కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం 

0
193
శ్యామల సెంటర్‌లో వామపక్షాల  రాస్తారోకో
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 16 : కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పోరేట్ల సేవలో ఉందని, దేశంలో ”జైహింద్‌” నినాదాన్ని కాస్తా ”జియోహింద్‌” నినాదంగా మోడీ మార్చేసారని వామపక్ష నాయకులు విమర్శించారు. కేంద్ర భ్రుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల దేశవ్యాపిత పిలుపులో భాగంగా ఈరోజు స్థానిక  శ్యామల సెంటర్‌లో  రాస్తారోకో  నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిపిఐ నగర కార్యదర్శి నల్లారామారావు, ఐఎఫ్‌టియు కార్యదర్శి ఎం.వి. రమణ, మాట్లాడుతూ 2వ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ దేశ సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెట్టారని విమర్శించారు. దేశ ప్రజలు జైహింద్‌ అనే నినాదాన్ని ”జియో హింద్‌”గా మార్చేశారని ఎద్దేవాచేశారు. కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి, కార్మికులకు అన్యాయం చేసారన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతుంటే, నిరుద్యోగం రేటు 10% కి పెరిగిపోతుంటే, ఆర్థిక సంక్షోభం దేశాన్ని చుట్టుముడుతుంటే మోడీ మాత్రం తీరిగ్గా చెన్నై బీచ్‌లో ప్లాస్టిక్‌ ఏరుతున్నట్లు కెమెరాలకి ఫోజులిస్తున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధరలేక రైతులు, పనులు లేక చేతివృత్తిదారులు, కూలీలు పస్తులుంటుంటే దేశంలో సంపదను మాత్రం 10 శాతం కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్నారు. గాంధీని చంపిన గాడ్సేని పూజిస్తూ గాడ్సే వారసులుగా చెప్పుకుంటూ, మరోపక్క గాందీ సంకల్పయాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్లే దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పనంగా, కారు చౌకగా అమ్మేస్తుందని ప్రజలు మోడీ నయా విధానాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. దేశాన్ని మోడీ, బిజెపి నుండి కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.ఎస్‌.మూర్తి,  జిల్లా కమిటీ సభ్యులు పి.తులసి, బి.పవన్‌, బి.రాజులోవ, పోలిన వెంకటేశ్వరరావు, నగర నాయకులు టి.సావిత్రి, పూర్ణిమరాజు, ప్యారి లింగం, ఐ.ఎస్‌., జరీనా, కృష్ణ, సోమేశ్వరరావు, రాజా, జి.భాస్కర్‌, తాతారావు, సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి, తోకలప్రసాదు, కొండలరావు నాయకులు రవి, లక్ష్మి, యడ్ల రమణమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here