కాయ్‌…. రాజగోపాల్‌..కాయ్‌

0
172
మనస్సాక్షి
 గంగలకుర్రు….చాలా చిన్న ఊరు. జనాభా తక్కువే. ఊళ్ళోకి ఏ కొత్త వారొచ్చినా, ఏ సంఘటన జరిగినా వెంటనే అందరికీ తెలిసిపోవలసిందే. అలాంటి ఊళ్ళోకి  ఆ రోజు ఉదయం యిద్దరు దిగారు. ఆ యిద్దరూ ఎవరనేది ఊళ్ళో ఎవరికీ తెలీలేదు. అయితే వాళ్ళ వాలకాలే కొంత విచిత్రంగా ఉన్నాయి. నల్ల కళ్ళద్దాలు, నెత్తిమీద పొడవాటి టోపీ, యింకా చేతిలో ఫైలూ, యివే కాకుండా జేబులో పెద్ద భూతద్దం ఒకటి. అయితే వాళ్ళిద్దరూ ఎవరితో  ఏం మాట్లాడలేదు. గుడి అరుగు మీద కూర్చుని ఏదో సీరియస్‌గా చర్చించుకున్నారు. తర్వాత ఎవరి మటుకు వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళిపోయారు. అయితే  వాళ్ళు ఊళ్ళో ఎవరింటికి వెళ్ళేదీ మిగతావాళ్ళకీ ఏం తెలీలేదు. అలా సాయంత్రం  దాకా వాళ్ళు ఊరంతా తిరిగి  వెళ్ళిపోయారు. యింతకీ వాళ్ళెవరు? ఎందుకొచ్చారు అన్న చర్చ ఊళ్ళో మొదలయింది.
——–
 ముసలయ్య భక్తిగా దేవుడిని ప్రార్థించాడు. ” స్వామీ.. నిన్నే నమ్ముకునా. ఇద్దరి ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి. యింకా కుర్రోడిని చదివించాలి. ఉన్న ఆస్తంతా అమ్మినా ఒక్క పిల్లకి కూడా పెళ్ళి చేయలేను. నువ్వే కాపాడాలి” అని ప్రార్థించాడు. యిదంతా ఎప్పట్నుంచో  జరుగుతుందే. అయితే ఆ రోజు దేవుడు కలలో కనపడి  ‘ భక్తా.. త్వరలోనే నిన్ను నీ కష్టాలకి దూరం చేస్తా. దాని కోసం ఓ మనిషిని పంపుతున్నా’ అని శెలవిచ్చాడు. దాంతో ముసలయ్య ఆనందపడిపోయి ఆ రాబోయే మనిషి కోసం  ఎదురు చూట్టం మొదలెట్టాడు.
——–
గంగలకుర్రులో వెంకటేశం యింటి ముందరో బోర్డు వెలిసింది. ‘ పొలిటికల్‌ అనలిస్ట్‌…. రాజకీయ విశ్లేషకులు ‘ అని ఉన్న బోర్డది. దాంతో అటుగా పోతున్న కొందరు దాని వంక ఆసక్తిగా చూశారు. అక్కడికీ కొందరయితే యింటికొచ్చి వెంకటేశం తల్లిని అదేంటని అడగనే అడిగేశారు. ” ఏవమ్మా  లలితమ్మా… మీ వాడు  అదేదో కలక్టరయిపోతాడన్నావు. మరిందేంటీ?” అని సాగదీశారు కూడా. దాంతో లలితమ్మ ‘ ఆ యిదేదో అంతకంటే పెద్ద పనే అంటలే. అయినా ఆ వివరాలన్నీ వాడొచ్చాక చెపుతాడే… అని తోలేసింది. మధ్యాహ్నం వెంకటేశం యింటికి రాగానే లలితమ్మ కయ్యిమంది. ” ఒరేయ్‌… యింటి ముందర ఆ బోర్డేదో  పెట్టి పోయావు.  