క్విట్‌ పార్టీ !

0
242
మనస్సాక్షి
వెంకటేశం పొద్దున్నే స్వీట్స్‌ ప్యాకెట్‌ పుచ్చుకుని తయారయిపోయాడు. దాంతో గిరీశం ” ఏంటోయ్‌ విశేషం ? ఎలక్షన్లో సీటు గానీ వచ్చిందా?” అంటూ అడిగాడు. దాంతో వెంకటేశం ” అంతదృష్టం కూడానా…అయినా ఎప్పట్నుంచో ఉన్నవాళ్ళకే దిక్కు లేదు. యింక నా దాకానా?” అన్నాడు. దాంతో గిరీశం యింకేటన్నట్టుగా చూకుశాడు. అప్పుడు వెంకటేశం ” నాకు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ క్రింద ఉద్యోగం వచ్చింది” అన్నాడు. దాంతో గిరీశం ఆనందపడిపోయి ”పోన్లేవోయి…ముందీ ఉద్యోగంలో చేరిపో. తర్వాత రాజకీయాల సంగతి చూద్దాం” అన్నాడు. వెంకటేశం తలూపి బయటకు నడిచాడు. అంతే కాదు. ఆ మర్నాడే వెంకటేశం వెళ్ళి ఆ కంపెనీలో చేరాడు. వెంకటేశం చేరికతో ఆ కంపెనీ రూపు రేఖలే మారిపోయాయి. అసలే వెంకటేశం తెలివయినోడూ, హుషారయినోడూ. దాంతో అందరితో బాగా కలిసిపోయాడు. ఎప్పుడూ సరదాగా మాట్లాడతాడు. దాంతో ఆఫీసులో జీవకళ వచ్చేసింది. అలా ఆర్నెల్లు గడిచాయి. అప్పుడు జరిగిందది. ఆ రోజు ఉదయాన్నే  మేనేజర్‌ ఏకలింగం వెంకటేశాన్ని తన చాంబర్‌లోకి పిలిచాడు. వెంకటేశం ఎందుకా అనుకునేలోపు ”మిస్టర్‌ వెంకటేశం… మీ సర్వీసులు మా ఆఫీసుకి యింక అక్కరలేదు.మీరు వెళ్ళొచ్చు” అన్నాడు. దాంతో వెంకటేశం షాకయిపోయాడు. ” అదేంట్సార్‌… నేనేం తప్పు చేశాను? ” అన్నాడు. దానికి ఏకలింగం ” అదంతా నీకు చెప్పవలసిన అవసరం లేదు. వెళ్ళు” అన్నాడు. దాంతో వెంకటేశం బయటకొచ్చాడు. వెంకటేశం వాలకం చూసి ఏం జరిగిందని అంతా మూగారు. వెంకటేశం జరిగింది చెప్పాడు. దాంతో అంతా షాకయ్యారు. యింకా బాధపడ్డారు కూడా. ఈలోగా ఆపీస్‌ అటెండర్‌ చిన్న యిన్ఫర్మేషన్‌ పట్టుకొచ్చాడు. ” వెంకటేశం బాబుగారిని తీసెయ్యడానికి కారణం అర్ధమయింది.
మొన్న వారంలో ఆఫీసులో  అందరికీ బ్లడ్‌ టెస్ట్‌లు చేయించారు కదా. వాటిలో వెంకటేశం బాబు రిపోర్టు హెచ్‌ఐవి పాజిటివ్‌  అనొచ్చిందట. అలాంటివాడు ఆఫీసులో ఉండకూడదనుకుని, అదేదో చెప్పలేక పొమ్మని చెప్పినట్టున్నాడు” అన్నాడు. దాంతో అంతా ఓ సారి ఏకలింగాన్ని కసితీరా తిట్టుకున్నారు. యింతలో వారిలో ఆనందరావు ” లేదు..లేదు.. దీన్ని మనం ఎంతమాత్రం ఒప్పుకోవద్దు. ఎలాగయినా ఆ ఏకలింగంగాడికి బుద్ధి చెప్పాలి. వెంకటేశం వెళ్ళిపోకుండా చూడాలి” అన్నాడు. అంతా ఎలా అన్నట్టు చూశారు. అప్పుడు సుందరం ” ఈ మధ్య టీవీల్లో  ఓ చిన్న ఫిల్మ్‌లాంటిదొస్తుంది. అది ఎయిడ్స్‌ ఉన్నోళ్ళని అంటరాని వాళ్ళ క్రింద చూడొద్దని సందేశంతో తీసింది. మనం అందులో లాంటి డ్రామా చేద్దాం ” అంటూ ఎవరేం చేయాలో చెప్పాడు.
