గజ-గజనీలు

0
354

మనస్సాక్షి – 1083

వెంకటేశానికయితే బొత్తిగా ఆశ్చర్యంగా ఉంది. లేకపోతే ఎప్పుడొచ్చినా యింట్లో దొరకని గిరీశంగారు ఆరోజు యింట్లోనే ఉన్నారాయె. అదొక్కటే కాదు. ఎప్పుడూ చెక్క మొహం వేసుకుని ఉండే సదరు గిరీశంగారు యిప్పుడొకటే నవ్వేసుకుం టున్నారాయె. దాంతో వెంకటేశం కంగారుపడి ”గురూగారూ.. ఏవ యిందీ?” అంటూ అడిగాడు. దాంతో గిరీశం ”ఏవీ లేదోయ్‌.. రాత్రి చదివిన కధొకటి గుర్తొచ్చిందిలే” అన్నాడు. దాంతో వెంకటేశం ఆసక్తిగా అదేం టన్నట్టు చూశాడు. ఈలోగా గిరీశం ఓ చుట్ట అంటించుకుని అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ”ఒక ఊళ్ళో ఉన్న ట్టుండి ఒకడికి నెత్తిమీద కొమ్ములు మొలిచాయి. అంతేకాదు. రోజురోజుకీ అవి పెరుగుతున్నాయి. దాంతో ఊళ్ళో రకరకాల గుస గుసలు మొదలయ్యాయి. మొత్తానికి యిదేదో ఊరికి అరిష్టమని అంతా కలిపి తేల్చారు. దాంతో అంతా కలిసి వాడిని చంపేశారు. యింకో నాలుగురోజుల్లో ఊళ్ళో యింకో నలుగురికి యిలాగే కొమ్ములు మొలిచాయి. ఈసారీ ఊరంతా ఏకమై వాళ్ళని చంపేశారు. యింకో వారం గడిచింది. తెల్లారేసరికల్లా ఊరు ఊరందరికీ నెత్తిమీద కొమ్ములొచ్చేశాయి. ఒక్కడికి మాత్రం రాలేదు. ఈసారి ఊరంతా ఏకమై కొమ్ములు మొలవని ఆ ఒక్కడినీ చంపేశారు. అదీ కథ” అన్నాడు. దాంతో వెంకటేశం ”భలే ఉంది గురూగారూ.. మనుషుల్లో ఉండే దున్నపోతు మనస్థత్వం అన్నమాట” అన్నాడు. గిరీశం తలూపి ఏదో చెప్పబోయేంతలో బయట్నుంచి ఎవరో పిలిచారు. దాంతో గిరీశం వాళ్ళతో మాట్లాడడానికి బయట కెళ్ళాడు. ఈలోగా వెంకటేశం అక్కడున్న పడక్కుర్చీలో జారబడి చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. అందులో ఓ కలొచ్చింది.

—–

ఊరంతా పోస్టర్లు వెలిశాయి. అది తమ ఊరి ఎమ్మెల్యే అబ్బులు కనిపించడంలేదని..! కొందరు హుషారుమంతులయితే పోలీస్‌ స్టేషన్‌కి కూడా వెళ్ళి కంప్లెయింట్‌ యిచ్చారు. దాంతో ఎమ్మెల్యే గారి గురించి వేట మొదలయింది. అయితే సదరు ఎమ్మెల్యే యింకో వారం తర్వాత ఊళ్ళో రైలు దిగిన వెంటనే జనాలకి దొరికేశాడు. దాంతో ఊరిలో జనాలంతా గబగబా వచ్చేశారు. అయితే అందరినీ చూసి అబ్బులు బొత్తిగా అర్థంకానట్టు మొహంపెట్టి ”మీరంతా ఎవరూ?” అన్నాడు. దాంతో ఆ జనాలంతా అదిరిపోయారు. వారిలో బుల్లబ్బాయి ముందుకొచ్చి ”అంటే మేమెవరం గుర్తుకు రావడం లేదా?” అంటూ అడిగాడు. ఎమ్మెల్యే అబ్బులు అందరి వంకా చూసి ”అస్సలే మాత్రం గుర్తుకు రావడం లేదు” అంటూ తెగేసి చెప్పే శాడు. దాంతో అంతా ఓ నిర్ణయానికి వచ్చేసి అప్పటికప్పుడే అబ్బు లిని డాక్టర్‌ దగ్గరికి లాక్కుపోయారు. డాక్టర్‌ ఎడాపెడా పరీక్షలు చేసి, తర్వాత ఎవరికో ఫోన్లు చేసి, ఏవో వివరాలు అడిగాడు. తర్వాత అందరి వైపూ తిరిగి ”మరేం ఫరవాలేదు… వచ్చే సంవ త్సరం జనవరి ఒకటో తారీకుకల్లా మన ఎమ్మెల్యే అబ్బులు గారికి జ్ఞాపకశక్తి తిరి గొచ్చేస్తుంది. అప్పుడు మీరంతా పేరుపేరునా మరీ గుర్తుకొచ్చే స్తారు” అన్నాడు. దాంతో నిశ్చింతగా అందరూ వెనుదిరిగారు.

