కేసుల మాఫీ కోసమే పార్టీ నిర్వహణ

0
88
జగన్‌ తీరుపై కళా వెంకట్రావు ధ్వజం – జనసేనకు దిశానిర్ధేశం లేదని విమర్శ
విద్యుత్‌ సరఫరాలో ఏపీ అగ్రగామి
రాజమహేంద్రవరం, జులై 25 : ప్రజాధనాన్ని లూటీ చేసిన కేసులను మాఫీ చేయించుకోవడం కోసమే వై.ఎస్‌.జగన్‌ పార్టీ నడుపుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, విద్యుత్‌ శాఖామంత్రి కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. హోటల్‌ షెల్టన్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వలాభం కోసం మాత్రమే జగన్‌ పార్టీని నెలకొల్పారని, ఇప్పుడు తన కేసులను మాఫీ చేసుకోవడం కోసం బిజెపితో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. పదహారు నెలలపాటు జైలుశిక్ష అనుభవించి నేటికీ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న జగన్‌ రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేవలం ఐదుగురు ఎంపీలతో రాజీనామా చేయించి నాటకాలు ఆడుతున్న జగన్‌ పిలుపును ప్రజలు గమనించే నిన్నటి బంద్‌కు పెద్దగా సహకరించలేదని, బస్సుల దగ్గర తప్ప ప్రజల్లో స్పందన రాలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ, కాకినాడ స్థానిక సంస్థల ఎన్నికలోనూ జగన్‌ నోటి దురుసుతనాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని, ఇప్పుడు మరొక పార్టీ అధినేతపై మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం రాజకీయం కాదని, ఆ విషయాలను తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు జగన్‌ మాట్లాడితే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగన్మోహనరెడ్డి అవిశ్వాసానికి పిలుపునిస్తే కేవలం తన ఐదుగురు ఎంపీలు మాత్రమే తెరపై కనిపించారని, చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా మద్దతు ప్రకటించాయో ప్రజలు గమనించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకొక కొత్త పార్టీ వచ్చిందని, దానికి దిశా నిర్దేశం లేదని జనసేన పార్టీ నుద్దేశించి కళా వెంకట్రావు విమర్శలు చేశారు. దేశంలో 29 రాష్ట్రాలుండగా విద్యుత్‌ సరఫరాలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, ఇది చంద్రబాబు ఘనత అని కొనియాడారు. విద్యుత్‌ రంగంలో నూతన సంస్కరణలను 1998లోనే చంద్రబాబు చేపట్టగా 2004 నుంచి 2014 వరకు పరిపాలించిన కాంగ్రెస్‌ విద్యుత్‌ శాఖను అధ్వాన్న స్థితిలోకి తీసుకెళ్ళిందని విమర్శించారు. 2014లో ప్రజామోదంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రెండునెలల్లోనే సమూలమైన మార్పులు తీసుకువచ్చి నిరంతర విద్యుత్‌ సరఫరాను అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో 22 లక్షల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉండేదని, దీని ఫలితంగా పరిశ్రమలు వారానికి మూడురోజులు మూతపడేవన్నారు. 8వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేదని, ఇప్పుడు 17వేల మెగావాట్లకు దానిని పెంచారని పేర్కొన్నారు. అందువల్లే 24 గంటల సరఫరా సాధ్యమయ్యిందన్నారు. మరోవైపు రైతులకు సంబంధించిన విద్యుత్‌ కనెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వారికి పగటిపూట 7 గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. అందువల్లే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ అగ్రగామిగా నిలిచిందన్నారు. తెదేపా పాలనలో విద్యుత్‌ ధరలు పెంచే ప్రసక్తి లేదని చంద్రబాబు చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రూ.2,800 కోట్లతో సబ్‌ స్టేషన్లు, కొత్త లైన్లు, ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే రూరల్‌ నియోజకవర్గంలో రూ.67 కోట్లు, సిటీలో రూ.37 కోట్లతో సబ్‌ స్టేషన్ల నిర్మాణం జరిగిందన్నారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత నాలుగేళ్ళలో సిటీ, రూరల్‌లో పది స్టేషన్ల నిర్మాణం జరిగిందన్నారు. దాదాపు రూ.95 కోట్లతో పనులు జరిగాయని తెలిపారు. బొమ్మూరులో రూ.10 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందులో భాగంగా డైట్‌ సంస్థకు  నూతన భవనాలు సమకూర్చేందుకు రూ.2.90 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. శాటిలైట్‌ సిటీలో రూ.20 కోట్లతో బలహీనవర్గాల కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలను నిర్మిస్తామని తెలిపారు. నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించే ప్రక్రియలో మంత్రి కళా వెంకట్రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ నామన రాంబాబు, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here