దాని గురించి జనాలంతా తినేస్తున్నారు. నువ్వు యింటి పట్టునే ఉండి అందరికీ అదేంటో చెప్పు” అంది. దాంతో వెంకటేశం యింటరుగు మీదే కూర్చున్నాడు. ఈలోగా యింకొందరు వచ్చి అదేంటని అడిగారు. దాంతో వెంకటేశం ” మొన్న ఎలక్షన్లు అయిపోయాయి కదా. ఆ ఎలక్షన్లో కుల సమీకరణాలు, యింకా కేండిడేట్స్‌, గత చరిత్రను బట్టి ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తారో, అలాగే ఎవరిమీద బెట్‌లు కట్టొచ్చో విశ్లేషించి చెబుతా అన్నాడు. దాంతో అందరిలో ఆసక్తి ప్రవేశించింది. ఎలక్షన్లయిపోయినా యింకా కౌంటింగ్‌ జరగలేదాయె. ఎక్కడెవరు గెలుస్తారో తెలీని పరిస్థితి. దాంతో వారిలో సుబ్బారావు ‘ఎవరెక్కడ గెలుస్తారో కరెక్ట్‌గా చెప్పగలవా?” అన్నాడు. వెంకటేశం తలూపి ” చాలా ఖచ్చితంగా చెబుతా. అయినా అదేదో నేను ఆషామాషీగా చెప్పడం లేదు. యిప్పటికే ఊరికిద్దరిని చొప్పున సర్వేకి పంపించా. అదోక్కటే కాదు. యిలాంటివే యింకా చాలా అంశాలు తీసుకుని లెక్క కట్టి చెబుతా” అన్నాడు. దానికి వెంకటేశం ”’ నాకు ఫీజోద్దు. మీరు బెట్‌ వేసిందాంట్లో గెలిచాక 10 శాతంయివ్వండి చాలు. ఓడిపోవడం ప్రసక్తే లేదు. అదే జరిగితే నాకేం యివ్వక్కర్లేదు” అన్నాడు. అంతా తలూపారు.
——-
మర్నాడు ఉదయమే సుబ్బారావొచ్చి వెంకటేశంతో కలిశాడు. అయితే ఈ సారి సుబ్బారావు ఒంటరిగా వచ్చాడు. ” నేనో లక్ష దాకా బెట్‌ వేద్దామనొచ్చా. ఎవరు గెలుస్తాడో చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం తన దగ్గరున్న పుస్తకం తిరగేసి, ఏవో లెక్కలు కట్టాడు. తర్వాత సుబ్బారావు వైపు తిరిగి, ఎవరు గెలిచేదీ చెప్పాడు. సుబ్బారావు ఓ పదివేలుకి పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌ సమర్పించుకుని వెళ్ళిపోయాడు. యింకో అరగంట తర్వాత ముసలయ్య వచ్చాడు. మొహం అయితే కళకళలాడిపోతోంది. ” యిదిగో వెంకన్న బాబూ. రాజోలులో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పాలి. నువ్వేం చెబితే ఆ పార్టీ మీదే మొత్తం కాసేస్తా” అన్నాడు. దాంతో వెంకటేశం ఎప్పటిలాగే కాకుల్లెక్కలేసి ఎవరు గెలిచేదీ చెప్పేశాడు. ఆ రోజే ముసలయ్య తన యావదాస్తిని తెగనమ్మి వెంకటేశం చెప్పిన  పార్టీ కేండిడేట్‌ మీద బెట్‌ కట్టేశాడు. సుబ్బారావు, ముసలయ్య అనే కాదు యిలా యింకా ఎందరో వెంకటేవం మాట మీద బెట్‌ కట్టేశారు. అయితే ఎవరు ఏ పార్టీ మీద కట్టిందీ మిగతా వాళ్ళకి తెలీలేదు…!
