కట్టు కథ అయితే నిజాలేమిటో చెప్పాలి

0
454
జైపాల్‌రెడ్డికి ఉండవల్లి డిమాండ్‌
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 23 : తాను రాసిన ‘విభజన కథ’ కట్టు కథ అని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి నిజాలు ఏమిటో  ఇప్పటికైనా స్పష్టం చేయాలని మాజీ పార్లమెంట్‌ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. విభజన సమయంలో గంటపాటు అప్పటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కమల్‌నాధ్‌తో కలిసి తాను చర్చించానని, ఆ విషయాలను బయటపెట్టకపోవడం వల్లే 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని వ్యాఖ్యలు చేసిన జైపాల్‌రెడ్డి ఆ గంటలో జరిగిన చర్చలను బయటపెట్టాలన్నారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలను తాను ఊహించే రాశానని, ఇది విశ్లేషణ మాత్రమేనని ఆయన అన్నారు. వై-జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన ప్రక్రియ కుట్రతో కూడుకున్నదని, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందన్నారు. తన ఊహ తప్పయితే ఆ విషయాన్ని జైపాల్‌ రెడ్డే స్పష్టం చేయాలని కోరారు. జైపాల్‌రెడ్డి ఎంతో మేధా సంపత్తి కలిగిన నాయకుడని, ఆరోజు జరిగిన చర్చలో విభజన బిల్లును ఏ విధంగా ఆమోదింపచేయాలో సలహా ఇచ్చి ఉంటారని, ఇప్పటికైనా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని, సెంటిమెంటుకు లోనై తప్పుడు సలహా ఇచ్చినట్లు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలన్నాక ఎంతోమంది విమర్శలు చేస్తుంటారని, అయితే జైపాల్‌రెడ్డి వంటి గొప్ప నాయకుడు తన పుస్తకంపై స్పందించడం వల్ల తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన ప్రశ్నకు జైపాల్‌రెడ్డి తప్పించుకోరని, ఖచ్చితంగా సమాధానం చెబుతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. స్పీకర్‌ వెల్‌ వద్ద సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా ఎటువంటి బిల్లు ఆమోదించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ లోక్‌సభలో ఏ విధంగా ఈ బిల్లును ఆమోదించారో అన్న విషయాన్ని ప్రస్తుత ఎంపీలు ప్రశ్నించడంతోపాటు చర్చ జరపాలని సూచించారు. ప్రత్యేక హోదాపై మాట మార్చిన బిజెపి ఏపి నుంచి కేంద్రానికి వెళుతున్న పన్నుల సొమ్మును ఏపికే వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో బయ్యా జోసఫ్‌రాజు, అశోక్‌కుమార్‌ జైన్‌, నక్కా శ్రీనగేష్‌, లింగంపల్లి వెంకటేశ్వరరావు, కుంపట్ల అమరనాధ్‌, పసుపులేటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.