కుల,మతాల పేరిట విద్వేషాలపై అప్రమత్తంగా ఉండాలి

0
237
మీ పెద్ద కొడుకుగా అందర్నీ ఆదుకుంటా – సీఎం చంద్రబాబు
మోరిలో ఫైబర్‌గ్రిడ్‌ సేవలు ప్రారంభం
జమహేంద్రవరం, డిసెంబర్‌ 29 : జిల్లాలో ఫైబర్‌గ్రిడ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో  ఫైబర్‌గ్రిడ్‌ ఇంటర్నెట్‌ సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఉదయం ప్రారంభించారు. గ్రామంలో ఇంటర్నెట్‌, టి.వి, టెలిఫోన్‌ సేవల్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో  చంద్రబాబు మాట్లాడుతూ తమ పబ్బం గడుపు కోవడానికి, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పి అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ‘మీ అందరి పెద్ద కొడుకుగా అందర్నీ ఆదుకుంటానని’ చంద్రబాబు భరోసా ఇచ్చారు. తానేమీ చేసినా పేదలకోసమేనని, అన్ని వర్గాల, ప్రాంతాల సంక్షేమం కోసం తాను పాటుపడుతుంటే కొందరు కుల,మతాల్ని రెచ్చగొడుతున్నారన్నారు. కాగా మోరీ గ్రామంలో జరుగుతున్న డిజిటల్‌ తరగతుల పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలన్ని గ్రామానికి వచ్చాయన్నారు. వారందరితో కలిసి అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఏపీలో డిజిటల్‌ లావాదేవీల్లో తొలి గ్రామమైన మోరిలో ప్రజలు నగదు లేకుండా లావాదేవీలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.