కర్తవ్యంలో కఠినంగా ఉన్నా పోలీసుల మనస్సు వెన్న

0
347
రక్తదాన శిబిరంలో అర్బన్‌ ఎస్పీ రాజకుమారి
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : పోలీసుల విధులు కఠినతరంగా ఉన్నప్పటికీ శాంతి భత్రల పరిరక్షణలో వెనుకంజ వేయబోరని అర్బన్‌ జిల్లా ఎస్సీ బి రాజకుమారి అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు స్ధానిక ఉమారామలింగేశ్వర కళ్యాణమండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధిగా అర్బన్‌ జిల్లా ఎస్పీ రాజకుమారి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యం పాక్‌ ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ వారి దుశ్చర్యలను తిప్పికొడుతుందన్నారు. దేశ పరిరక్షణకు ఎందరో సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో కూడా పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు. పోలీసులు నిత్యం ప్రజలతో మమేకం అవ్వాలని, నేరాల నియంత్రణలో మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా 100వ సారి రక్తదానం చేసిన త్రిటౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎ వెంకట్రాజుకు పూలబొకే అందించిన ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజం పట్ల వెంకట్రాజుకు ఉన్న బాధ్యతలను పోలీసులు గుర్తెరిగి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అమరవీరుల వారోత్సవాలలో భాగంగా విద్యార్ధులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు ఉదయం రంభ ధియేటర్‌లో ఉదయం ఆట, గీతా అప్సరా ధియేటర్‌లో రేపు ఉదయం ఆట పోలీసు పాత్రలో వచ్చిన సినిమాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నామని ఆసక్తిగల వారు వీక్షించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి ఆర్‌ గంగాధరరావు, డిఎస్పీలు శ్రీకాంత్‌, సత్యానందం, కె రమేష్‌బాబు, నారాయణరావు, శ్రీనివాసరావు, భరత్‌మాతాజీ, రామకృష్ణ, కులశేఖర్‌, శ్రీనివాసరెడ్డి, సిఐలు సూరిబాబు, రవీంద్ర, సుబ్రహ్మణ్యేశ్వరావు, బాజీలాల్‌, రామకోటేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ కిశోర్‌, వైద్యులు మాధవి, సుభాషిణిలు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరానికి సహకారం అందించిన సంజీవిని స్వచ్చంద రక్తదాతల సేవా సంస్ధ నిర్వాహకులు కోటిపల్లి శ్రీనివాస్‌, రాజమహేంద్రవరం ఛారిటబుల్‌ట్రస్ట్‌ సభ్యులను  ఎస్పీ రాజకుమారి అభినందించారు. ప్రముఖ బంగార ఆభరణాలు షోరూమ్‌ జాయ్‌ ఆలూకాస్‌, జోస్‌ అలూకాస్‌ సిబ్బంది, బియిడి కళాశాలలకు చెందిన విద్యార్ధులు స్వచ్ఛందంగా శిబిరానికి హాజరై రక్తదానం చేశారు.