కాపులకు షూరిటీ లేని రుణాలు 

0
479
కార్పొరేషన్‌ ద్వారా రూ.కోటి రుణాలు పంపిణీ
రాజమహేంద్రవరం, జనవరి 4 : కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపు సామాజికవర్గంలోని పేదలకు ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు మంజూరయ్యేలా కృషిచేస్తామని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక ఆనం రోటరీ హాలులో ఈరోజు కాపు కార్పొరేషన్‌ ద్వారా 50 మంది లబ్ధిదారులకు రూ.కోటి విలువైన రుణాలను పంపిణీ చేశారు. కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ కాపు సామాజికవర్గంలోని పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు అందిస్తున్నారని, వాటిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. బ్యాంకర్లు షూరిటీల పేరుతో కాలయాపన చేస్తుండటం వల్ల పథకాలు సక్రమంగా ప్రజలకు అందడంలేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి షూరిటీ లేకుండా రుణాలు అందించేందుకు కృషిచేస్తామన్నారు. జన్మభూమి పథకం ద్వారా కొత్తగా 3 లక్షల 50వేల పింఛన్లు, 5 లక్షలు కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేశామన్నారు. రుణాలు తీసుకున్నవారు వాటిని సద్వినియోగపరుచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలలోని పేదలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రుణాలు అందిస్తున్నారని, కార్పొరేషన్‌కు ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించేందుకు సరైన టీమ్‌ అవసరమని, అలాంటి టీమ్‌లో యర్రా వేణుగోపాలరాయుడు లాంటి నిబద్ధత కలిగిన నాయకుడు ఉండటం అభినందనీయమన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ నిరాటంకంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు, సంక్షేమం పథకాల కొనసాగింపులో ఆయన తనయుడు నారా లోకేష్‌ చేస్తున్న కృషి మరువలేమన్నారు. మేయర్‌ రజనీ శేషసాయి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని, వీటిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. తెదేపా నేత గన్ని కృష్ణ పాదయాత్రలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబునాయుడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణాలు అందిస్తున్నారన్నారు. పదవులు రావడం ఒకటైతే, వచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకునేవారు కొందరే ఉంటారని, వారిలో  యర్రా వేణుగోపాలరాయుడు ఒకరన్నారు. తెదేపా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఎపి కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ తమ కార్పొరేషన్‌ ద్వారా మహిళలు, యువత, విద్యార్ధులకు రుణాలు మంజూరు చేసి, ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. 400 మంది కాపు విద్యార్ధులను విదేశీ విద్యకు ఎంపిక చేశామన్నారు. 300 గ్రూపులకు 1000 పారిశ్రామిక యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 200 మంది యువత స్వయం సమృద్ధికి రుణాల మంజూరు చేశామన్నారు. రుణాల మంజూరును మరింత సరళీకృతం చేసేందుకు  చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాపు సామాజికాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యలో రాణిస్తున్న చక్రధర్‌ అనే ఇంజనీరింగ్‌ విద్యార్ధికి రూరల్‌ ఎమ్మెల్యేల గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యక్తిగతంగా రూ.10వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే కాపు కార్పొరేషన్‌ లబ్ధిదారులు కంప్యూటర్‌ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, చీప్‌ విప్‌ పాలిక  శ్రీను, కో-ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ, టిడిపి నాయకులు మజ్జి రాంబాబు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఉప్పులూరి జానకిరామయ్య, మాజీ కార్పొరేటర్లు రెడ్డి మణి, కురగంటి సతీష్‌, పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, నగర ప్రముఖులు మారిశెట్టి రామారావు, అర్లపల్లి బోస్‌, పార్టీ నాయకులు గరగ మురళీకృష్ణ, రావాడ మనోహర్‌, గుణపర్తి శివ, పచ్చిమళ్ళ రవిప్రసాద్‌, కాపు యువసేన నాయకులు పడాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.