కల్లోలంలో కాసులవేట–

0
539
మనస్సాక్షి  – 1103
వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. వెంకటేశం ఎర్రబస్సెక్కి తన సొంతూరైన గంగలకుర్రు వెళ్ళిపోవల్సిందే. అలా శనివారం సాయం త్రం వెళ్ళిపోయినోడు మళ్ళీ సోమవారం ఉదయాన్నే రాజమండ్రిలో వాలిపోతాడు. అంటే దానర్ధం వారమంతా ఏ ఉద్యోగం లోనో, వ్యాపారంలోనో బిజీ అని కాదు. చేసేదల్లా గిరీశం గారి దగ్గర పోసికోలు కబుర్లు వినడమే. మరి ఈ వీకెండ్‌ టూర్‌ లేంటంటే అదంతే. అలా అలవాటయి పోయింది. అలా వారానికోసారి తన ఊరెళ్ళి తన వాళ్ళందర్నీ పలకరించి, యింకా  పాత స్నేహితులతో సరదాగా గడిపి మరీ వస్తుం టాడు. ప్రస్తుతం కూడా వెంకటేశం అలా ఎర్రబస్సెక్కి గంగల కుర్రులో దిగాడు.  అయితే ఈసారో విశేషం జరిగింది. వెంకటేశం బస్సు దిగి ఊళ్ళోకి నడుస్తున్నాడు. అయితే ఈసారి ఎప్పుడూ లేంది ఊరంతా ఏదో హడావిడిగా ఉన్నట్టుంది. ఏవయిందా అని ఆలోచిస్తూ గుడివీధిలోకి తిరిగాడు. అక్కడ వీధి చివర్లో  ఓ చోట అంతా గుమిగూడి ఉన్నారు. అక్కడేం జరుగుతుందో వెంక టేశానికి అర్థంకాలేదు. యింతకీ అది సూరిబాబు యిల్లు. ‘కొంప దీసి సూరిబాబు యింట్లో ఎవరన్నా బాల్చీ తన్నేశారా’ అనుకుంటూ అటు నడిచాడు. దగ్గరకెళ్ళి చూస్తే అలాంటిదేం లేదు. అక్కడ సూరిబాబు యింటరుగు మీద కూర్చుని బిజీబిజీగా ఏవో వస్తువు లమ్మే పనిలో ఉన్నాడు. జనాలు కూడా అవేవో ఎగబడి కొనే పనిలో ఉన్నారు. వెంకటేశానికయితే ఈ వ్యాపారం ఏంటో అర్థం కాలేదు. పక్కనున్న బుల్లబ్బాయిని ”ఏంటీ.. సూరిబాబు తెగ అమ్మేస్తున్నాడు?” అన్నాడు.  బుల్లబ్బాయి తలూపి ”అవును. మన సూరిబాబు వస్తువులన్నీ సగం రేటుకే అమ్మేస్తున్నాడు. అందుకే అంతా ఎగబడి మరీ కొంటున్నారు” అన్నాడు. వెంకటేశం తలూపి ”వస్తువలంటే టీవీలూ, ఫ్రిజ్‌లూ లాంటివా?” అన్నాడు. బుల్ల బ్బాయి తల అడ్డంగా ఊపి ”అబ్బే.. అవేవీకాదు. బియ్యం, పంచ దారా, దుప్పట్లూ, లాంతర్లూ లాంటివి” అన్నాడు. ఉన్న ట్టుండి సూరిబాబు చేస్తున్న ఈ 50 శాతం డిస్కౌంటు వ్యవ హారమేంటో వెంకటేశానికి అర్థం కాలేదు. యింతలో సూరిబాబు మళ్ళీ గట్టిగా అరుస్తున్నాడు. ”చూడండీ.. ఈ రగ్గు బయటకొంటే అయి దొందలు. రాజస్థాన్‌ నుంచి డైరెక్ట్‌గా తెప్పించడం వలన రెండొం దల యాభైకే వచ్చింది. ఏదో మనూరికి సేవ చేద్దామని లాభం కూడా వేసుకోకుండా మీకు యిస్తున్నా. మీకు వద్దంటే చెప్పండి. ఆ సర్వీసేదో పక్కూరివాళ్ళకి చేసుకుంటా” అన్నాడు. దాంతో జనాలు కంగారుపడిపోయారు. ”అవసరం లేదు. నీ సేవలు ఎవరికీ చేయక్కర్లేదు. అవన్నీ మేమే కొంటాం” అంటూ అరిచారు. అక్కడితో వెంకటేశం వెనుదిరిగాడు.
