కక్ష సాధింపు కోసం నీతిమాలిన రాజకీయాలు

0
186
హోదా నుంచి దృష్టి మరల్చేందుకే తెరపైకి ప్రజా వేదిక అంశం
చంద్రబాబును దోషిగా చూపాలనే తాపత్రయంలో సీఎం
ముందు తెలంగాణా నుంచి  బకాయిలు రాబట్టండి : జగన్‌ తీరుపై గన్ని ధ్వజం
రాజమహేంద్రవరం, జూన్‌ 28 : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌, మరికొంత మంది నాయకులు స్పష్టం చేసిన నేపథ్యంలో దాని నుంచి ప్రజల ఆలోచనను మళ్ళించేందుకే వైకాపా పాలకులు ప్రజావేదిక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని, గత ఐదేళ్ళ నుంచి చంద్రబాబుపై గోబెల్స్‌ ప్రచారం ప్రారంభించిన జగన్‌ బృందం ఇప్పుడు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవ్వాలని గత పదేళ్ళలో ఎన్నో యాత్రలు చేసి, అభూత కల్పనలతో ఎలాగైతే అధికారంలోకి వచ్చిన జగన్‌ నవరత్నాలు, పోలవరం,రాజధాని నిర్మాణాలపై దృష్టి సారించకుండా అసహనంతో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదికను తక్షణమే కూల్చాలని పట్టుబట్టారని, కలెక్టర్లు,ఎస్పీలతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుని రాత్రికి రాత్రి కూలగొట్టారని అన్నారు. అక్రమ కట్టడాలను పడగొట్టడం ప్రజావేదిక నుంచే ప్రారంభిస్తామన్న జగన్‌ క ష్ణానది ఇవతల వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యే బార్‌ లో కల్తీ మద్యం త్రాగి చనిపోయారని, ఇప్పడు అక్కడ సమావేశం నిర్వహించి కల్తీ మద్యం అమ్మకాలను అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. గతంలోకి వెళితే 1999 -2004 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్థలంలో అక్రమంగా గృహ నిర్మాణం చేపట్టగా నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారని,ఆ సమయంలో నగరపాలక సంస్థ ప్రొసిడింగ్స్‌ ఆపాలని, తన నివాసాన్ని రెగ్యులరైజ్‌ చేయాలని చంద్రబాబును వైఎస్‌ కోరారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు నగరపాలక సంస్థ ప్రొసిడింగ్స్‌ను నిలుపుదల చేయగా ఆ తరువాత ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్సార్‌ క్యాబినెట్‌ నిర్ణయం ద్వారా తన నివాసాన్ని రెగ్యులరైజ్‌ చేయించుకున్నారని తెలిపారు. నాడు చంద్రబాబునాయుడు మంచితనం వలనే రాజశేఖరరెడ్డికి ఆ భవనం మిగిలిందని, తండ్రికి చేసిన మేలుకు ప్రతిగా ఆయన కుమారుడు జగన్‌ ఇప్పుడు రిటర్న్‌ గిఫ్ట్‌ చంద్రబాబుకి ఇచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌కి కూడా నోటీసులు పంపారని, అయితే అక్రమ కట్టడాలన్నిటికి పంపిస్తారా అని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలకు ఇవే నిదర్శనమని పేర్కొన్నారు.గత ఐదేళ్ళుగా ప్రశాంత్‌ కిషోర్‌, విజయసాయిరెడ్డి,వారి బృందం చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేసి అభూత కల్పనలు సృష్టించారని, చివరకు చంద్రబాబు త్రాగే మంచినీటి విషయంలో అవాస్తమైన లెక్కలతో సోషల్‌ మీడియా ద్వారా విష ప్రచారం చేశారని మండిపడ్డారు. విజయవాడలో జగన్‌ తన ఇంటి నిర్మాణం కోసం చుట్టుప్రక్కల ఉన్న నివాసాలు ఖాళీ చేయించారని, ఇంటికి వెళ్ళే మార్గంలో రూ.5 కోట్లతో 1.3 కిలోమీటర్లు రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసి నిధులు కేటాయించారని అన్నారు.ఆయన ఇంటి దగ్గర హెలిప్యాడ్‌ నిర్మాణానికి రూ.1.89 కోట్లు కేటాయించారని అన్నారు. నిధుల దుర్వినియోగం కోసం మాట్లాడే నైతిక హక్కు వీరికి లేదని అన్నారు. ప్రజావేదిక నిర్మాణానికి 9 కోట్లు ఖర్చు చేశారని,దానిలో ఏమి లేవంటూ రాజధాని నుండి రాజమహేంద్రవరం వరకు ఉన్న ఓ మహిళా నాయకురాలు సైతం విమర్శలు చేస్తున్నారని,అయితే ప్రజావేదిక నిర్మాణంలో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కేవలం రూ. 