‘కోతలు కాని కోతలు’.. ప్రజల అవస్థలు

0
149
ఉక్కపోతకు తోడు విద్యుత్తు అంతరాయాలతో నరకం
రాజమహేంద్రవరం,జూన్‌ 20 : మండిపోతున్న ఎండలు… భరించలేని ఉక్కపోత… జులై నెల వస్తున్నా జాడ లేని చినుకు…వీటికి తోడు అనధికార విద్యుత్తు కోతలు… వెరశి ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. అసలే ఈ సంవత్సరం వేసవి సుదీర్ఘంగా సాగడమే గాక రోహిణి కార్తెతో పాటు మృగశిర కార్తె కూడా దాదాపు పూర్తి కావస్తున్నా  వరుణుడి కరుణ లేకుండా పోయింది. మార్చిలో ఆరంభమైన ఎండలు జులై వస్తున్నా తగ్గకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. పైగా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదు కావడంతో భానుడి భగభగలతో పగలు, ఉక్కపోత, వేడి వాతావరణంతో రాత్రి కంటి నిండా కునుకు లేకుండా పోతోంది. దీనికి తోడు అనధికార విద్యుత్తు కోతలు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో పరిస్థితి కాస్త మెరుగుగా ఉన్నా పట్టణాలు, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఈ అనధికార విద్యుత్తు కోతలు తీవ్రంగా ఉన్నాయి. రోజుకు దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అనధికార విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నారు. పగలు సర్ధిపెట్టుకున్నా రాత్రి కూడా కోతలు విధిస్తుండటంతో ఉక్కపోత భరించలేక వృద్ధులు, పసిపిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అల్లాడిపోతున్నారు. విద్యుత్తు వినియోగం పెరిగి పంపిణీ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి ఈ పరిస్థితి ఏర్పడుతోందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. వీటిని కోతలు అని చెప్పలేమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్తు పంపిణీ కేంద్రాల్లో సమస్యలు ఏర్పడితే తమ సిబ్బంది వెంటనే పునరుద్ధరిస్తున్నారని వారు అంటున్నారు. దీనిపై ట్రాన్స్‌కో రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌.ఇ. సిహెచ్‌. సత్యనారాయణ రెడ్డి వివరణ ఇస్తూ పట్టణాలతో పాటు గ్రామాల్లో 24 గంటల విద్యుత్తు సరఫరా  చేస్తున్నామని, ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే  సిబ్బంది వెంటనే పునరుద్ధరిస్తున్నారని ఆయన తెలిపారు.  అయితే పరిస్థితిని బట్టి లోడ్‌ రిలీఫ్‌ ఇస్తున్నామని చెప్పారు. ఒక వైపు భానుడు..మరో వైపు కరెంట్‌ కష్టాలతో ప్రజలు తల్లడిల్లిపోతుండగా జిల్లాలో ఎక్కడా కూడా విద్యుత్తు కోతలు లేవని అధికారులు చెబుతున్నారు. మరి వేళా పాళ లేకుండా ఈ ‘కోతలు’ ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here