—–

ఎవరో తట్టిలేపేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే ఎదురుగా గిరీశం. ”ఏవివాయ్‌ వెంకటేశం.. యింత లోనే నిద్రపోయినట్టున్నావ్‌..” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవును గురూగారూ.. అందులో ఓ కల కూడా వచ్చింది” అంటూ తన కొచ్చిన కలేదో చెప్పాడు. అంతా విని గిరీశం ”అయితే నీ కలలో మతిమరపు గజినీ వచ్చా డన్నమాట.. సరే.. నీ కలకి ముక్తాయింపుగా యింతకు ముందు నాకొచ్చిన యింకో కల చెబుతా” అన్నాడు. దాంతో వెంకటేశం ఆసక్తిగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు.

—–

బుల్లబ్బాయికి అసలేవీ అర్థం కావడం లేదు. అసలు తన ఊళ్ళో జనాలంతా ఎందుకిలా మతిమరపు గజినీల్లో మారిపోతున్నారన్నది అర్థమయి చావడం లేదు. మామూలుగా అయితే బుల్లబ్బాయి అందరిలాంటివాడూ కాదు. ఊరికీ, జనాలకీ ఏదో మంచి జరగా లని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. అందుకే తన ఊళ్ళో జనాలంతా ఉన్నట్టుండి మతి మరపు గజినీలు అయిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నాడు. దాంతో ఏం చేయాలా అని ఆలోచించి తిన్నగా డాక్టర్‌ దైవాధీనం దగ్గరకెళ్ళి విషయమంతా చెప్పాడు. ”డాక్టర్‌గారూ.. మా ఊళ్ళో జనాలంతా మంచి జ్ఞాపకశక్తి ఉన్నవాళ్ళే. అయితే ఓ వారం నుంచీ… అదే.. మొన్న ఏప్రిల్‌ ఒకటి నుంచీ అన్నీ మరిచిపోయారు” అన్నాడు. దాంతో డాక్టర్‌ దైవాధీనం మరికొన్ని వివరాలు అడిగాడు. అప్పుడు బుల్లబ్బాయి వైపు తిరిగి ”మరేం లేదు బుల్లబ్బాయ్‌… యిదో ప్రత్యేకమయిన మాస్‌ మతిమరపు వ్యవహారం. అదీ ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే కనిపిస్తుంది. అది కూడా దాదాపు అయిదేళ్ళకోసారి వచ్చి ఒకట్రెండు నెలలుండిపోతుంది. యింకొక నెలాగితే తిరిగి వీళ్ళందరికీ మామూలు జ్ఞాపకశక్తి వచ్చేస్తుంది. అంతవరకూ ఎవరు చేయగలిగిందీ ఏం లేదు” అన్నాడు. ”అదోయ్‌.. నీ కలకి ముక్తాయింపు కల” అన్నాడు గిరీశం. దాంతో వెంకటేశం తలూపి ”యిదేంటి గురూగారూ.. ఈ రెండు కలలకీ సంబంధం ఏంటంటారు?” అన్నాడు. దాంతో గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”మన దేశంలో అందరూ సమయాను సారంగా మర్చిపోయే గజినీలే. ఎలక్షన్లయిన వెంటనే ఏరుదాటాక తెప్ప తగలేసే మన నాయకులూ, పార్టీలూ అసలయిన గజినీలు. వీళ్ళకి మళ్ళీ ఎలక్షన్లు ముంచుకొచ్చేవరకూ తాము చేసిన వాగ్ధా నాలూ, తమ ప్రజలూ గుర్తుకురారాయె. ఎలక్షన్స్‌కి రెండు నెలల ముందు నుంచి వీళ్ళకి ఆ మతిమరపు అంతా పోతుంది. తమ ఓటర్లంతా బ్రహ్మాండంగా గుర్తుకొచ్చేస్తారు. యిక ఈ ఓటరు జనాల్ని తీసుకున్నా పాపం వీళ్ళు కూడా ఎలక్షన్స్‌కి రెండునెలల ముందు నుంచీ మతిమరపు గజినీలుగా మారిపోతారు. తాము ఓటేసి గెలి పించినందుకు ఏ మాత్రం కృతజ్ఞత చూపించకుండా, తమని ఏమాత్రం పట్టించుకోకుండా, యిన్నాళ్ళూ నరకం చూపించిన ఆ నాయకుల, పార్టీల నిర్వాకాలన్నీ శుభ్రంగా మరిచిపోతారు. మళ్ళీ వాళ్ళకే ఓటేసి తమ ఔన్నత్యాన్ని చాటుకుంటారు. తర్వాత తిట్టు కోవడం మామూలే. అయితే ఓటరు బాపతు ఈ మతిమరపు వెనకా, తింగర ఔన్నత్యం వెనకా కారణం వాళ్ళకి తాత్కాలికంగా అందే నోటో, ప్యాకెట్టో, యింకో చీరో, బిందోలాంటి తాయిలాలు కావచ్చు. చెప్పొచ్చేదేంటంటే.. వ్యవస్థలో యిలాంటి గజినీ వ్యవస్థ నడిచి నంతకాలం జనాల బతుకులు యిలాగే ఉంటాయి. అలాగే నాయకులూ, పార్టీల పని మూడుపువ్వులు, ఆరుకాయలుగా ఉంటుంది” అన్నాడు.

– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here