేశారు. ఆ నిధులతో పార్కు చుట్టూ సిమెంట్‌ రైలింగ్‌ స్ధానే స్టీల్‌ రైలింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే  సీఎం చంద్రబాబు మధురపూడి ఎయిర్‌పోర్టు రోడ్డులో పచ్చదనాన్ని పెంపొందించవలసిందిగా  సూచించడంతో ప్రస్తుత కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ అభ్యర్ధన మేరకు పార్కుకు కేటాయించిన ఆ నిధులను మధురపూడి ఎయిర్‌పోర్టు రోడ్డు అభివృద్ధి పనులకు మళ్ళించారు. అయినా కంబాలచెరువు పార్కు అభివృద్ధిపై పట్టుదలతో ఉన్న గన్ని కృష్ణ ఆ విషయాన్ని అక్కడితో వదిలి వేయకుండా అధికారులతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతమయ్యేలా శ్రద్ధ వహించారు.ఫలితంగా నగర పాలక సంస్థ  సాధారణ నిధులు, అమృత్‌ నిధులతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయి. గన్ని ప్రయత్నానికి గతంలో నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన విజయరామరాజు, ప్రస్తుత కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీలు పూర్తిగా సహకరించడంతో పార్కు అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. కాగా పార్కుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆరంభమైన పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. పార్కులో ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునేలా కొత్తగా ఓపెన్‌ ఎయిర్‌ ధియేటర్‌, మహిళలకు, పురుషులకు ఓపెన్‌ జిమ్‌లు, పిల్లల కోసం చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, మూడు ప్లాజాల నిర్మాణం, ఫోటో షూట్‌ కోసం వ్యూ పాయింట్‌, గ్రీనరీ, వాకింగ్‌ ట్రాక్‌, వాటర్‌ ఫౌంటెన్‌, మరుగుదొడ్ల ఆధునికీకరణతో పాటు అందమైన రంగులతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు.  పార్కులో సేద తీరేందుకు, వాకింగ్‌కు వచ్చేవారి కోసం గిరిజన కార్పొరేషన్‌ సహకారంతో అరకు వ్యాలి కాఫీ షాప్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాగా పార్కు నిర్వహణ బాధ్యతల్లో నగర పాలక సంస్థతో పాటు
గుడా భాగస్వామిగా నిలవనుంది.  ఈ మేరకు ఇప్పటికే గుడా బోర్డు సమావేశంలో తీర్మానం కూడా చేశారు.  త్వరలోనే నగర పాలక సంస్ధ అధికారులతో గుడా అధికారులు ఎంఓయు చేసుకోనున్నారు. పార్కు అభివృద్ధికి జరిగిన శ్రమదానంలో పాల్గొనడంతో పాటు జిల్లా అభివృద్ధిలో మమేకమై ప్రజలపై చెరగని ముద్ర వేసుకున్న దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసి బాలయోగి విగ్రహాన్ని గన్ని గతంలో పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేయగా ఆ విగ్రహం స్ధానే ఇపుడు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ చూపి గుడా నుంచి రూ. 14 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో బాలయోగి విగ్రహంతో పాటు స్మారకంగా పైలాన్‌ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరో వైపు పార్కు అందమైన విద్యుద్దీపాలతో కాంతులీనేలా ఉండేందుకు సహకారం అందించాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఇప్పటికే ఓఎన్‌జీసి అసెట్‌ మేనేజర్‌ డీఎంఆర్‌ శేఖర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. నగర పాలక సంస్థ అధికారులు ఇప్పటికే అంచనాలు రూపొందించి వాటిని ఓఎన్‌జీసి అధికారులకు అందజేశారు.
పార్కు అభివృద్ధి పనులకు రేపు ప్రారంభోత్సవం
ఆధునికీకరించిన కంబాలచెరువు పార్కును, వివిధ విభాగాలను రేపు ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శానసమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, ఇతర ప్రజా ప్రతినిధుల  చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. బాలయోగి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన తనయుడు హరీష్‌ కూడా హాజరు కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here