——-
 ఆ మర్నాడు ఆఫీసులో ఓ విశేషం జరిగింది. ఏకలింగం తన ఛాంబర్లో ఉండగా ఆనందరావు లోపలకొచ్చాడు. వస్తూనే ఓ లెటర్‌ టేబుల్‌ మీద పెట్టి ” నేను రిజైన్‌ చేస్తున్నా సార్‌ ” అన్నాడు. దాంతో ఏకలింగం అదిరిపోయి ” ఏంటీ?” అన్నాడు. నమ్మలేనట్టుగా ఆనందరావు తలూపి  ” అవున్సార్‌.. ఆఫీసులో  లైటింగ్‌ ఎక్కువయింది” అనేసి బయటికి పోయాడు. ఏకలింగం యింకా ఆ షాకులో ఉండగానే  సుమ లోపలికొచ్చింది. వస్తూనే  ” మన ఆఫీసు వాస్తు బాలేదంట సార్‌… అందుకే నేను రిజైన్‌ చేసి వెళ్ళిపోతున్నా” అంటూ  టేబుల్‌ మీద లెటర్‌ పెట్టేసి చకాచకా వెళ్ళిపోయింది. ఆ పాటికి ఏకలింగం డీప్‌ షాక్‌లోకి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో అర్ధమవుతుంది గానీ ఎందుకనేదీ అర్ధం కావడం లేదు. యింతలోనే డ్రైవర్‌ సుందరం లోపలకొచ్చాడు. కారు కీస్‌ టేబుల్‌ మీద పెట్టేసి ” నేను సెలవు పుచ్చుకుంటున్నా సార్‌” అన్నాడు. ఏకలింగం తలూపి ” ఏం…నీకేం సమస్యొచ్చిందంట?” అన్నాడు. ఈ సారి సుందరం ” నేను రాకెట్‌ ట్రైనింగ్‌ కోర్సు నేర్చుకుందామనుకుంటున్నా” అంటూ బయటికి పోయాడు. ఏకలింగమయితే అసలు అందరూ యిలా ఎందుకు చేస్తున్నారా అని ఆలోచిస్తున్నాడు. యింతలోనే తలుపులు తోసుకుని వరలక్ష్మీ లోపలికి రావడం జరిగింది. అయితే వరలక్ష్మీ ఏదో మాట్లాడేలోపుగా ఏకలింగం ” ఏమ్మా… నువ్వెందుకు ఆఫీస్‌ మానేద్దామనుకుంటున్నావు అన్నాడు. దాంతో వరలక్ష్మీ ” మన క్యాంటీన్లో టీ బావోడం లేదు. అందుకే మానేద్దామనుకుంటున్నా” అంది.  దాంతో ఏకలింగం ” ఏంటీ… అందుకు మానేస్తున్నావా? అయినా మరీ యింత సిల్లీ కారణాలకి ఎవరయినా మానేస్తారా? ” అన్నాడు. వరలక్ష్మీ తలూపి ” మరి వెంకటేశానికి పాజిటివ్‌ వచ్చిందని ఉద్యోగంలోంచి తీసేశారు కదా. అదీ సిల్లీ కారణం కాదా!” అంది. అప్పటికి ఏకలింగానికి విషయం అర్ధమయిపోయింది.దాంతో అప్పటికప్పుడే వెంకటేశాన్ని తిరిగి ఆఫీసుకి రప్పించాడం, మర్నాటి నుంచీ ఆఫీసు మళ్ళీ మళ్ళీ కళకళలాడడం జరిగింది
———-
” అది గురూ గారూ నా కొచ్చిన కల. అయినా అవేవో మెసెజ్‌లు ఉంటే  ఉండొచ్చుగాక. మధ్యలో నాకు ఎయిడ్స్‌ ఏంటని? నేనేవయినా రెడ్‌లైట్‌ ఏరియా రెగ్యులర్‌ కస్టమర్‌నా”? అన్నాడు వెంకటేశం బాధపడిపోతూ. దాంతో గిరీశం ” ఆ..అదంతా కలలోనే కదా. అయినా నీ గురించి మాకు తెల్వదూ ” అన్నాడు వెంకటేశం తలూపి ” అయినా కలలో ఈ వంకల వ్యవహారం ఏంటంటారు? అసలీ కలెందుకు వచ్చినట్టంటారు?” అన్నాడు. దాంతో గిరీశం కొంచెం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ” ఏం లేదోయ్‌…ఈ సారి నీ కలలో వచ్చింది మన అభిమాన నటుడు చిరంజీవి గురించిలే! .  