కాటన్‌ బ్యారేజ్‌పై 15న పవన్‌కళ్యాణ్‌ కవాతుకు సర్వం సిద్ధం

0
138
విజయవంతం చేయాలని కందుల దుర్గేష్‌ పిలుపు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 13 : రాజకీయ జవాబుదారితనం కోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేపడుతున్న కవాతుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని శాఖల నుంచి అనుమతులు లభించాయని, రెండు లక్షల మందికిపైగా ఈ కవాతులో పాల్గొనబోతున్నారని మాజీ ఎమ్మెల్సీ, జనసేన నాయకులు కందుల దుర్గేష్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలకు పిచ్చుకల్లంక నుంచి ధవళేశ్వరంలోని కాటన్‌ విగ్రహం వరకు కవాతు జరుగుతుందన్నారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర గంటకు పైగా సాగే ఈ కవాతులో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది తరలి వస్తున్నారని తెలిపారు. ధవళేశ్వరం కాటన్‌ విగ్రహం వద్ద పవన్‌ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడతారని తెలిపారు. కాటన్‌ బ్యారేజీ వెడల్పు తక్కువగా ఉండటంతో కవాతులో పాల్గొనే ప్రజలు బ్యారేజ్‌ పుట్‌పాత్‌ ఎక్కరాదని సూచించారు. ముందు జాగ్రత్తగా గోదావరిలో ధవళేశ్వరం ఫిషర్‌మెన్‌ సొసైటీకి చెందిన వంద మంది గజ ఈతగాళ్ళును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే అభిమానులు, ప్రజలు తిరిగి అదే ఉత్సాహంతో వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలని పవన్‌ సూచనలను శిరోధార్యంగా భావిస్తున్నామన్నారు. పార్కింగ్‌, మంచినీటి సదుపాయం, భోజన వసతి ఏర్పాట్లను కూడా సమకూరుస్తున్నామని, పశ్చిమ గోదావరి నుంచి వచ్చే వాహనాల కోసం విజ్జేశ్వరంలో, తూర్పు నుంచే వాహనాల పార్కింగ్‌కు వేమగిరి, ధవళేశ్వరంలలో స్ధలాలను కేటాయించామన్నారు. ముందస్తుగానే 15 అంబులెన్స్‌లను, వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతున్నామని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జనసేన అజాద్‌ యూత్‌ వింగ్‌కు చెందిన 1200 మంది వాలంటీర్లు ఇప్పటికే పంచకర్ల సందీప్‌ నేతృత్వంలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఈ కవాతులో వివిధ చేతి వృత్తుల వారు తమ పరికరాలతో పాల్గొంటారని, వెయ్యి మంది కల్లు గీత కార్మికులు, వేయ్యి మంది మత్స్యకారులు, వేయ్యి మంది దళితులు, వేయ్యిమంది మైనార్టీలు పాల్గొని తమ వృత్తి ఆవశ్యకతను ప్రతిబింబించేలా  ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. మహిళలు ప్రత్యేకంగా సభ జరిగే ప్రాంతంలో జనసేన జెండా రంగుల్లో వస్త్రాలు ధరించి పవన్‌ కళ్యాణ్‌ను ఘనంగా స్వాగతిస్తారని తెలిపారు. సమిష్టి కృషితో కవాతును విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.జనసేన జిల్లా కో ఆర్డినేటర్‌ మేడా గురుదత్త ప్రసాద్‌ మాట్లాడుతూ పవన్‌ కవాతు చరిత్రలో నిలిచేలా జరుగుతుందని, అభిమానులు క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా కవాతు గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శెట్టిబత్తుల రాజబాబు, ప్రసంగి ఆదినారాయణ, అత్తి సత్యనారాయణ, వై.శ్రీనివాస్‌, చోడిశెట్టి శేఖర్‌, చిక్కాల సుబ్బారావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here