ఖర్మలు – నిష్కామ కర్మలు

0
236
మనస్సాక్షి  – 1134
ఆరోజు గిరీశం గారి కుటుంబం బాపతు పేరు ప్రతిష్టలు యింకో నాలుగు మెట్లె క్కాయి. అంటే దానర్ధం ఆనాటి గిరీశం గారి మనవడు ఈ గిరీశం ఏదో ఘనకార్యం చేసేశాడని కాదు. అసలా మాటకొస్తే గిరీశం ‘నాతో మాట్లాడ్డవే ఎడ్యుకేషన్‌’ లాంటి కబుర్లు చెప్పడం, చుట్ట గుప్పు గుప్పుమని పించడం తప్ప చేసేదేవీ ఉండదు. మరి.. యింత ఘనత ఎవరి వలనా అంటే.. అదేదో ఈ గిరీశం గారి మేనల్లుడు బాబీ గాడి వలన..! మామూలుగానే బాబీగాడిని గొప్ప తెలివయినవాడని అంతా తెగ మెచ్చు కుంటుంటారు. ఎప్పటికయినా వాడు గొప్ప పరిశోధనేదో చేసి నోబెల్‌ ప్రైజు కొట్టే పారేస్తాడని అందరి నమ్మకం. అలాంటిది అదేదో ఎప్పుడో కాకుండా యిప్పుడే చేసి పారేశాడు. ఐన్‌స్టీన్‌, గ్రాహంబెల్‌ల స్థాయిలో మహ త్తరమైన పరిశోధన ఒకటి చేసి ఈ జనానికి అందించాడు. అసలు ఎలాంటి ఆయిలూ అవసరం లేకుండా ఓ వాహనాన్ని పరిగెట్టించే పరిశోధన చేశాడు. అంతేనా.. దానిమీదే  రయ్యిరయ్యిన ఊరంతా తిరిగేస్తున్నాడు కూడా. కాలుష్యం లేని యిలాంటి వాహనం కనిపెట్టినందుకు  అంతా బాబీగాడిని ఆకాశానికెత్తేశారు. అయితే పాపం… అంతటి గొప్ప మేధస్సుకి యింట్లోనే సరయిన గుర్తింపు వచ్చి చావలేదు. పైగా ఈ పరిశోధన వ్యవహారం నచ్చక వాళ్ళమ్మ చీపురుకట్ట తిరగేసింది. అసలీ పరిశోధన వ్యవహారం చూడాలంటే బాబీగాడి యింటికి వెళ్ళాల్సిందే…
——
వెంకటేశం చిన్నగా పాటేదో పాడుకుంటూ గిరీశం గారింటి కొచ్చాడు. తీరా వచ్చేసరికి గిరీశంగారి యింటి లోపల్నుంచి యిల్లంతా అదిరిపోయే లెవెల్లో అరుపులు వినిపిస్తున్నాయి. యింతకీ అలా అరుస్తోంది ఎవరో కాదు. అచ్చంగా బాబీగాడి అమ్మ… అంటే తన వదిన. మామూలుగా అయితే ఆవిడ మాట పైకి వినపడదు. అలాంటిది యిలా అరుస్తుందంటే ఈ బాబీగాడు కొక్కిరాయి పనేదో చేసుంటాడని అర్థమయిపోతోంది. దాంతో వెంకటేశం గబగబా లోపలికి నడిచాడు. యింతలోనే వదిన రుక్మిణి మళ్ళీ ”రేయ్‌.. మన యింటి పరువు తీసేశావు కదరా.. అసలు ఎలాంటి కుటుంబం మనది. మీ ముత్తాత గిరీశం గారికి ఎంతపేరని… ఏదో ఆ చుట్టల గోలా, ఏవో చిల్లర వ్యవహారాలూ తప్పిస్తే ఆయనకెంతపేరని.. అలాంటిది ఆయన మునిమనవడవైన నువ్వు శుద్ధశ్రోత్రీయుల మైన మనింటికి మాంసం పట్టుకొస్తావా?”