ఓ సారి చిరంజీవి పరిస్థితిని సమీక్షిద్దాం. యిప్పటికీ చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అంతమాత్రం చేత కుర్ర హీరోలతో పోటీపడి ఎడాపెడ సంవత్సరంలో  రెండు సినిమాలు చేసే వయసు కాదు. ఎప్పుడో  రెండు మూడేళ్ళకో సినిమాలో నటిస్తుంటే అందరితో టచ్‌లో ఉన్నట్టుంటుంది. ఒక సీనియర్‌ ఆర్టిస్టుగా తన గౌరవమూ నిలబడుతుంది. అంటే సినిమాల్లో యింక పూర్తి స్థాయిలో  బిజీగా ఉండేది లేదు కాబట్టి తనకి యిప్పటికే ప్రవేశమున్న రాజకీయాల్లో ఉండొచ్చు. అయితే సొంతంగా పార్టీని నడుపుదామంటే  యిప్పటికే  ఆ ప్రయత్నంలో చెయ్యి కాల్చుకోవడం జరిగింది. అలాగని యిప్పుడున్న కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుదామంటే కనుచూపు మేరలో పరిస్థితి ఆశాజనకంగా లేదు. తెలంగాణాని తీసుకుంటే మహాకూటమి పేరుతో  చేసిన ప్రయత్నం వలన అక్కడ అధికారం కాంగ్రెస్‌కి వచ్చినా ఆశ్చర్యం లేదు. అలా వచ్చినా కూడా పదవుల కోసం సీనియర్లయితే చాలా మందే క్యూలో ఉన్నారు. అందుకని అక్కడేదో  అందలం ఎక్కించేస్తారనుకోవడం పొరబాటే. యిక ఆంధ్రాని తీసుకుంటే సీట్లలో ఎక్కువ భాగం టిడీపి,జగన్‌లు పట్టుకుపోయే పరిస్థితి కనపడుతోంది. ఒకవేళ కాంగ్రెస్‌ సొంతంగా పోటీ చేసినా నాలుగైదు సీట్లు మించిరావు. ఒకవేళ కూటమిగా చేరి పోటీ చేసినా తనకు మాత్రం ప్రాధాన్యత ఉండదు. టీడీపి డామినేట్‌ చేస్తుంది. యిలాంటి పరిస్థితుల్లో చిరంజీవికున్న బెస్ట్‌ ఆప్షన్‌… తన తమ్ముడికే సపోర్ట్‌ చేయడం. ఎందుకంటే పవన్‌కి కొని కొన్ని మేథా వర్గాల్లో మంచిపేరుంది. యిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండనే ఉంది. అయితే సమస్యల్లా పవన్‌కి ఓట్లు అయితే  బాగానే రావచ్చు. అయితే అవి సీట్లుగా గెలవడంలోనే యిబ్బంది. మొత్తంగా ఓట్ల సంఖ్య చూస్తే  మంచి శాతం వచ్చినా రెండవ లేక మూడవ స్థానంలో ఉండే సీట్ల సంఖ్య పరంగా చాలా తక్కువ రావచ్చు. అదే చిరంజీవి కూడా తోడయితే పవన్‌ పార్టీ బలం పెరిగి సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. దాంతో రేపు ఆంధ్రాలో  ఎలక్షన్స్‌లో టీడిపి,జగన్‌లు పోటాపోటీగా  సీట్లు సాధించినప్పటికీ అధికారం ఏర్పాటు చేయలేని  హంగ్‌ పరిస్థితి ఏర్పడితే,  అప్పుడు రాష్ట్రంలో  చక్రం తిప్పే అవకాశం పవన్‌ పార్టీకి వస్తుంది. మరి తన తమ్ముడి పార్టీలోకి వెళ్ళాలంటే ముందు తనున్న కాంగ్రెస్‌లోంచి బయటపడాలి కదా. అదెలాగా  అని చూస్తుంటే వంక దొరికినట్టయింది. అదే .. తెలుగుదేశం…కాంగ్రెస్‌ పొత్తు. దాంతో ”ఈ పొత్తు అనైతికం అనీ, అందుకే తను కాంగ్రెస్‌లోంచి వెళ్ళిపోతున్నాననీ’ చెప్పడం జరుగుతోంది. ఏతావాతా చెప్పేదేంటంటే రాజకీయ నాయకులు శెలవిచ్చే వంకలన్నీ నీ కలలోలాగే బొత్తిగా సిల్లీగా ఉంటాయి” అంటే తేల్చాడు.
డా. కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here