——–
రాత్రి పది కావస్తోంది. వెంకటేశం నిద్రపోకుండా  అటూ యిటూ  పచార్లు చేస్తున్నాడు.  దానిక్కారణం సూరిబాబు తాలూకా ఆలోచ నలే. మామూలుగా అయితే సదరు సూరిబాబు పిల్లికి కూడా బిచ్చం పెట్టని బాపతు. అలాంటిది బొత్తిగా లాభం లేకుండా ఎక్క డ్నుంచో వస్తువులు తెచ్చి సగం రేటుకి మరీ జనాలకి అమ్ము తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అందులోనూ ఆ అమ్మే వస్తువుల్ని చూస్తుంటే ఎక్కడో ఏదో స్ఫురిస్తోంది. అయితే అదేంటన్నది స్పష్టంగా తెలీడం లేదు. మొత్తానికి ఏదో తేడా కొడుతోంది. దాంతో యింకాగలేక వెంకటేశం లేచి సూరిబాబు యింటికి బయలు దేరాడు. వెంకటేశం వెళ్ళేసరికి సూరిబాబు యింట్లో  యింకా లైట్లు వెలుగుతున్నాయి. ఆ పాటికి జనాలంతా సామాన్లు కొనేసుకుని వెళ్ళిపోయారు.  వెంకటేశం నెమ్మదిగా హాల్లోకి నడిచాడు. ఆపాటికి సూరిబాబు డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. వెంకటేశాన్ని చూడ గానే సూరిబాబు ”రా..వెంకటేశం.. సామాన్లు ఏవయినా కావాలా?” అన్నాడు. వెంకటేశం తలూపి ”బియ్యం ఎంత?” అన్నాడు. దాంతో సూరిబాబు హుషారుగా ”బయటకొంటే కేజీ యాభై. యిక్కడ యితే పాతికే” అన్నాడు. వెంకటేశం తలూపి, అక్కడున్న బస్తా లోంచి గుప్పెడు బియ్యం తీసుకుని ”యిదేంటీ… యిదేదో ముష్టోళ్ళ బియ్యంలా ఉందే” అన్నాడు.  దాంతో సూరిబాబు ఉడుక్కుంటున్నట్టుగా ”అదేం మాట వెంకటేశం..” అన్నాడు. దాంతో వెంకటేశం ”మరి ఈ బియ్యమేదో నాలు గయిదు రంగులు ఉన్నట్టుంది” అన్నాడు. దానికి సూరిబాబు ”పోనీ బియ్యం వదిలిపెట్టు. పంచదార తీసుకో. లేకపోతే కొరియా నుంచి తెప్పించిన లాంతర్లు తీసుకో” అన్నాడు. ఈలోగా వెంకటేశం వెళ్ళి చనువుగా సూరి బాబు భుజంమీద చెయ్యేసి లోపల సామా న్లున్న గదికి తీసుకెళ్ళాడు. అలా తీసుకెడు తూనే ”యింతకీ ఈ స్టాకంతటికీ బిల్లులు న్నాయా?” అన్నాడు. దాంతో సూరిబాబు యిబ్బందిపడి ”బిల్లులా.. బిల్లులు కావా లంటే ఈ రేటుకి రావు కదా” అన్నాడు. అప్పుడు జరిగిందది.  వెంకటేశం బయట కొచ్చేసి ఆ గది తలుపులు వేసేశాడు. సూరిబాబు లోపలుండి పోయాడు. యింతలోనే వెంకటేశం ఫోన్‌ చేసి ఎవరికో ఫోన్‌ చేశాడు. ”ఆ.. నేనే.. ఎస్సై గారూ.. యిక్కడ గుడివీధిలో చివరికి  వచ్చేయండి. యిక్కడే ఉన్నాడు” అంటూ ఫోన్‌ పెట్టేశాడు. అది వినగానే సూరి బాబు మొహంలో భయం ప్రవేశించింది. యింకో రెండు నిమిషా లాగి వెంకటేశం మళ్ళీ యింకో ఫోన్‌ చేశాడు. ”ఆ.. వచ్చేటప్పుడు సామాన్లవీ సీజ్‌ చేసి పట్టుకుపోవడానికి మినీ వ్యానొకటి తీసుకుండి. ఆ..అరెస్టు చెయ్యడానికి ఓ నలుగురు కానిస్టేబుల్స్‌ చాలు” అన్నాడు. దాంతో సూరిబాబుకి టెన్షన్‌తో చెమటలు పట్టడం మొదలెట్టాయి. ఠక్కుమని దార్లోకి వచ్చేశాడు. కిటికీలోంచే ఒకటే యిదిగా బతిమాలెయ్యడం మొదలెట్టాడు. ”తప్పయిపోయింది వెంకటేశమన్నా… ఏదో బుద్ధి గడ్డి తిని యిదంతా చేశా. యింకె ప్పుడూ యిలా చేయను. కావలిస్తే యిందులో నీకూ వాటా యిస్తాను. ముందా పోలీసుల్ని ఆపు” అన్నాడు. వెంకటేశం తలూపి ”యిదేదో తేడా వ్యవహారమని నాకు అనుమానం వచ్చింది. యింతకీ  ఈ సామాన్లన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయో అది చెప్పు” అన్నాడు. సూరిబాబు తలూపి ”మరి పోలీసులు..” అన్నాడు. దానికి వెంకటేశం నవ్వేసి ”అదంతా ఉత్తుత్తి ఫోనేలే. యిప్పుడు భయపడకుండా చెప్పు. లేకపోతే నిజంగానే ఫోన్‌ చేయవలసి వస్తుంది” అన్నాడు. దాంతో సూరిబాబు ఆ సరుకుల కధేంటో చెప్పడం మొదలెట్టాడు..