అంటూ అరుస్తోంది. దాంతో వెంకటేశం అదిరిపోయాడు. ‘ఏంటీ.. ఈ వెధవ యింటికి మాంసం తెచ్చాడా? అంతగా కావలిస్తే సీక్రెట్‌గా ఏ హోటల్లోనో మింగి చావొచ్చు కదా’ అని తిట్టుకున్నాడు. అయితే వాళ్ళమ్మ అంతేసి మాటలంటున్నా బాబీగాడు ఏం భయపడుతున్నట్టుగా లేదు. ”యిదిగో అమ్మా.. అసలా మాంసం అదీ ఎందుకు తెచ్చానని ఆలో చించనే..” అన్నాడు. అయినా రుక్మిణి ఊరుకోకుండా ”ఎందు కయినా అనవసరం. అసలు గిరీశం గారింట్లోంచి ఒకళ్ళొచ్చి మాంసం కొట్టు ముందు నిలబడి మాంసం కొంటే ఎంత అప్రతిష్ట..!” అంది. యిక లాభంలేదని వెంకటేశం గబగబా బాబీగాడి దగ్గర చేరి ”నువ్వెళ్ళొదినా…నేను మాట్లాడతా” అన్నాడు. దాంతో రుక్మిణి ”అసలువాడు సగం చెడిపోడానికి కారణం నువ్వే” అని గొణు క్కుంటూ లోపలికిపోయింది. వెంకటేశం ఏం జరిగిందని అడిగే సరికి బాబీగాడు జరిగింది చెప్పడం మొదలెట్టింది.
——
మూడురోజుల క్రితం… బాబీగాడు భుజానికి పుస్తకాల బ్యాగ్‌ తగి లించుకుని ఈసరోమంటూ నడుస్తున్నాడు. స్కూలయితే మరీ ఆటోలో వెళ్ళేంత దూరమూ కాదు. అలాగని నడిచివెళ్ళేంత దగ్గరా కాదు. మొత్తానికి బాబీగాడిని నడిచే వెళ్ళమంటున్నారు. దాంతో ఎప్పటిలాగే ఆరోజూ బాబీగాడు నడిచే స్కూలుకి పోతున్నాడు. అయితే యింతలోనే బాబీగాడి నడిచే స్కూలుకిపోతున్నాడు. అయితే యింతలోనే బాబీగాడి దృష్టి తన పక్క నుంచి పోతున్న కుక్కమీద పడింది. అది ఊర కుక్కయినా ఎత్తుగా బలంగా ఉంటుంది. అందరిళ్ళ దగ్గరా తిరుగుతుంటుంది. దాన్ని చూడగానే బాబీగాడికో గొప్ప ఆలోచన వచ్చే సింది. ఆ మర్నాడు పొద్దున్నే చికెన్‌ షాపుకెళ్ళి ఓ రెండు జాయింట్లు కొన్నాడు. వాటిలో ఒకటి ఓ తాడుకు కట్టి ఆ తాడుని కుక్క మెడలోవేశాడు. దాంతో ఆ కుక్కదాన్ని అందుకుని తినడానికి ప్రయత్నాలు మొద లెట్టింది. ఈలోగా బాబీగాడు ఆ కుక్క మీదెక్కి కూర్చుని ఛల్‌ అన్నాడు. దాంతో ఆ కుక్క ఆ మాంసం అందు కోవాలని ప్రయత్నం చేస్తూనే పరుగందుకుంది. కొంచెం దూరం వెళ్ళిందోలేదో దాని నోటికి ఆ మాంసం కాస్తా చిక్కేసింది. దాంతో అది పరుగాపేసి మాంసం పీక్కు తినే పనిలో పడింది. దాంతో ఈసారి బాబీగాడు ప్లాన్‌ మార్చాడు. యింకో జాయింట్‌ని ఓ పొడ వయిన కర్ర చివరికి కట్టాడు. అప్పుడు ఆ కుక్కమీదెక్కి ఆ మాంసమేదో దానికి అందకుండా నోటికి కొంచెం అవతల ఉండేలా పట్టుకుని ఛల్‌ అన్నాడు. దాంతో ఆ మాంసం అందుకోవడానికి కుక్క కాస్తా రయ్యిమని పరుగందుకుంది. అయితే ఎప్పటికే దాని నోటికి ఆ మాంసం అందితే కదా… ఈలోగా స్కూలొచ్చేసరికి బాబీ గాడు కుక్క మీంచి దిగిపోయాడు.
