కొలిక్కిరానున్న జాంపేట మార్కెట్‌ ఆశీల వ్యవహారం  

0
477
మున్సిపల్‌ కమిషనర్‌తో యర్రా వేణు చర్చలు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 1 : గత ఆరు సంవత్సరాలుగా  అపరిష్కృతంగా ఉన్న జాంపేట  చేపల మార్కెట్‌ ఆశీల వ్యవహారం త్వరలో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన నగర పాలక సంస్ధలతో పోలిస్తే  జాంపేట మార్కెట్‌లో ఆశీలు ఎక్కువ వసూలుతో ప్రతిష్టంభన ఏర్పడి చేపల వర్తకులు న్యాయస్ధానానికి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు.  ఇటీవల నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు జాంపేట మార్కెట్‌ను పరిశీలించి ఆశీలపై వ్యాపారులను ప్రశ్నించగా వారు కోర్టు స్టే వ్యవహారం కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన వ్యాపారస్తుల్ని  మార్కెట్‌లోకి అనుమతించే పరిస్థితి లేకుండా ప్రయత్నించడంతో  కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు జోక్యం చేసుకుని కమిషనర్‌ వద్దకు వర్తక ప్రతినిధుల్ని తీసుకెళ్ళి చర్చలు జరిపారు. కాకినాడ, గుంటూరు, విజయవాడ నగరాల్లో  వసూలు చేస్తున్న ఆశీల రేట్ల వివరాలను తెప్పించుకుని రాజమహేంద్రవరం  రేట్లతో సరిపోల్చుకుని ఆ స్థాయికి ఈ రేట్లను సవరించే ప్రయత్నం చేయడంతో పాటు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి ఇక్కడి రేట్లను సవరించాలని నిర్ణయించారు.  కమిషనర్‌ను కలిసిన వారిలో యర్రా వేణుతో పాటు  జాంపేట చేపల మార్కెట్‌ వర్తకుల సంఘం అధ్యక్షుడు అక్కల కోటేశ్వరరావు, గౌరవ కార్యదర్శి వెంకటేశ్వరరావు, నాగు తదితరులు ఉన్నారు.