———
”గురూగారూ.. అదీ నాకొచ్చిన కల. యింతకీ ఆ సూరిబాబు ఆ సామాన్లవీ ఎక్కడ్నుంచి తెచ్చినట్టు? సగం రేటుకే ఎలా అమ్మినట్టు?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం తేలిగ్గా ”యింకా అర్థం కాలేదా?” .. ప్రస్తుతం నడుస్తున్నదంతా  తుపాన్లూ, వరదల సీజన్‌ కదా. ఈ సామానంతా ఎక్కడో విరాళాల రూపంలో సేకరించివనుకో. అవేవో సొమ్ము చేసుకోడానికి సూరిబాబు అలా చేసుంటాడు” అన్నాడు. దాంతో వెంకటేశం అదిరిపోయి ”అయితే యివన్నీ ఆ వరద బాధితుల కోసం విరాళాల రూపంలో వసూలు చేసిన బాపతంటారా?” అన్నాడు. గిరీశం తలూపి ”మరి లేకపోతే యింకేంటోయ్‌..” అన్నాడు చుట్ట వెలిగించుకుంటూ. ఆపాటికి షాక్‌ నుంచి తేరుకున్న వెంకటేశం ”ఈ లెక్కన ఈ వరద బాధితులకి విరాళాల్లాంటివి సక్రమంగా బాధితులకి వెళ్ళడం లేదంటారా?” అన్నాడు. దాంతో గిరీశం ”అలా అనడం తప్పవుతుంది. యిలాంటి విపత్తులప్పుడు నిజాయతీగా సేవచేసే సంస్థలెన్నో ఉన్నాయి. వాటి గురించి కాదు నేను మాట్లాడేది. ఆ విపత్తుల్ని అడ్డంపెట్టుకుని విరాళాలో, యింకా వస్తువులో వసూలు చేసి మింగేసే ఈ సూరిబాబులాంటి వాళ్ళ కోసం. యింకా విరాళాలు తమ ద్వారా వెళ్ళాలని బడాయి లకి పోయే వారి కోసం ”అబ్బే..మేం ఆల్రెడీ రామకృష్ణ మిషన్‌ ద్వారానో, సేవా భారతి ద్వారానో, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారానో విరాళాలు పంపించాం’ అన్నా వీళ్ళు వినరు గాక వినరు. ‘ఆ విరాళాలేవో మా ద్వారానే వెళ్ళాలి’ అని పట్టుబట్టేస్తారు. ఏతావాతా చెప్పేదేంటంటే.. యిటువంటి ప్రకృతి విపత్తులు బాధాకరమయి నవే. అలాంటప్పుడు ఆదుకోవలసిన మానవీయ దృష్టి అందరిలో ఉండాలి. అయితే విరాళాలు బాధితులకి చేరే క్రమంలో జరిగే మోసాలు ఎంతమాత్రం  క్షమార్హం కాదు. యిలాంటివి ఎక్కడ యినా, ఎప్పుడయినా  బయటపడ్డప్పుడు విరాళాలు యివ్వాలను కునే వారిలో అటువంటి ఆసక్తి పోవచ్చు. అదెంత మాత్రం ఆరోగ్య కర పరిణామం కాదు” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here