——
”అది బాబాయ్‌… అలా జరిగింది. మరి రేపు మళ్ళీ ఎక్కడికయినా వెళ్ళాలన్నా పనికొస్తాయని యింకో రెండు చికెన్‌ జాయింట్లు కొట్టించి తెచ్చా. అంతే” అన్నాడు బాబీగాడు. దాంతో వెంకటేశం అదిరిపోయి ”రేయ్‌ బాబీగా.. మీ ముత్తాత గిరీశాన్ని చూసినట్టుం దిరా.. ఆయన తెలివితేటలూ యిలాగే ఉండేవంట” అన్నాడు. దాంతో బాబీగాడు అందంగా సిగ్గుపడ్డాడు.
——
”గురూగారూ… రాత్రలాంటి కలొచ్చింది. అయినా దీనర్ధం ఏంటం టారు?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”ఆ…ఏం లేదోయ్‌.. యిప్పుడు బయటంతా ఎలక్షన్‌ హడావిడే కదా. అందులో ఓ వ్యవహారమేదో నీ బుర్రలో దూరినట్టుంది” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”మరేం లేదోయ్‌.. ఎలక్షన్లలో అన్ని పార్టీలకీ పెద్ద సమస్య యితర పార్టీల నుంచి పోటీ కాదు. అదెలాగా ఉంటుం దనుకో. అసలయిన సమస్య సొంత పార్టీలో వాళ్ళతోనే. పార్టీలో సీటు ఆశించేవాళ్ళు చాలామందే ఉంటారు. ఉన్నా సీట్లు పరి మితమాయె. దాంతో అవేవో కొందరికే దక్కుతాయి. దాంతో మిగతా వాళ్ళంతా అలిగేసి యింకో పార్టీలోకి జంప్‌ చేయడమో, పార్టీలో ఉండే డేమేజ్‌ చేయడమో చేస్తారు. యిది ఏ పార్టీకీ మంచిది కాదు. దాంతో అన్ని పార్టీలూ అలాంటివాళ్ళని ‘నీకు రేపు ఎమ్మెల్సీ యిస్తాననో, డైరెక్ట్‌గా రాజ్యసభ ఎంపీగా పంపుతాననో లేకపోతే యింకో చైర్మన్‌ గిరీ యిస్తాననో’ బుజ్జగిస్తాయి. అయితే యివన్నీ ఎప్పటికీ నెరవేర్చలేని హామీలే. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్న పదో పాతిక పోస్టులకి హామీలిచ్చేది అయిదొందలమందికి..! అవేవో అందని తాయిలాలని తెలీక అంతా పార్టీలోనే అలా సాగుతుం టారు. అయితే చివరగా ఒక్క విషయం. తన సామర్ధ్యానికి తగిన గుర్తింపు లేకపోయినా, సీటు యివ్వకపోయినా, పార్టీ నుంచి ఎలాంటి హామీలు లేకపోయినా కొందరు చిత్తశుద్ధితో, కర్మయోగుల్లా పార్టీ కోసం పాటుపడుతూనే ఉంటారు. అయితే యిప్పుడు కాక పోయినా ఏదోరోజు వారికి మంచి ఫలితం వచ్చే తీరుతుంది. అంతా అటువంటివాళ్ళని ఆదర్శంగా  తీసుకోవాలి” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here