15 గృహాలు అగ్నికి ఆహూతి
రాజమహేంద్రవరం, నవంబర్ 6 : రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. రాజరాజేశ్వరి నగర్లో పూరిపాకలు వేసుకున్న నివాసం ఉంటున్న ప్రాంతంలో గత అర్థరాత్రి దాటిన తరువాత జరిగిన అగ్ని ప్రమాదంలో 15 ఇళ్లు అగ్నికి ఆహూతయ్యాయి. చెరువు గట్టున పాకలు వేసుకుని గత 15 సంవత్సరాలుగా బాధిత కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ వల్లనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో వారి ఇళ్లు పూర్తిగా భస్మీపటలమయ్యాయి. సుమారు 2 లక్షల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్టు రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. రూరల్ తహశిల్దార్ కె.పోసియ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్మూర్తి, విఆర్ఓ నాగేశ్వరరావు తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.