——-
కౌంటింగయిపోయింది.  సాయంత్రానికల్లా విజేతలెవరో తెలిసిపోయింది. యిక అక్కడ్నుంచి వెంకటేశానికి ఫోన్లు రావడం మొదలయింది. అయితే వెంకటేశం అన్ని ఫోన్లు ఎత్తడం లేదు. కొన్ని ఫోన్లు ఎత్తుతున్నాడు.  కొన్ని ఎత్తుడం లేదు. అయితే ఫోనెత్తి మాట్లాడిన ప్రతి ఫోన్‌ లోనూ ” వెంకటేశం బాబూ… నువ్వ నిజంగా దేవుడివి. ఏం చెప్పావని. నువ్వు చెప్పినట్టే ” జరిగింది” అంటున్నారాయె….! ” గురూ గారూ… రాత్రి అలాంటి కలొచ్చింది. ఈ లెక్కన నేను గొప్ప ఎనలిస్ట్‌నయిపోతాననిపిస్తోంది. ఏవంటారు?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం విసుక్కుని ” ముందుగా నీకో ప్రకటన గురించి చెప్పాలోయ్‌. అదో గులాబ్‌జామ్‌ యాడ్‌ అనుకో. నాలుగేళ్ళ కుర్రోడి కోసం వాళ్ళమ్మ గులాబ్‌జామ్‌లు వండుతుంటుంది. యింతలోనే ఆ కుర్రోడి నాన్నొచ్చి విశేషం ఏమిటనిన అడుగుతాడు. దాంతో ఆ కుర్రోడు ‘స్కూల్లో రన్నింగ్‌ రేస్‌లో సెకండ్‌ ప్రైజు వచ్చింది’ అని ముద్దు ముద్దుగా అంటాడు. దాంతో తండ్రి మెచ్చుకుని ‘ వెరీ గుడ్‌… యింతకీ ఎంతమంది పార్టిసిసేట్‌ చేశారు! ‘ అడిగేసరికి ఆ కుర్రోడు ”యిద్దరం’ అంటూ చెప్పి తుర్రుమంటాడు” అన్నాడు. దాంతో వెంకటేశం అర్ధం కానట్టు చూశాడు. అప్పుడు గిరీశం ” అవునోయ్‌ ప్రధానంగా పోటీ ఉంది రెండు పార్టీల మధ్యే కదా. నువ్వేదో గొప్ప సర్వే చేసినట్లు నాటకాలాడి సగం మందికి ఓ పార్టీ అభ్యర్ధులు గెలవడం గురించీ, యింకో సగం మందికి యింకో పార్టీ అభ్యర్ధులు గెలవడం గురించి చెప్పావు. ఆనక నువ్వు చెప్పినట్లు జరిగినోళ్ళ ఫోన్లెత్తావు. వాళ్ళ దగ్గర 10 శాతం లాగావు. యిక ముసలయ్య లాంటోళ్ళు మట్టిగొట్టుకుపోయారు” అన్నాడు. వెంకటేశం యిబ్బంది పడి ” యింతకీ ఈ కలెందుకు వచ్చినట్టుంటారు” అన్నాడు. అప్పుడు గిరీశం ” యిదంతా పనికిమాలిన సర్వేల గురించిలే. యిన్ని సంస్ధలు సర్వేలు చేసేయిగా, నీకు తెలిసిన ఎవర్నయినా వచ్చి ఏ పార్టీకి ఓటేసింది ఎవరయినా అడిగిరా..లేదే.. అయినా కోట్లు, లక్షలమంది  అభిప్రాయాల్ని కేవలం వందమందితో మాట్లాడి తేల్చడం ఎంతవరకు శాస్త్రీయత? యివన్నీ పక్కనబెడితే..లగడపాటి లాంటి బాధ్యతయుతమైన వ్యక్తులు యిలాంటి తప్పుడు సర్వేలు ప్రకటించడం ఎంతవరకు సబబు? దాని వల్ల ఎందరో బెట్‌లు వేసి సర్వం కోల్పొయారు. అంతా ఆలోచించాలి ” అన్నాడు.
 డా. కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here