కేంద్రం నుండి వైదొలగడంపై ప్రజల్లో హర్షం

0
289

నాలుగేళ్ళలో అదనంగా చేసిందేమీ లేదు : మంత్రి జవహర్‌

రాజమహేంద్రవరం, మార్చి 10 : కేంద్రప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ మంత్రులు వైదొలగడం పట్ల రాష్ట్రంలోని ప్రజల నుంచి హర్షం వ్యక్త అవుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖామంత్రి కెఎస్‌ జవహర్‌ వెల్లడించారు. స్ధానిక రోడ్లు భవనాల అతిధి గృహంలో నేడు జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి జవహర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలుగుతుందా లేదా అన్న అనుమానాలను నివృతి చేస్తూ తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేయడం జరిగిందన్నారు. ఇంకా ఏడాదికిపైగా ప్రభుత్వం నడుస్తుందని, ఈ ఏడాది ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల అభీష్టం మేరకు టిడిపి కేంద్రం నుంచి వైదొలిగిందన్నారు. గత నాలుగేళ్ళగా మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి సరైన సహకారం అందలేదన్నారు. విభజింప బడిన రాష్ట్రానికి అదనంగా చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుండి వైదొలగడంతో కేంద్రం నుంచి సహకారం అందే అవకాశం ఉండదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన చేసి అన్యాయం చేస్తే, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బిజెపి మోసం చేసిందని విమర్శించారు. కేంద్రం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా, ఆత్మగౌరవం కోసం బైటకు రావడం జరిగిందన్నారు. నాలుగేళ్ళలో ఏమి చేశారో చెప్పమని తాము అడుగుతుంటే, బిజెపి ఏమి చేయలేదో చెప్పమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎయిమ్స్‌కు రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని, వీరిచ్చింది కేవలం రూ.12 కోట్లు అని, ఈ విధంగా నిధులు ఇస్తే ఎప్పటికి ఈ సంస్ధల ఏర్పాటు పూర్తవుతుందని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చడానికి 10ఏళ్ళ సమయం ఉందంటున్నారనీ, ఇప్పటికే నాలుగేళ్ళు పూర్తయ్యాయని, ఆరేళ్ళలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలుగుతారని ప్రశ్నించారు. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఒక వైపు ప్రధాని మోదీపై విశ్వాసం ఉందంటూనే, అవిశ్వాసం పెడతామని చెపుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. వీరికి ఉన్న విశ్వాసం అంతా వారిపై ఉన్న కేసుల నుండి బైటపడేస్తారనేనని ఎద్దేవా చేసారు. రాజధాని నిర్మాణానికి రూ. 52వేల కోట్లు ఖర్చు అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 12వేల కోట్లు ఖర్చుచేసిందని, అయితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు రూ.4,750 కోట్లేనన్నారు. విభజనతో నష్టపోయాం కాబట్టే ప్రత్యేక ¬దా అడుగుతున్నామని, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలు ఏమి నష్టపోయాయని ¬దా అడుగుతాయని ప్రశ్నించారు. అఖిల పక్షాన్ని ఎందుకు వెంట పెట్టుకు తీసుకువెళ్ళాలని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జగన్‌పై ఉన్న కేసులు ఎత్తివేయాలని బేరసారాల కోసం వైసిపిని వెంటపెట్టుకు వెళ్ళాలా అని ప్రశ్నించారు. వామపక్ష పార్టీలు జెండాలు పట్టుకుని పోరాటాలు చేయడం తప్ప వారికి ప్రజా మద్దతు లేదన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఎన్‌జివో సంఘాలు కూడా పోరాటాలకు దిగనున్నాయని వెల్లడించారు. జనసేన అనేక సందర్బాలలో సూచనలు, సలహాలు ఇచ్చిందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం ద్వారా పవన్‌ కళ్యాణ్‌ సంతృప్తి చెందారన్నారు.

సారా రహిత జిల్లాలుగా తీర్చిదిద్దుతాం

రాష్ట్రంలోని 13 జిల్లాలను సారా రహిత జిల్లాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి జవహర్‌ వెల్లడించారు. ఇప్పటికే 9 జిల్లాలను సారారహితంగా చేయడం జరిగిందన్నారు. మిగిలిన నాలుగుజిల్లాలు చిత్తూరు, కృష్ణ, కర్నూలు, తుర్పుగోదావరి జిల్లాలను సారా రహితంగా తీర్చిదిద్దడానికి శాఖాపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. సారాను రవాణా చేసే యువతతోపాటుగా ఉత్పత్తుదారులకు ప్రత్యామ్నాయ ఉపాది అవకాశాలను కల్పించి, ఈ వృత్తి నుంచి వారిని దూరం చేస్తామన్నారు. జిల్లాలో 125 గ్రామాలలో సారా తయారీ, అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించామని, ఇక్కడ సారాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. బెల్టు షాపులు ఎక్కడా లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు వర్గాలకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా మాదిగా సామాజికవర్గం అభ్యున్నతి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసారు. చర్మకార కార్మికుల సంక్షేమానికి రూ. 60కోట్లు, లెదర్‌ కార్పొరేషన్‌కు రూ. 40 కోట్లు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. అంతకు ముందు రోడ్లు భవనాల శాఖ అతిధి గృహంలో ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ పి నర్సింహం, అసిస్టెంట్‌ కమిషనర్‌ హేమంత నాగరాజు, డిప్యూటీ కమిషనర్‌ అరుణ్‌రావు, సూపరింటెండ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్‌ కోరుమిల్లి విజయశేఖర్‌, దారా ఏసురత్నంలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here