కుట్రలో భాగంగానే దళిత రైతులకు అన్యాయం

0
118
7వ తేదిన తాడికొండలో పర్యటిస్తా :హర్షకుమార్‌
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4 : దళిత రైతులకు అన్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేసిన కుట్రలో భాగమే మూడు రాజధానుల ప్రతిపాదనలు అని అమరావతి రాజధాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గ దళిత రైతులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధకాండతో 48 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉండి ఇటీవల కాలంలో బెయిల్‌పై బయటకు వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను రాజధాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గానికి చెందిన దళిత రైతులు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన దళిత రైతుల పక్షాన అయినవల్లి ఇస్మాయేలు అమరావతి రాజధానిలో దళిత రైతుల భూములు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తదితర వివరాలను హర్షకుమార్‌కు వివరించారు. ఒక్క తాడికొండ నియోజకవర్గ పరిధిలో దళితులకు సంబంధించిన సుమారు 12 వేల ఎకరాలను రాజధానికి ఇచ్చినట్లు తెలిపారు. అసైన్డ్‌ ల్యాండ్‌ తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని, అయితే రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అడిగిన వెంటనే తమ భూములను ఇచ్చామని వివరించారు. అయితే ఇతర భూములకు ఒకలా, తమ అసైన్డ్‌ భూములకు ఒకలా గత ప్రభుత్వం వ్యాపార సముదాయాల కోసం కేటాయింపులు చేసిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తమ భూములకు ఇతర భూములతో సమానంగా కేటాయింపులు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసలుకే ఎసరు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో అత్యధికంగా దళిత సామాజికవర్గానికి చెందిన అధికంగా ఉన్నామని, రాజధాని రాక ద్వారా తమ బతుకులు బాగుపడతాయని భావించిన నేపథ్యంలో మొత్తానికి రాజధాని రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అడ్డుకుని తమ బతుకులను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని హర్షకుమార్‌కు వివరించారు. తమ ప్రాంతంలో పర్యటించి తమకు అండగా నిలవాలని దళిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి రాజధానికి ఇచ్చిన భూముల్లో 70 శాతం తాడికొండ నియోజకవర్గంలోనే ఉన్నాయన్నారు. 40 శాతం దళిత ప్రజలు ఉండటం ద్వారానే ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయ్యిందన్నారు. గత ప్రభుత్వం చేసిన విధానం వల్ల దళితుల విషయంలో కొన్ని లోపాలు జరిగినా, ఆ ప్రాంతంలో దళితులంతా రాజధానిని అక్కడే నిర్మించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే దోషులను శిక్షించాల్సిన ముఖ్యమంత్రి నేడు ఆ ప్రాంతంలో దళిత రైతులకు అన్యాయం చేసేలా రాజధానిని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దళితులు అధికంగా ఉండటం వల్లే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆ ప్రాంతంలో రాజధాని రాకుండా కుట్రలు చేస్తున్నారనే అనుమానం కల్గుతోందన్నారు. దళితుల్లో 99 శాతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓట్లు వేశారని, తమకు మేలు చేస్తారని ఆశించిన ఆ దళిత ప్రజలకు ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను నిలుపుదల చేశారని, దళిత విద్యార్థులకు రావాల్సిన ఫీజురియంబర్స్‌మెంట్‌ను నిలుపుదల చేశారని, సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహాలకు ఇవ్వాల్సిన మెస్‌ఛార్జీలను సైతం నిలిపివేశారని ఆయన పేర్కొన్నారు. దళితుల పక్షాన న్యాయమైన పోరాటాన్ని సాగిస్తున్న తనను 48 రోజులపాటు సెంట్రల్‌ జైల్లో పెట్టించారని అన్నారు. దళితుల జీవితాలను నాశనం చేసే ఈ చర్యలను మానుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు. దళిత రైతుల విజ్ఞప్తి మేరకు ఈ నెల ఏడో తేదీన తాడికొండ నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్తానని హర్షకుమార్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా జై అమరావతి…సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు నినాదాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here