కక్షతోనే కాల్చి చంపాడు

0
422

సులభ్‌ కాంప్లెక్స్‌లో జరిగిన హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

నగరంలో కొత్తగా 370 సీసీ కెమెరాలు ఏర్పాటు

చెడ్డి గ్యాంగ్‌ కోసం ప్రత్యేక బృందం : అర్బన్‌ ఎస్పీ

రాజమహేంద్రవరం, మార్చి 6 : గోదావరి గట్టుపై ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌లో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితుడు తోట వీరబాబును అర్బన్‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి వెల్లడించారు. ఈనెల 2వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి గట్టున మార్కండేయేశ్వరస్వామి గుడికి సమీపంలో ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే వీర వెంకటేశ్వరరావు క్యాబిన్‌ రూమ్‌లో నిద్రిస్తుండగా తోట వీరబాబు అనే వ్యక్తి పెట్రోల్‌ వేసి నిప్పంటించి అక్కడ నుంచి పరారయ్యాడని ఎస్పీ తెలిపారు. వీరబాబు కంభం జిల్లాకు చెందిన వ్యక్తి అని, చెడు వ్యసనాలకు బానిసై తొలుత విజయవాడలో గవర్నర్‌ పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండుసార్లు దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళాడని తెలిపారు. ఆ తరువాత రాజమహేంద్రవరంలో గత 10 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో క్యాటరింగ్‌ పనులు చేస్తూ గోదావరి గట్టున నిద్రించే సాధువులను భయపెట్టి వారి నుంచి డబ్బులు లాక్కుని భయపెడతాడన్నారు. ఆ క్రమంలోనే ఓ సాధువు వద్ద డబ్బులు లాక్కునే సమయంలో సులభ్‌ కాంప్లెక్స్‌ పర్యవేక్షకుడు వీర వెంకటేశ్వరరావు అడ్డుపడి మందలించాడని, వెంకటేశ్వరరావుతోపాటు వచ్చిన కార్తీక్‌, ప్రసాద్‌ సాయంతో వీరబాబును కొట్టి అక్కడ నుంచి పంపేశారని తెలిపారు. దీంతో వెంకటేశ్వరరావుపై కక్ష పెట్టుకుని చంపాలన్న ఉద్దేశ్యంతో పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్ళి ఒక ప్లాస్టిక్‌ బ్యాటిల్‌లో పెట్రోల్‌ తెచ్చి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సులభ్‌ కాంప్లెక్స్‌లోకి వెళ్ళి క్యాబిన్‌ రూమ్‌లో పడుకుని ఉన్న వెంకటేశ్వరరావుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడని తెలిపారు. కేసు నమోదు చేసిన తమ సిబ్బంది కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ స్టాఫ్‌ సహకారంతో సెంట్రల్‌ జోన్‌ డిఎస్పీ కులశేఖర్‌, వన్‌టౌన్‌ సిఐ రవీంద్ర, ఎస్‌ఐ రాజశేఖర్‌, ఎఎస్‌ఐ శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ చిన్నారావు, కానిస్టేబుల్స్‌ నెహ్రూ, ప్రదీప్‌, వీరబాబులు చాకచక్యంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేశారని తెలిపారు. ఘటన జరిగిన రెండు గంటలలోపే హత్య జరిగిందని నిర్ధారించి వివరాలు పూర్తిగా సేకరించగలిగామన్నారు. వెంకటేశ్వరరావుతోపాటు కార్తీక్‌ అనే వ్యక్తిని కూడా హతమార్చేందుకు వీరబాబు సిద్ధమయ్యాడని తెలిపారు. ఇతనిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని పేర్కొన్నారు. నగరంలో తిరుగుతున్న చెడ్డీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో వారిని పట్టుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం నగరంలో 120 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, మరో 370 కొత్త కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని ఎస్పీ తెలిపారు. హత్య కేసులో నిందితుడిని చాకచక్యంగా, త్వరితగతిన అరెస్ట్‌ చేసిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందికి రివార్డ్స్‌ అందిస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో స్పెషల్‌ బ్రాంచి డిఎస్పీ రామకృష్ణ, సెంట్రల్‌ జోన్‌ డిఎస్పీ కులశేఖర్‌, వన్‌టౌన్‌ సిఐ రవీంద్ర, ఎస్‌ఐ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here