కాపర్‌ డ్యామ్‌ వల్లే గిరిజన మండలాలకు ముంపు

0
145
ఈ పాపం బాబుదే – గత ప్రభుత్వంపై కేసు పెట్టాలి
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేసు, రావుల
రాజమహేంద్రవరం, ఆగస్టు 6 : కాపర్‌ డ్యామ్‌  కారణంగానే పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గిరిజన మండలాలు ముంపునకు గురయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఓబులేసు, రావుల వెంకయ్యలు ఆరోపించారు. స్ధానిక సిపిఐ  కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఓబులేసు మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాన్ని సిపిఐ బృందం సోమవారం పరిశీలించడం జరిగిందన్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద 2,3 ప్రమాద హెచ్చరిక స్ధాయికి నీటి మట్టం చేరుకుంటే తప్పితే దేవిపట్నం మండలంలోని గిరిజన గ్రామాలు మునగవని, అటువంటిది మొదటి హెచ్చరిక స్ధాయికే ఈ మండలంలోని 87కు పైగా గ్రామాలు నీట మునిగాయన్నారు. 50 గ్రామాలు నీటిలో మునిగి కన్పించకుండా పోయాయని, మరో 37 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. కాపర్‌ డ్యామ్‌ అవసరం లేకుండా గత చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిందన్నారు. ముందుగా ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేసి, ముంపు గ్రామాల  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత కాపర్‌ డ్యామ్‌ నిర్మించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, కేంద్రమే ప్రాజెక్టును నిర్మించాల్సి ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తన భుజాలపైకి ఎత్తుకుందన్నారు. 70శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామన్న చంద్రబాబు నాయుడు పునరావాస కార్యక్రమం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాలోని గిరిజనులు, బడుగు వర్గాల వారికి ఆర్‌ ఆర్‌ ప్యాకేజీ అందించి ఉంటే సురక్షత ప్రాంతాలకు వెళ్ళిపోయేవారని, ఇప్పుడు జలదిగ్భందలో చిక్కుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ పాపం గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని, గత ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. వరదలు ముంచెత్తి 5 రోజులు కావస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిత్యావసర వస్తువుల పంపిణీకి పూనుకుందని, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వానికి వైసిపి. టిడిపి పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్నారు. 370 రద్దుతో పాటు, విద్యాహక్కు చట్టం సవరణ, సమాచార హక్కు చట్టం సవరణ వంటి ఆకృత్యాలకు  మద్దతు పలికాయని దుయ్య పట్టారు. జగన్‌ ప్రభుత్వం మంచికో చెడుకో పోలవరం నిర్మాణాన్ని నిలుపుదల చేసిందని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరారు. రావుల వెంకయ్య మాట్లాడుతూ దేవీపట్నం, చింతూరు, విఆర్‌ పురం, పోలవరం మండలాలు జలదిగ్భందంలో చిక్కుకుని, ఒక దీవిగా కన్పిస్తుందన్నారు. జల రవాణా తప్పితే ఇతర రవాణా వ్యవస్దలేదన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను బైటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కల్పించడంలో తాత్సారం చేశారని ఆరోపించారు. ముంపు గ్రామాలలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించి  ఎందుకు భరోసా ఇవ్వరని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన బాధ్యత చంద్రబాబుదేనన్నారు. నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతి కుటుంబానికి తక్షణం ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణా ప్రభుత్వం లాగా  పోలవరం నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళను నిర్మించాలని, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని. భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం కల్పించాలన్నారు. పోలవరం కారణంగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంద్ర  ప్రజలకు ప్రయోజనం తప్ప, నిర్వాసితులకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.  నిర్వాసిత ప్రాంతాలలో పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి నివేదిక సమర్పిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి నల్లా రామరావు, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్‌, వంగమూడి కొండలరావులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here