కోమా నుంచి ఇపుడు బయటకొచ్చావా ?

0
294
పెద్ద నోట్ల రద్దు విషయంలో జగన్‌ స్పందనపై గన్ని కృష్ణ  సూటిప్రశ్న
రాజమహేంద్రవరం, నవంబర్‌ 24 : పెద్ద నోట్లు రద్దయిన 15 రోజులకు కోమా నుంచి బయటపడిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఇపుడు కారుకూతలు కూస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల జగన్‌కే ఎక్కువ షాక్‌ తగిలిందని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. ఈరోజు 11 వ డివిజన్‌లో జరిగిన తెదేపా జన చైతన్య యాత్రలో పాల్గొన్న గన్ని పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. పాత నోట్లు రద్దు వల్ల సామాన్యులు బాధ పడుతున్నారన్న ముసుగులో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పరమైన అవినీతి, నల్లధనం, దొంగనోట్ల చెలామణి వంటి వాటిని నిర్మూలించేందుకు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయంతో జగన్‌కు షాక్‌ తగిలిందన్నారు. అక్రమంగా కోట్లు దాచిపెట్టిన జగన్‌కు ఇపుడు ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారని, ఇటువంటి అవినీతిపరులకు చెక్‌ పెట్టేందుకే  మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. పాత నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసని, అందుకే హెరిటేజ్‌ షేర్లు అమ్మేశారని జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హెరిటేజ్‌ షేర్లకు, పెద్ద నోట్ల రద్దుకు అసలు సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. హెరిటేజ్‌ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయని చెప్పారు. జగన్‌ చేసే నిరాధారమైన ఆరోపణలను పార్టీ శ్రేణులు ఖండించాలని పిలుపు ఇచ్చారు. అనంతరం గన్ని కృష్ణ విశాఖ అర్బన్‌ జిల్లాలో జరిగే జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు పయనమయ్యారు.