కలవరపెడుతున్న  కయాంత్‌

0
257
 
29న తీరం దాటే అవకాశం – దీపావళి సరదా డౌటే
 
విశాఖపట్నం, అక్టోబర్‌ 27 : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన  వాయుగుండంగా కలవరపెడుతోంది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీరం దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం శనివారం నాటికి తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని తుపాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే తీరం ఎక్కడ దాటుతుందనే విషయమై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. ఈ తుపాన్‌కు కయాంత్‌  అని నామకరణం చేశారు. తుపాన్‌ ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచి భారీ వర్షాలు కురుస్తాయని  తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ రాత్రి నుంచే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, రేపటి నుంచి సోమవారం వరకు వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కాగా సరిగ్గా దీపావళి పండుగ  ముందు తుపాన్‌ కలవర పెడుతుండటంతో ఈ సారి పండుగ సంబరం ప్రశ్నార్ధకమైంది. సరిగ్గా పండుగ ముందు రోజున కయాంత్‌ తీరం దాటే అవకాశాలు ఉండటంతో ఆ మరునాడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో దీపావళి వెలుగులు అనుమానమే. కాగా పండుగ పేరు చెప్పి బాణాసంచ వ్యాపారం ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని భావించిన వ్యాపారుల ఆశలపై కయాంత్‌ నీళ్ళు జల్లుతోంది.