కొలువు దీరిన కొత్త లోక్‌సభ 

0
149
తొలిరోజు సభ్యుల ప్రమాణ స్వీకారం – 19న స్పీకర్‌ ఎన్నిక
న్యూఢిల్లీ, జూన్‌ 17 : పదిహేడో లోక్‌సభ తొలి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. భాజపా ఎంపీ వీరేంద్రకుమార్‌ నేడు ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. వీరేంద్రకుమార్‌ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత ప్రధానమంత్రి, ఎన్డీయే పక్షనేత నరేంద్రమోదీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ మోదీచే ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ నుంచి సురేశ్‌ కొడికున్నిల్‌, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. ముందు కేంద్రమంత్రులు, ప్యానెల్‌ ఛైర్మన్లు ముందు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎంపీల ప్రమాణాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ, రేపు ఎంపీల ప్రమాణస్వీకారాలు జరుగుతాయి. కాగా జూన్‌ 19న స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఇలా ఉండగా నేటి నుంచి జులై 26 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. జులై 5న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో త్రిపుల్‌ తలాక్‌ సహా 10 ఆర్డినెన్స్‌లకు చట్టం రూపం తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.  ఇలా ఉండగా 17వ లోక్‌సభ స్పీకర్‌గా మేనకాగాంధీ, రాధామోహన్‌ సింగ్‌, అహ్లూవాలియా, జువార్‌ ఓరామ్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here