90 లక్షలతో నిర్మించి కోటి రూపాయలతో అంతర్జాతీయ స్టాండర్డ్స్‌కి తగినట్టుగా, నూతన టెక్నాలజితో సౌకర్యాలు కల్పించారని,జిఒ 104 చూసి మాట్లాడాలని సూచించారు. అంతేగాని కోళ్ళఫారమని,రేకుల షెడ్‌ అని నోటి కొచ్చినట్లు మాట్ల్లాడటం సరికాదని, ఎదుటి వారిపై నిందలు వేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని, యువ రాజకీయ నాయకులు మరచిపోకూడదన్నారు. ప్రజావేదిక నిర్మాణం వలన నదికి ఎలాంటి నష్టం వాటిల్లదని, అవసరం లేనప్పుడు సులభతరం దానిని తొలగించి మరోచోట నిర్మించుకునేందుకు 80 శాతం మెటీరియల్‌ పని చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు పోలీస్‌ శాఖలో తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రమోషన్లు ఇచ్చారని ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదును జగన్‌ ఇచ్చారని,అది పూర్తిగా అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్‌ తాను జరిపిన నియామకాలను చూస్తే కులగజ్జి ఎవరికి ఉందో అర్ధమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిపోతుందంటూ జగన్‌ బృందం, మరికొంత మంది మేధావులు గగ్గోలు పెట్టారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంచనాలు కరెక్ట్‌ అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో విమర్శకుల నోళ్ళు మూతపడ్డాయన్నారు. రాజధానిలో ఒక్క ఇటుక కూడా పడలేదన్న జగన్‌ ఇప్పుడు ఎక్కడ కూర్చొని పరిపాలన సాగిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన చంద్రబాబుపై గోబెల్స్‌ ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టిసారించకుండా అక్రమాలను తవ్వేస్తాను….అంతు చూస్తాను అంటూ ప్రజలకు తప్పడు సంకేతాలు ఇవ్వడం సరికాదన్నారు. విద్యుత్‌ కొనుగోలులో అక్రమాలు జరిగాయని జగన్‌ వ్యాఖ్యానించగా, దానిలో ఏ అక్రమాలు జరగలేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు లేఖను విడుదల చేశారని అన్నారు. చంద్రబాబును దోషిగా నిలపాలన్న యావ తప్ప ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచన జగన్‌లో కనిపించడం లేదన్నారు.ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కుమారుడు ముఖ్యమంత్రి కావడం ఇదే ప్రధమమని,దానిని నిలబెట్టుకునేలా పరిపాలించాలన్నారు. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నిటిపై జగన్‌ చర్యలు తీసుకోవాలని,అలాగే గోదావరి నదిని ఆనుకొని ఉన్న కట్టడాలను కూల్చుతారా అని ప్రశ్నించారు.క ష్ణా నది కరకట్టపై 2005 నుంచే కట్టడాలు ప్రారంభమయ్యాయని, వైఎస్‌ హాయాంలోనే అక్రమ కట్టడాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. కృష్ణా నది ఇవతల వుడా, ఆర్‌.టి.సి.బస్టాండు, మునిసిపల్‌ గెస్ట్‌ హౌస్‌, పోలీసు కార్యాలయాలు ఉన్నాయని,వాటిని కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు. కేవలం ధన సంపాదన కోసమే ఈ కొత్త నాటకానికి తెర లేపారని అన్నారు. చంద్రబాబు ఉంటున్న ఇంటి విషయంలో మంత్రి బొత్స చట్టాల కోసం మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని, వోక్స్‌ వాగన్‌ కేసులో ఉండి వైఎస్‌, షర్మిలాను విమర్శించిన ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. గెలిచినా,ఓడినా నీతిని అనుసరించాలని కోరారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధ్యం కాదని నిర్మలా సీతారామన్‌,కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి చెప్పారని, దానిపై పెదవి విప్పలేకే రాష్ట్ర ప్రజల ఆలోచనలను జగన్‌ మళ్ళించారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే బిజెపితో చంద్రబాబు గొడవపెట్టుకున్నారని గుర్తు చేశారు. తనకు అత్యంత ప్రియుడైన కెసిఆర్‌ ద్వారా తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన లక్ష కోట్ల బకాయిలను రప్పించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు కాశి నవీన్‌ కుమార్‌, రెడ్డి మణి, కురగంటి సతీష్‌, మజ్జి రాంబాబు, కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, కోసూరి చండీప్రియ, మళ్ళ నాగలక్ష్మి, కడలి రామకృష్ణ , నాయకులు కంటిపూడి శ్రీనివాస్‌,పితాని కుటుంబరావు, ఉప్పులూరి జానకిరామయ్య, మళ్ళ వెంకట్రాజు, విశ్వనాధరాజు,సెనివాడ అర్జున్‌, వానపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here